శనీశ్వరుడికి ఇష్టమైన నెల ప్రారంభమైంది-ఆధ్యాత్మికం

విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు నొసగుతాడని పురాణ ప్రవచనం. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే్న శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారం భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్ర్తియ కోణం ఏంటంటే ఈ రెండూ ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి సమీపంలో ఉంటాడు కాబట్టి దీన్ని పుష్యమాసం అన్నారు పెద్దలు. పుష్యమాసం తొలి అర్ధ్భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి దాకా ఆ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని నమ్మిక. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైనది.ఇక, శుక్ల పక్షంలో వచ్చే అష్టమినాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్తద్రానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.
పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఇంద్రుడికి ప్రీతికరమైన భోగి పండుగగా ఆచరిస్తారు. తెల్లారకుండానే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినం. మకర సంక్రాంతి.ఆరోజు నుండీ భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని నేతితోనూ, నువ్వుపూలతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోతుందని, సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధనరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి, పూజిస్తారు.పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు. తెలకపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం.ఇలా ఆరు రకాలుగా నువ్వులను ఉపయోగించడం వల్ల ఆ రోజును షట్తివైకాదశి (షట్+తిల+ఏకాదశి) అంటారు. ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయ్లో ఒకటైన ‘తుల్యభాగ’ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
1. శ్రీవారి సేవలో జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ దంపతులు సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు అనంతరం ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారిగా తిరుమలకు రాగా తితిదే అత్యున్నత గౌరవ మర్యాదలతో ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీవారి దర్శనం కల్పించింది. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ మొదటగా శ్రీవారి పుష్కరిణికి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి దంపతులు పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. శ్రీవరాహస్వామివారిని దర్శించుకుని ప్రధాన ఆలయ మహద్వారం వద్దకు రాగా.. అక్కడి నుంచి మేళతాళాలతో స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సన్నిధిలో అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ దంపతులు తిరుమల నుంచి తిరుచానూరు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్‌లు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్ద జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ దంపతులకు స్వాగతం పలికారు.
2. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 64,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.23 కోట్లుగా ఉంది.
3. స్త్రీని గౌరవించి, పూజించడమే మన సంప్రదాయం
ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోను మహిళల్ని అణచివేయడం గమనించవచ్చు. వారు సంఘ పరంగా అనేక వివక్షల్ని ఎదుర్కొంటారు. ఇక ఆధ్యాత్మికంగా స్త్రీలకు ఎన్నో విధి నిషేధాలు ఉన్నాయి. కాని, భారతదేశంలో, అందునా ఆర్య సంస్కృతిలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. నిజమైన సంప్రదాయాన్ని పాటించే వారెవరూ స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించలేరు. అదే భారతీయ సంస్కృతి విశిష్టత. ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా స్త్రీది విశిష్ట స్థానమే. మిగతా దేవుళ్ళు, దేవతలు ఎందరు ఉన్నా ఆదిపరాశక్తిదే అగ్రస్థానం. మొదటి పూజ కూడా ఆ జగన్మాతకే. కుటుంబంలో మరలా తల్లిదే అగ్రస్థానం. ముందుగా ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి తలుచుకుని, మిగతా వారిని నిర్లక్ష్యం చేయమని ఆర్య జీవన విధానం నేర్పదు. కంటికి ఎదురుగా కనిపించే తల్లిదండ్రుల్నే ప్రత్యక్ష దైవాలుగా భావించమని చెబుతుంది వేదం. వారిలో తల్లికే మొదటి పూజ. ‘మాతృ దేవోభవ’ – ముందు తల్లికి నమస్కరించిన తరువాత తండ్రికి ‘పితృ దేవోభవ’. యజ్ఞ యాగాదులలో, పూజలు, క్రతువులలో పాల్గొనడానికి వివాహితుడు కాని వారికి, భార్యా వియోగం అయిన వారికి అర్హత లేదు. భార్యతో కలిసి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తేనే పూర్తి ఫలం దక్కుతుంది. అదీ స్త్రీకి ఉన్న ప్రాధాన్యత.ఇవన్నీ ఒక ఎత్తయితే, మనకు ఏ సంబంధం లేని పరాయి స్త్రీని కూడా మాతృ సమానురాలిగా, సోదర సమానురాలిగా చూడమని చెబుతుంది వేదం. పృధ్వీరాజ్‌ ఛౌహాన్‌, శివాజీ వంటి వీరులు కూడా తాము జయించిన రాజ్యంలోని పాలకుల భార్యలను సోదరి సమానంగా భావించి, సకల లాంఛనాలతో వారి రాజ్యాలకు సాగనంపారు. అదీ ఆర్య సంస్కృతి ఆచరణ అంటే..”స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటారనేది” ఆర్యోక్తి. మహిళకి భారతదేశంలో ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండనొల్లదు అనే భావన కూడా మహిళకు ఆర్య సాంప్రదాయంలో ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దేవీ నవరాత్రులు కూడా మహిళా శక్తి గొప్పదనాన్ని, మహిమను చాటిచెబుతాయి. స్త్రీని శక్తి స్వరూపిణిగా, పరాశక్తిగా, సృష్టి స్థితి లయలకు కారకులైనవారికి కూడా తల్లిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. విశ్వానికి అంతటికీ ఆధారభూతమైన, కారణమైన ఆ మహాశక్తి పురుష రూపంలో ఉండే అవకాశం లేదని రుషుల భావన. ఇంతటి మహావిశ్వాన్ని సృజించి, పెంచి, పోషించి, మరలా తనలోనే లయింపజేసుకొనే అన్ని శక్తుల మూల కారణం స్త్రీ స్వరూపమే. జగమంతటిలో ఉన్న ఇన్ని ప్రాణులకు అవసరమైనవన్నీ ఇచ్చి, చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ప్రతి పూటా అన్నిటికీ ఆశ్రయమిచ్చి, ప్రాణం నిలవడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసి, తన చల్లని ఒడిలో లాలించి, పాలించి, తల్లి ప్రేమను పంచే ఆ మహాశక్తి ముమ్మాటికీ అమ్మ మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే అంతటి ప్రేమను పంచి, అనురాగాన్ని కురిపించగలగడం తల్లికి మాత్రమే సాధ్యం. తండ్రి కేవలం బాధ్యత వహిస్తాడు. కాని, తల్లి తన జీవితాన్ని అర్పిస్తుంది. అందుకే విజయదశమికి అమ్మవారిని భావన చేస్తాము.స్త్రీని గౌరవించని, ఆమెకు ప్రాధాన్యమివ్వని ఏ నాగరికత అయినా, సమాజం అయినా మనుగడ సాగించలేదు. ఆమె సహకారం లేకుండా ఏ క్లిష్టమైన పనీ సాధ్యపడదు. ప్రతి ఇంటిలోను ఇంటిని చక్కబెట్టే ఇల్లాలిగా, పిల్లల్ని సంస్కారవంతులుగా, ఉన్నత సమాజ పౌరులుగా మార్చే గురుతరమైన బాధ్యత స్త్రీదే. ఏ ఇంటిలో స్త్రీ మానసిక, శారీరక వ్యధ అనుభవిస్తుందో ఆ కుటుంబం నుండి వచ్చే సంతానం నేరస్తులుగా మారే ప్రమాదం అంత ఎక్కువగా ఉందనేది సామాజిక నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవం. అది ముమ్మాటికీ నిజం కూడా.పత్రికల్లోను, తెర మీద కనబడే రంగుల వలయాల్లో బొమ్మల్ని చూసి, గోల చేస్తూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, నీచమైన ఆనందం పొందే నేటి తరానికి ఈ విలువల ప్రాధాన్యం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్ల అంటే వ్యాపార వస్తువు కాదు, మగవారి కోర్కెలు తీర్చే బానిసా కాదు. బస్సుల్లో, రైళ్ళల్లో, రోడ్లమీద, కాలేజీల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కంటికి కాస్త నదురుగా కనబడే ప్రతి ఆడపిల్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండేవారికి ఈ దేవీ నవరాత్రులలో స్త్రీశక్తి ప్రాధాన్యతను తెలపాలి. ఆడపిల్ల కనపడిందంటే చాలు, ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, తామేదో గొప్ప వీరప్రేమికుల స్థాయిలో పోజలు కొట్టే వారికి, నిజమైన ప్రేమ రుచి చూడాలంటే అదే అమ్మాయిని మాతృ సమానంగా, సోదరి సమానంగా చూస్తే చాలు. అప్పుడే ఆమె నిజమైన ప్రేమను కురిపిస్తుంది. ఆడదంటే అబల కాదు, అవసరం వచ్చినపుడు ఆమే పరాశక్తిగా మారి దుష్ట సంహారం చేసి, లోక రక్షణ చేస్తుందనే సందేశాన్ని సకల లోకానికి తెలపడమే ఈ దేవీ నవరాత్రుల ముఖ్య ఉద్దేశం. ఈ సందేశం కేవలం భారతదేశానికే కాక, సకల ప్రపంచానికి కనువిప్పు కావాలని ఆశిద్దాం.
