కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ-తాజావార్తలు-01/09

* మహాకూటమిలో తమ పార్టీ ఉండబోదని బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.
అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు తాము దూరంగా ఉంటామని ఆయన చెప్పారు. మంగళవారం కూడా ఈ అంశంపై స్పందించిన పట్నాయక్.. మహాకూటమిలో చేరడంపై తమ పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే ఆ మరుసటి రోజే కూటమిలో ఉండబోవడం లేదని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. బీజేడీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించారు. వరికి కనీస మద్దతు ధరను పెంచాలని తాము ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పట్నాయక్ విమర్శించారు.
మొదటి నుంచి బీజేడీ తటస్థ వైఖరినే అవలంబిస్తున్నది. బీజేడీకి కంచుకోటగా మారిన ఒడిశాలో తన మార్క్ చూపించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లో కేవలం ఒక్క స్థానంలో బీజేపీ గెలవగా.. మిగిలిన 20 స్థానాలనూ బీజేడీ గెలుచుకుంది. అయితే 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించడంతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై బీజేపీ దృష్టి సారించింది.
* ఏయూ కట్టమంచి రామలింగారెడ్డి హాల్‌లో 85, 86వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి గంటా, ఏయూ వీసీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే చీఫ్ గెస్ట్‌ గా ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ ఆచార్య రామగోపాల్‌ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగోపాల్‌కు గవర్నర్ నరసింహన్ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. అలాగే 546 మందికి డాక్టరేట్‌లు, ఆరుగురికి డిగ్రీలను ప్రదానం చేశారు. 573 మంది విద్యార్థులకు పతకాలను గవర్నర్ నరసింహన్ బహూకరించారు.
* ఫిబ్రవరి 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల తేదీలను పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం ఇవాళ ఖరారు చేసింది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. 2019-20 బడ్జెట్ కు సంబంధించి గతేడాది అక్టోబర్ నుంచి ఆయా శాఖల నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరుతోంది.
* తిరుపతిలోని వైకుంఠపురంలో రూ.74 లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్ రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, అధికారులు.
* కే ఎల్ యూనివర్సిటీ లో యంగ్ ఆర్మీ ఆవిర్భావంయువతకు భవిత ..సమాజహితం వేదికగా కొత్త వేదికకు నాంది4000 మందితో మొదటి సమ్మేళనంరెండు నెలల్లో పది లక్షల కంటే ఎక్కువ మంది యువతను ఒకే వేదిక మీద చేర్చేందుకు కసరత్తుజస్ట్ మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వం.
*ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ 2019 ఎడిషన్ భారత్‌లోనే జరగనుంది. సుప్రీం కోర్టు నియమిత క్రికెట్‌ పాలకుల కమిటీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఎప్పటిలా ఏప్రిల్‌ మొదటి వారంలో కాకుండా మార్చి 23న ఐపీఎల్‌ ప్రారంభమవుతుందని కమిటీ వెల్లడించింది. త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు. లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో భద్రత కల్పించడం కష్టమవుతుందని పొట్టి క్రికెట్‌ లీగ్‌ను విదేశాలకు తరలిస్తారని ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే.
*ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 29న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులు, గ్రాడ్యుయేట్‌, అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులు చేస్తున్న కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. MyGov.in లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ నెల 29న ఇక్కడి తాల్కాతోరా స్టేడియంలో నిర్వహించే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం ద్వారా ప్రధానితో మాట్లాడే అవకాశం లభిస్తుంది.
*సీబీఐ అంతర్గత కుమ్ములాట అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను తిరిగి ఆ పదవిని చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. అనూహ్య రీతిలో ఆయన అధికారాలను ఉపసంహరించి, బలవంతపు సెలవుపై పంపుతూ కేంద్రం, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) గత ఏడాది అక్టోబరులో అర్ధరాత్రి సమయంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు మంగళవారం కొట్టేసింది.
