మైనర్ బాలికల్లో దారుణమైన కుంగుబాటు

సామాజిక మాధ్యమాలను విపరీతంగా వినియోగించడం వల్ల మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌) కు గురయ్యే ప్రమాదం ఉందని, ఈ అలవాటు వల్ల మైనర్‌ బాలుర కన్నా బాలికలు రెండు రెట్లు అధికంగా సమస్యలు ఎదుర్కుంటున్నారని పరిశోధకులు గుర్తించారు. యూకేలోని ‘యూనివర్సిటీ కాలేజ్‌ లండన్’కు చెందిన‌ పరిశోధకులు చేసిన ఈ పరిశోధన ఫలితాలను ‘ఈ-క్లినికల్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురించారు. ఇందులో భాగంగా 11,000 మంది టీనేజర్లు, యువత నుంచి అభిప్రాయాలు సేకరించారు. వారిలో 14 ఏళ్ల వయసున్న బాలికలే అత్యధికంగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ వయసున్న ప్రతి ఐదుగురు బాలికల్లో ఇద్దరు, ప్రతి ఐదుగురు బాలురలో ఒకరు రోజుకి మూడున్నర గంటల కన్నా అధిక సమయం సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. వారి పరిశోధనలో పాలు పంచుకున్న బాలికల్లో కేవలం 4 శాతం మంది మాత్రమే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటుండగా, బాలురలో 10 శాతం మంది వీటికి దూరంగా ఉంటున్నారు. అలాగే, మొత్తం 12 శాతం మంది సామాజిక మాధ్యమాలకు తక్కువ సమయం కేటాయిస్తుండగా, 38 శాతం మంది ఐదేసి గంటల కన్నా అధికంగా వీటిని వినియోగిస్తున్నారు. వీరందరూ తీవ్ర మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ‘సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్న బాలుర కంటే బాలికల్లో కుంగుబాటు లక్షణాలు అధికంగా కనబడుతున్నాయి. తాము రోజులో గంట కన్నా అధికంగా వీటిని వినియోగిస్తామని చెప్పిన బాలికల్లో ఈ లక్షణాలు ఉన్నట్లు తేలింది. అదే సమయంలో రోజుకి మూడు గంటల కన్నా అధికంగా వీటిని వినియోగిస్తున్న బాలురలో కుంగుబాటు లక్షణాలు ఉన్నాయి’ అని పరిశోధకులు తెలిపారు. బాలికల్లో 40 శాతం మంది, బాలురలో 25 శాతం మంది ఆన్‌లైన్‌ ద్వారా వేధింపులు ఎదుర్కుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగిస్తున్న బాలికల్లో 40 శాతం మంది నిద్రకు సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటుండగా, బాలురలో 28 శాతం మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. వీటి వాడకం ద్వారా తలెత్తుతున్న నిద్రలేమి, ఆన్‌లైన్‌ వేధింపుల వల్ల చాలా మంది మానసిక కుంగుబాటుకు గురవుతున్నారని తేలింది. సామాజిక మాధ్యమాలకు బానిసలు కావద్దని, అతి కొద్ది సమయం మాత్రమే వాటిని వినియోగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com