ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం-ఆధ్యాత్మికం

1.శ్రీవారి సేవలో బాలకృష్ణ బృందం– తదితర ఆద్యాత్మిక వార్తలు
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం దర్శించుకున్నారు. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం బుధవారం విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర నటీనటులు విద్యాబాలన్‌, సుమంత్‌, కొర్రపాటితో కలిసి చిత్రబృందం సోమవారం రాత్రి తిరుమలకు చేరుకుంది. ఉదయం స్వామివారి సేవలో పాల్గొంది. హుండీలో కానుకలు సమర్పించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి రాగా.. అక్కడ పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నటీనటులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం ఎదుట బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ‘కథానాయకుడు చిత్రం విడుదల నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చాం. నాన్న ఎన్టీఆర్‌ పాత్రలో నటించే మహాభాగ్యం కలిగింది. చిత్రం విజయవంతం కావాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించాన’ని అన్నారు. బాలకృష్ణను చూడటానికి భక్తులు, అభిమానులు పోటీపడ్డారు.
2.శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవల నిలుపుదల
శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 12 నుంచి 18 వరకు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆ రోజుల్లో శాశ్వత, పలు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నారు. విషయాన్ని ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి మంగళవారం పేర్కొన్నారు.
3.అమరావతిలో శ్రీవారి ఆలయానికి 31న శంకుష్టాపన
అమరావతిలో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని అనుసంధానిస్తూ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ(భూకర్షణ)లో భాగంగా ఈనెల 31న ఉదయం ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ క్రతువు చేపట్టాలని సంకల్పించింది. రూ.150కోట్లతో చేపట్టనున్న ఆలయానికి ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేయాలని తీర్మానించింది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే నాలుగు దశల్లో పిలిచిన టెండర్లకు ఆమోదముద్ర వేసింది. తిరుమలలో మంగళవారం ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన తితిదే పాలకమండలి సమావేశం జరిగింది. తీర్మానాలు, నిర్ణయాలను అధ్యక్షుడితో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.
* తిరుపతిలోని అలిపిరి వద్ద భక్తుల కోసం 2వేల గదుల నిర్మాణంలో భాగంగా తొలిదశలో 384 గదుల నిర్మాణానికి రూ.67.29 కోట్లతో టెండర్లకు ఆమోదం
* తిరుమలలో స్మార్ట్‌ డేటా కేంద్రం ఏర్పాటుకు రూ.2.63 కోట్లు, తిరుపతిలో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటరుకు హార్డ్‌వేర్‌ కోసం రూ.1.97కోట్ల నిధుల మంజూరు
* అర్చకుల వ్యవహారంపై అప్పీలుకు వయోపరిమితి నిబంధనతో ఉద్యోగ విరమణ చేసిన ఇద్దరు అర్చకుల విషయంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇటీవలి న్యాయస్థానం తీర్పు, నూతనంగా నియమితులైన అర్చకుల భవిష్యత్తుపై చర్చించారు. కోర్టు తీర్పును అమలుచేస్తే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, కొత్తగా నియమితులైన వారి భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ద్వారానే అప్పీలుకు వెళ్లాలని బోర్డు తీర్మానించింది.
4. తిరుమలలో జానపదుల ఆందోళన
తిరుమల దివ్యక్షేత్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తితిదే ఆలయాల్లో, మనగుడి కార్యక్రమాల్లో భజనలు చేసే జానపద కళాకారులకు ప్రయాణ భత్యం చెల్లించాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. తమ దీర్ఘకాల డిమాండును నెరవేర్చాలంటూ వేలాదిగా కళాకారులు తిరుమలకు వచ్చి ఆందోళనకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కళాకారుల సంఘం ప్రతినిధులు పులిమామిడి యాదగిరి ఆధ్వర్యంలో మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో తిరుమల శంఖుమిట్ట కూడలికి చేరుకున్నారు. ధర్మకర్తల మండలి సమావేశం జరిగే అన్నమయ్య భవనానికి వెళ్లే మార్గంలో బైఠాయించారు. గజగజలాడించే చలిలో ఉదయం వరకూ అక్కడే నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్‌, పోలీసు అధికారులు వ్యవహారాన్ని తితిదే అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కళాకారుల సంఘం అధ్యక్షుడితో పాటు ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. మండలి సభ్యులు నూతలపాటి శ్రీకృష్ణ, చల్లా రామచంద్రారెడ్డి బోర్డు సమావేశంలో వీరి డిమాండ్లపై స్పందించారు.అధ్యక్షుడితో పాటు ఇతర సభ్యులు కూడా న్యాయం చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. దూరాన్ని బట్టి కళాకారులకు ప్రయాణభత్యం చెల్లించాలని నిర్ణయించారు. ఈ ప్రకటన వెలువడటంతో కళాకారులు ధర్మకర్తల మండలికి కృతజ్ఞతలు తెలిపి నిరసన విరమించారు.