*మంత్రివర్గ విస్తరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముమ్మర కసరత్తు సాగిస్తున్నారు. జిల్లాల ప్రాతిపదికన అమాత్యులను ఎంపిక చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నారు. ప్రతి జిల్లాకు మంత్రి లేదా పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శి పదవి ఇచ్చే వ్యూహంలో సీఎం ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. మంత్రివర్గంలో 18 మందిని తీసుకునే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌, హోంమంత్రి మహమూద్‌అలీని మినహాయిస్తే మరో 16 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించే వీలుంది. మొదటి విడత విస్తరణలో 8 మందికి స్థానం కల్పించాలని సీఎం భావిస్తున్నారు.
*గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీలకు నిర్వహించే వేలం పాటలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. కొన్నిచోట్ల సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు వేలం పాటలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది.
*వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర తుది అంకానికి చేరింది. ఇడుపులపాయలో 2017 నవంబరు 6న ప్రారంభమైన ఈ పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. మొత్తం 341 రోజుల్లో ఆయన సుమారు 3,648 కిలోమీటర్లు నడిచారు.
*సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద తెలంగాణలో చేపట్టిన దేవాదుల (చొక్కారావు ప్రాజెక్టు), శ్రీరాంసాగర్‌-2, పాలెం వాగు పథకాల వల్ల ఆశించిన ఫలితం రాలేదని కాగ్‌ ఆక్షేపించింది. అంచనా వ్యయాలు భారీగా పెరిగినా అనుకున్న స్థాయిలో సాగునీరు మాత్రం అందలేదని పేర్కొంది.
*రాష్ట్రంలో నియమిత పదవుల పంపిణీ ప్రారంభమైంది. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన తెరాస నేత మారెడ్డి శ్రీనివాసరెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా మంగళవారం నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.
*రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం కుట్రపూరితమని జాతీయ ఓబీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు రాజ్యాంగం, సామాజిక న్యాయం, సమానత్వం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు.
* యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు మనమే గెలవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. టీఎన్జీవోల నగర కమిటీ దైనందిని, కాలమానినిల ఆవిష్కరణ సభ మంగళవారం రాత్రి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది.
*పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకునే ఇంజినీరింగ్‌ కళాశాలలకే అనుమతులు ఇచ్చేలా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధన విధించింది. తద్వారా ఉపాధి అవకాశాలను పెంచే దిశగా చర్యలకు ఉపక్రమించింది.
*తెలంగాణ డిస్కంలు ఏపీ జెన్‌కోకు రూ. 5,127.70 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు. ‘విద్యుత్తు బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు పోట్లాడుకుంటున్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసా?’’ అంటూ రాజ్యసభలో ఎంపీ డి.శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు మంగళవారం ఆయన సమాధానమిచ్చారు. ‘‘విభజన చట్టం ప్రకారం ఏపీ జెన్‌కో 53.89% విద్యుత్తును తెలంగాణ డిస్కంలకు విక్రయించాల్సి ఉంది.
*తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 24 జవహర్‌ నవోదయ విద్యాలయాల(జేఎన్‌వీ)లో వచ్చే విద్యాసంవత్సరం మొత్తం 192 సీట్లు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా జేఎన్‌వీలలో 5,000 సీట్లు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ప్రారంభ తరగతిలో 10శాతం సీట్లు పెంచుతున్నారు. అంటే, 6వ తరగతిలో ప్రస్తుతం ఉన్న 80 సీట్లు ఇక 88 అవుతాయి. తెలంగాణలో 9, ఏపీలో 15 విద్యాలయాలు ఉన్నాయి. వాటికి ఈ సీట్ల పెంపుదల వర్తిస్తుంది. ఉత్తర్వులు త్వరలో రావచ్చని జేఎన్‌వీ హైదరాబాద్‌ రీజియన్‌ ఉప కమిషనర్‌ ఏవై రెడ్డి తెలిపారు.