4.తిరుమల సమాచారం
ోజు మంగళవారం 08-01-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….శ్రీ వారి దర్శనానికి 01 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది.. నిన్న జనవరి 7 న 64,147 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.23 కోట్లు.
5. భవానీ దీక్షల మూడో విడత ఆదాయం రూ.7.77 లక్షలు
శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన భవానీ దీక్షల్లో వచ్చిన ఆదాయాన్ని మూడో విడత సోమవారం లెక్కించారు. అన్ని హుండీల్లో మిగిలిన చిల్లర నాణేలను లెక్కించగా రూ.7,77,918 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 13 గ్రాముల బంగారు వస్తువులు, 2.870 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. చివరి విడత హుండీ ఆదాయం లెక్కింపులో వచ్చిన బంగారం, వెండి వస్తువులను ఈవో కోటేశ్వరమ్మ స్వయంగా పరిశీలించారు. దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
* శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి రూ.1,09,999 విరాళాన్ని గుంటుపల్లికి చెందిన ఎ. సుధాకరరావు సోమవారం అందజేశారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబు, సూపరింటెండెంట్‌ చందు శ్రీనివాస్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
***రామవరప్పాడు ఆలయంలో..
రామవరప్పాడులోని శ్రీవెంకమ్మ పేరంటాలు అమ్మవారి ఆలయంలో భక్తులు సరమర్పించిన కానుకలు సోమవారం లెక్కించినట్లు ఆలయ ఈవో నేల సంధ్య తెలిపారు. 52 రోజుల హుండీ కానుకలు లెక్కించగా రూ.2,54,826 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అధికారి సృజన్‌, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
6. నేటి పంచాంగం
తేది : 8, జనవరి 2019
సంవత్సరం : విళంబినామ
సంవత్సరం
ఆయనం : దక్షిణాయణ
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం (భౌమవాసరే)
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(నిన్న ఉదయం 9 గం॥ 19 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 54 ని॥ వరకు విదియ తిధి తదుపరి తదియ తిధి)
నక్షత్రం : శ్రవణము
(నిన్న రాత్రి 8 గం॥ 36 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 40 ని॥ వరకు శ్రవణానక్షత్రం తదుపరి ధనిస్టా నక్షత్రం)
యోగము : వజ్రము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 6 గం॥ 1 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 45 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 34 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 37 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మకరము
7. నేటి సుభాషితాలు
ఉడకేసుకొని తిని…తడికేసుకొని పడుకున్నట్టుపని ఒత్తిడేమీ లేకుండా సాఫీగా కాలం సాగిపోవటం హాయిగా కావాల్సింది వండుకుని తినటం, చక్కగా నిద్రపోవటం
** నేటి సామెత
కందకి లేని దురద కత్తిపీట కెందుకు?
కందను కత్తిపీటతో తరిగి వంట చేస్తారు. తరగబడ్డ కందకు లేని బాధ, తరిగిన కత్తిపీటకు ఉండదు కదా. ఈ విషయాన్నే, ఎవడైనా బాధితుడికి, తాను పడిన కష్టం తాలూకు బాధ లేకపోయిన సందర్భములో ఈ సామెతను వాడెదరు.
*నేటి సుభాషిత
అవివేకులు నిరంతరం మాట్లాడే మాటల కన్నా.. జ్జానులు మాట్లాడే ఒక్క మాటకు ఎంతో విలువ ఉంటుంది.- స్వామి వివేకానంద
* నేటి ఆణిముత్యం
దక్షుఁడు లేనియింటికిఁ బదార్థము వేఱొక చోట నుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ గల్లగాదు ప్ర
త్యక్షము వాఁగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయ మైనగండి తెగినట్టి తటాకములోన భాస్కరా!
*భావం:
మితంగా, తెలివిగా ప్రతిదీ తెలిసి ఉపయోపగించుకునే యజమానిలేని యింటికి, ఎన్ని వస్తువులు లక్షలుగా వచ్చిపడినా, వెంటనే ఎక్కడివక్కడ పోవునుగానీ, లాభము లేదు. గండిపడిన చెరువులో ఏరులు, వాగులు ఎన్ని వచ్చి చేరినా చుక్క నీరు నిలువదు కదా?

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com