పెనుగొండలో 90అడుగుల వాసవీమాత-ఆధ్యాత్మికం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా 90 అడుగుల వాసవీకన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో రూపొందించినట్టు అఖిలభారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్టు ప్రకటించింది. పంచలోహాలతో తయారుచేసిన ఈ విగ్రహాన్ని ఫిబ్రవరి 14న అక్కడే ప్రతిష్ఠించనున్నట్లు ట్రస్టు అధ్యక్షుడు డా.పీఎన్‌ గోవిందరాజులు, వెండి రథం కమిటీ ఛైర్మన్‌ రామ్‌పండు వెల్లడించారు. విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన కరదీపికను ఆదివారం హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ గవర్నర్‌, ట్రస్టు ప్యాట్రన్‌ కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ..వాసవీకన్యకా పరమేశ్వరి ఉత్సవాలతో పెనుగొండ వీధులు భక్తి పారవశ్యంతో విరాజిల్లనున్నాయన్నారు. ట్రస్టు ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వ్యయం రూ.45 కోట్లని, ఇందులో రూ.17 కోట్లను పంచలోహ విగ్రహ తయారీకే ఖర్చు చేశామన్నారు.
2. శబరిమల ఉద్రిక్తతలపై నివేదిక ఇవ్వండి
శబరిమల అయ్యప్పస్వామిని ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్న అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. భాజపా, సీపీఎం నేతల ఇళ్లపై జరిగిన దాడులకు దారి తీసిన పరిస్థితులు కూడా నివేదికలో ఉండాలని సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలు, ఆస్తి నష్టాలకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు కోరిన గవర్నర్‌ పి.సదాశివం‌.. శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని వివరించారు.మరోవైపు ఉద్రిక్తతను నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్న భాజపా వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కొట్టిపారేశారు. ఈ ఉద్రిక్తతలు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు సృష్టించినవేనని విమర్శించారు. ఈ తరహా రాజకీయాలను తమ ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. ఘర్షణలను కట్టడి చేయడంలో పోలీసుల వైఫల్యం ఏమీ లేదన్న ఆయన.. వారు సమర్థంగానే వ్యవహరించారని అన్నారు.
3. కమనీయం.. చినవెంకన్న కల్యాణం
దేశ రాజధాని దిల్లీలో చినవెంకన్న కల్యాణోత్సవం రెండోరోజైన ఆదివారం కనుల పండువగా జరిగింది. దిల్లీలోని తితిదే ఆలయం (ధ్యానమందిర్‌)లో పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను నయనానందకరంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువుదీర్చి అలంకరించారు. అనంతరం దేవస్థానం ప్రధాన అర్చకుడు రాంబాబు ఆధ్వర్యంలో వేద పండితులు కల్యాణ క్రతువు నిర్వహించారు. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాష్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
4. తిరుమలలో జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌
శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ దంపతులు ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారిని సోమవారం దర్శించుకుంటారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు అనంతరం తొలిసారిగా తిరుమలకు వచ్చిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్వాగతం పలికారు. తిరుపతిలో మంత్రి లోకేశ్‌ మర్యాద పూర్వకంగా కలుసుకుని స్వాగతం పలికారు. అనంతరం తిరుమల చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి మొదటగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి చేరుకున్నారు. ఇక్కడ తితిదే ఈవో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి దంపతులు భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.
5. బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయంపై దాడి
బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయంపై దాడి జరిగింది. తంగైల్‌ జిల్లా బాత్రా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తరంజన్‌ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం సొంత డబ్బులతో స్థలం కొని, అందులో గుడిని నిర్మించాడు. ఈ స్థలంపై కన్నేసిన కొందరు కబ్జాకోరులు చిత్తరంజన్‌ను వేధించేవారు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన తొమ్మిది మంది ఆలయంతో పాటు, ఆ పక్కనే ఉన్న చిత్తరంజన్‌ ఇంట్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు.