*జాతీయ వినియోగదారుల కమిషన్‌ తాత్కాలిక బెంచ్‌ ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు హైదరాబాద్‌ వేదికగా పనిచేయనుంది. హైదరాబాద్‌ ఆదర్శనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్‌ సమావేశ మందిరంలో తాత్కాలిక బెంచ్‌ విధులు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ సహాయ రిజిస్ట్రార్‌ వి.జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. జాతీయ కమిషన్‌ పరిధిలోని అప్పీళ్లు, పిటిషన్లు, రివిజన్‌ పిటిషన్లను దాఖలు చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు.
*ఇంటర్‌మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ‘పర్యావరణ విద్య’ పరీక్షను ముందు తెలిపినట్లు ఈనెల 30వ తేదీన కాకుండా 31న నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. 30న పంచాయతీ ఎన్నికలు ఉన్నందున పరీక్ష తేదీని మార్చినట్లు కార్యదర్శి అశోక్‌ చెప్పారు. నైతికత, మానవీయ విలువల పాఠ్యాంశంలో పరీక్ష యథావిధిగా 28వ తేదీన జరుగుతుందన్నారు.
*మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్‌ అప్సరా రెడ్డి నియమితులయ్యారు. కాంగ్రెస్‌ చరిత్రలో పార్టీ ఆఫీసుబేరర్‌గా ఓ ట్రాన్స్‌జెండర్‌ను నియమించడం ఇదే ప్రథమం. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తదితరులతో అప్సరా రెడ్డి ఉన్న ఫొటోను కాంగ్రెస్‌ మంగళవారం ట్విటర్‌లో ఉంచింది.
*రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లిలో కియా పారిశ్రామిక ప్రాంత పోలీస్‌స్టేషన్‌ ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
* ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలై పట్టభద్రులు కాలేకపోయిన వారికి సువర్ణావకాశం లభించింది. బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులను మళ్లీ రాసుకొని డిగ్రీ పట్టా పొందే అవకాశాన్ని ఏయూ యూజీ పరీక్షల విభాగం ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా అవకాశం కల్పిస్తోంది.
* బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు మంత్రులు, అధికారులు మంగళవారం వీడ్కోలు పలికారు. ఆర్టీజీఎస్‌ పనితీరు పరిశీలనకు సోమవారం ఆయన అమరావతికి వచ్చిన విషయం తెలిసిందే. రాత్రి విజయవాడ నోవాటెల్‌ హోటల్‌లో బస చేశారు. మంగళవారం ఉదయం 8.26 గంటలకు గన్నవరం విమానాశ్రంనుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనకు వీడ్కోలు పలికిన వారిలో మంత్రులు లోకేశ్‌, నక్కా ఆనందబాబు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, ప్రొటోకాల్‌ అధికారి కల్నల్‌ అశోక్‌బాబు, విజయవాడ డీసీపీ గజరావు భూపాల్‌ తదితరులు ఉన్నారు.
*రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా జాబితా ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను ఈ నెల 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకూ తెలపవచ్చు. వాటిని పరిశీలించి ఫిబ్రవరి 17వ తేదీన సప్లిమెంటరీ ఓటర్ల జాబితాలను తయారు చేసి, తుది జాబితాను 20 తేదీన ప్రచురిస్తారు
*విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్టోగ్రతలు కొనసాగుతున్నాయి.
చల్లగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. చలి తీవ్రత రాత్రివేళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఏజెన్సీలో కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. పాడేరులో 7, మినుములూరులో 5 డిగ్రీల ఉష్టరత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, పసి పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా సూర్యుడు ఉదయం 11 గంటల తర్వాతే దర్శనమిస్తుండటం గమనార్హం.
* సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో గల సీబీఐ కేంద్ర కార్యాలయంలో మూడు నెలల విరామం అనంతరం ఆయన నేడు బాధ్యతలు స్వీకరించారు. సెలవుపై పంపుతూ కేంద్రం, సీవీసీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిన్న కొట్టివేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలోక్ వర్మ మళ్లీ విధులకు హాజరైయ్యారు
* పశ్చిమ్‌బంగాలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ రైల్వే ట్రాక్‌పై బాంబు కలకలం సృష్టించింది. స్థానిక అశోక్‌నగర్‌లోని రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువును గుర్తించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు.
* నకిలీ ఏజెంట్లను నమ్మి ఉపాధి కోసం ఇరాక్‌ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన నిజామాబాద్‌ జిల్లా వాసుల చేతులకు వారి పాసుపోర్టులు అందాయి. పని ఇప్పిస్తామంటూ పాస్‌పోర్టు లాక్కొని అక్కడి ఏజెంట్లు మోసగించిన క్రమంలో పదకొండు మంది చీకటి గదిలో బస చేస్తూ ఆకలితో అలమటించారు. ఈ విషయంపై మంగళవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా బాధితుల తరఫున అక్కడి తెలంగాణ వాసులు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా సమస్యపై కదలిక వచ్చింది. అక్కడి పోలీసుల సహాయంతో బాధితులకు వారి పాస్‌పోర్టులు అందాయి. వారు ఇక్కడికి రావాలంటే తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి కేంద్ర విదేశాంగశాఖకు లేఖ వెళ్లాలి. అక్కడి నుంచి భారత రాయబార కార్యాలయానికి బాధితులకు టిక్కెట్లు సిద్ధం చేసి తిప్పి పంపే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు వెళ్లాల్సి ఉంటుంది. ఇరాక్‌ బాధితుల తరఫున అక్కడి వారు రాయబార కార్యాలయం చుట్టూ తిరగడంతో వారు స్పందించి పోలీసులతో మాట్లాడారని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధికారి చిట్టిబాబు తెలిపారు. తమ సంస్థ ప్రతినిధుల సహకారంతోనే ఇరాక్‌ బాధితులకు పాస్‌పార్టులు దక్కాయని గల్ఫ్‌ తెలంగాణ సంఘం సంక్షేమ, సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు బసంత్‌రెడ్డి చెప్పారు.
* చిన్న,మధ్య వ్యాపార పత్రికలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వ్యాపార పత్రికలకు జారీ చేసే ప్రకటనల రేట్లను 25శాతం పెంచింది. ప్రింట్ మీడియాలో ప్రకటన రేట్లు సవరిస్తూ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. 8 వ రేట్ స్ట్రక్చర్ కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సవరించిన రేట్లు మంగళవారం నుంచి మూడు సంవత్సరాల పాటు అమల్లో వుంటాయని ప్రకటించింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్‌ కమ్యూనికేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. అంతర్జాతీయంగా న్యూస్‌ ప్రింట్‌, ప్రాసెసింగ్‌ చార్జీలు, ఇతర కారణాల రీత్యా ఈ పెంపును చేసినట్టు వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయం ముఖ్యంగా ప్రాంతీయ మరియు స్థానిక భాషలలోని చిన్నపత్రికలకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఈ నిర్ణయంపై విమర్శనలు గుప్పించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామన్న భయంతో పాలక పార్టీ బీజేపీ వేసిన మరొక ఎత్తుగడగా పేర్కొంది. డబ్బుతో మీడియాను నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు.కాగా గత ఎన్నికల సందర్భంగా 2013లో వ్యాపార ప్రకటనల రేట్లు పెరిగాయి. 2010 నాటి నుంచి 19 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు ప్రింట్‌ మీడియా ప్రకటనల రేట్లను ప్రభుత్వం 25శాతం పెంచడంతో హెచ్‌టీ మీడియా, జీ, జాగ్రన్‌ ప్రకాశన్‌, డిబీ కార్పొ తదితర మీడియా షేర్లు ఇవాల్టి(జనవరి 9) మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com