5. యాదాద్రిలో వ్రత మండపం
సత్యనారాయణస్వామి వ్రతాలు జరుపుకుని మొక్కులు తీర్చుకునే భక్తజనులకోసం యాదాద్రి పుణ్యక్షేత్రం సరికొత్త మండప నిర్మాణం జరుపుకొంటోంది. మూడంతస్తులతో కూడిన ఈ మండపంలో ఒకేసారి 750 కుటుంబాలు కూర్చుని వ్రతాన్ని ఆచరించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) చేపట్టిన ఆలయ పునర్నిర్మాణంతో సహా వ్రత మండపాన్ని నిర్మిస్తోంది.
*విమాన గోపురంపై అమరికలు
లక్ష్మీనారసింహుడి ఆలయ విమాన గోపురంపై రాజవిగ్రహాలను అమర్చే పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం అధోచ్ఛాయన, అచ్యుతుడు, పురుషోత్తముడి విగ్రహాలను అమర్చినట్లు స్తపతి ఆనందచారి వేలు, ఉపస్తపతి మోతిలాల్‌ తెలిపారు. మరో పది రోజుల్లో విమాన గోపురం విగ్రహాలతో సంపూర్ణ ఆకృతి పొందుతుందన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో అష్టభుజ మండప ప్రాకారాలు రూపొందుతున్నాయి.
6. రథయాత్ర వేడుకలకు శుభారంభం -కలప సేకరణకు బయలుదేరిన సేవాయత్‌లు
విశ్వప్రసిద్ధ పూరీ రథయాత్ర వేడుకలకు శుభారంభం అయింది. నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌(జగన్నాథ, బలభద్ర, సుభద్ర) రథాల తయారీకి అవసరమయ్యే కలప సేకరణకు సేవాయత్‌ల బృందం మంగళవారం నయాగఢ్‌ చేరుకుంది. దీనికి ముందుగా సోమవారం సాయంత్రం శ్రీక్షేత్రంలో పురుషోత్తమ సన్నిధిలో పూజలు నిర్వహించారు. తర్వాత ఆజ్ఞ(పుష్ప)మాలతో అయిదుగురు సభ్యుల బృందం బయలుదేరింది. నయాగఢ్‌ జిల్లా గొణియా గ్రామం చేరుకున్న వారంతా ఇక్కడ బొడోరవులి మఠంలో పూజ చేసి జగన్నాథ వనానికి ప్రవేశించారు. రథయాత్రలో భాగంగా మూడు రథాల తయారీకి 865 కలప దుంగలు అవసరం అవుతాయి. శ్రీక్షేత్ర యంత్రాంగం వద్ద గతేడాదికి మిగిలిఉన్న 195 దుంగలు ఉన్నాయి. మిగతా వాటిని గొణియా, దసపల్ల అటవీ ప్రాంతాల నుంచి సేకరిస్తారు. వీటిని పూరీ చేర్చిన తర్వాత శ్రీపంచమి(ఫిబ్రవరి 10) పర్వదినాన కలపకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం కోత పనులు ప్రారంభిస్తారు. అక్షయ తృతీయ(మే 7) నుంచి రథాల నిర్మాణం ప్రారంభిస్తారు. జులై 4న పురుషోత్తముని రథయాత్ర వేడుక ఏర్పాటవుతుంది.
7. ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం
తిరుపతిలోని అలిపిరి వద్ద 67.9 కోట్ల రూపాయలతో 346 గదుల నిర్మాణం చేపట్టనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు. అదేవిధంగా… తిరుమలలో భద్రత పర్యవేక్షణకు రూ. 15 కోట్లతో 1050 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏటీసీ వద్ద క్యూలైన్‌ నిర్మాణం కోసం రూ. 17.21 కోట్లు, తిరుమలలో స్మార్ట్‌ డేటా వినియోగ ఏర్పాటుకై రూ. 2.63, పలమనేరు గోశాల అభివృద్ధికి రూ. 40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
**ఏజెన్సీ ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు
శ్రీవారి ఆలయ ఆగమ సలహామండలి సభ్యులుగా అనంతశయ్య దీక్షితులను నియమించినట్లు సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు. విజయనగరంలోని పార్వతిపురంలో రూ. 2.97 కోట్లతో, శ్రీకాకుళంలోని సీతంపేటలో రూ. 2.83 కోట్లతో, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రూ. 2.97 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద రూ. 2.27 కోట్లతో కళ్యాణమండప నిర్మాణం చేపడతామన్నారు.
8. గుడికి ఎందుకు వెళ్ళాలి?
మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము – benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.
9. తిరుమల సమాచారం
ఈరోజు బుధవారం *09-01-2019* ఉదయం *5* గంటల సమయానికి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….శ్రీ వారి దర్శనానికి *01* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి *5* గంటల సమయం పడుతోంది.ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *03* గంటల సమయం పడుతోంది.. నిన్న జనవరి *8* న *66,022* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹:3.08* కోట్లు.
10. తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 66,022 మంది భక్తులు దర్శించుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com