6. మల్లికార్జునస్వామికి దృష్టి కుంభం
ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలులోని మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇవాళ వేదపండితులు స్వామివారికి దృష్టికుంభం నిర్వహించారు. ఈ నెల 13 నుంచి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మల్లికార్జునస్వామికి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరిస్తూ రంగులు వేయిస్తున్నారు. గర్బగుడిలో క్వింటాలు అన్నంను రాశిగా పోసి కుంకుమ బొట్లతో అలంకరించి హరతులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు మధుమతి, ఈవో నాగేశ్వర్‌రావు, ఆలయ ఉప ప్రధాన అర్చకులు నందనం శివరాజయ్య, మాజీ ఆలయ కమిటి డైరెక్టర్ చందర్‌రావు, కుమారస్వామి(డీడీ), వేదపారయణదారు గట్టు పురుషోత్తమ శర్మ, పురోహిత్ ఐనవోలు మధుకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
7. 16 నుంచి అహోబిలేశుడి పార్వేట ఉత్సవం
అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి పార్వేట ఉత్సవాలు ఈనెల 16 నుంచి ఆరంభిస్తున్నట్లు ఈవో కామేశ్వరమ్మ తెలిపారు. 45 రోజుల పాటు 34 గ్రామాల్లో ఈ పార్వేట ఉత్సవం జరుగుతుందన్నారు. స్వామి పార్వేట పల్లకి 16వ తేదీన రాత్రి బాచేపలకు చేరగా అక్కడి నుంచి 18 ఉదయం కొండంపల్లె, మధ్యాహ్నం ఆర్‌.కృష్ణాపురం, 20 ఉదయం కోటకందుకూరు, 21వ రాత్రి మర్రిపల్లె, 22వ రాత్రి యాదవాడ, 23 రాత్రి ఆలమూరు, 26 రాత్రి తిమ్మనపల్లె, 27 సాయంత్రం నరసాపురం, 28 రాత్రి ముత్తలూరు, 29 మంగళవారం రాత్రి నల్లవాగుపల్లె, 30 రాత్రి చదలదిన్నె, బాచాపురం, 31 రాత్రి నరసారావుపేట, నాగిరెడ్డిపల్లె, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి పడకండ్ల, 3వ తేదీ ఉదయం ఆళ్లగడ్డ, 9 ఉదయం ఎస్‌.లింగందిన్నె, 10 ఉదయం సర్వాయిపల్లె, 12 ఉదయం ఆళ్లగడ్డ ఎంపీడీవో కార్యాలయం, పి.చింతకుంట, 13న ఉదయం దేవరాయపురం, రాత్రి గూబగుండం, 14 రాత్రి జంబులదిన్నె, 15 రాత్రి మందలూరు, 16 రాత్రి నక్కలదిన్నె, 17 రాత్రి చందలూరు, 18 రాత్రి చిలకలూరు, 19 రాత్రి తిప్పారెడ్డిపల్లె, 20 రాత్రి టి.లింగందిన్నె, 22 రాత్రి ఆర్‌.నాగులవరం, 23 రాత్రి తువ్వపల్లె, 24 సాయంత్రం రుద్రవరం చేరుతుందన్నారు. అక్కడి నుంచి మార్చి 1వ తేదీన అహోబిలం చేరుకుంటుందన్నారు.
8. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌, తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సినీ నటుడు నారా రోహిత్‌, రజనీకాంత్‌ సతీమణి లత, కుమార్తె ఐశ్వర్య వీరిలో ఉన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వీరంతా శ్రీవారిని దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్న జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌కు తితిదే అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. ఏపీ హైకోర్టు ఏర్పాటైన తరువాత ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
9. 20 నుంచి శ్రీవారి నిత్యోత్సవాలు
భవానీపురం పున్నమి ఘాట్‌ వేదికగా శ్రీవారి నిత్యోత్సవాలను ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీశ్రీనివాస వాసవి సేవా సమితి అధ్యక్షుడు దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. నిత్యోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం పున్నమి ఘాట్‌ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా సమితి 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో చేపట్టినట్లుగానే సుప్రభాత సేవ, ఏకాంత సేవ, ఆర్జిత సేవ, కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేస్తామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు గరిమెళ్ళ నానయ్య చౌదరి, వెంకటకృష్ణారావు, ఎం.లక్ష్మీకుమారి, ఉదయగిరి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
10. పంచాంగం 7-1-2019
సోమవారం (ఇందుv వాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంతఋతువు
పుష్యమాసం
శుక్లపక్షం
తిధి : పాడ్యమి ఉ7:44తదుపరి విదియ
నక్షత్రం :ఉత్తరాషాడరా7:28తదుపరి శ్రవణం
యోగం : హర్షణం
కరణం : బవ
సూర్యోదయం. :6:37
సూర్యాస్తమయం. :5:37
రాహుకాలం. :ఉ 7:30-9:00
యమగండం :ఉ 10:30-12:00
అమృత ఘడియలు. :మ 12:27-2:11
వర్జ్యం : రా11:53 – 1:35
దుముహూర్తం :మ12:29 – 1:17
మ241 – 3:౨౯

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com