మంత్రి గంటాకు వేదికపైన క్లాసు పీకిన గవర్నర్

వైద్య రంగంలో ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని, విద్యారంగంలో ఆ పరిస్థితి రానీయొద్దని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌, ఏయూ కులపతి నరసింహన్‌ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేటు వర్సిటీలతో పోటీ పడాలంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అలా అనడం నేరమని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వేదికపై బుధవారం చోటుచేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 85, 86వ ఉమ్మడి స్నాతకోత్సవాన్ని బుధవారం విశాఖపట్నంలోని సర్‌ సీఆర్‌రెడ్డి మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్య అతిథిగా ఐఐటీ- దిల్లీ సంచాలకులు వి.రామ్‌గోపాల్‌రావు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగానికి ఏటా రూ.25 వేల కోట్లు వెచ్చిస్తూ రాష్ట్రంలో విజ్ఞాన సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని, వాటితో పోటీ పడి ప్రభుత్వ వర్సిటీలు ఎదగాలని సూచించారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో ప్రభుత్వ వర్సిటీలు పోటీ పడలేవని పేర్కొన్నారు. వర్సిటీల్లో పలు నియామకాలకు, పదోన్నతులకు పీహెచ్‌డీ చేసి ఉండాలన్న నిబంధన విధిస్తుండడంతో చాలా మంది వ్యక్తిగత ఆసక్తితో సంబంధం లేకుండా పీహెచ్‌డీ చేస్తున్నారని వాపోయారు. ‘‘ఎంతమంది పరిశోధనలు నాణ్యంగా ఉంటున్నాయి? ఎన్ని పరిశోధనలు సమాజానికి ఉపయుక్తంగా ఉంటున్నాయి? ఒక ఆచార్యుడు ఎంతోమందితో పీహెచ్‌డీలు చేయిస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? బీఏ, బీకాంల మాదిరిగానే పీహెచ్‌డీలను కూడా ఒక డిగ్రీ తరహాలో చేస్తున్నారు. కట్‌, కాపీ, పేస్ట్‌’ సంస్కృతి ఎక్కువగా ఉంటోంది. దీనిపై దేశవ్యాప్తంగా సమీక్ష జరగాలి’’ అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్‌ నరసింహన్‌.. 546 మందికి డాక్టరేట్‌లు, ఆరుగురికి ఎంఫిల్‌ డిగ్రీలు, వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 573 మందికి పతకాలను ప్రదానం చేశారు. ఆచార్య రామ్‌గోపాల్‌రావుకు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. వంద శాతానికి దగ్గరగా అత్యధిక మార్కులు వచ్చిన వారికే వివిధ సంస్థల్లో ప్రవేశాలు దక్కుతుండడంతో విద్యార్థులు యంత్రాల్లా మారాల్సిన పరిస్థితి తలెత్తిందని గవర్నర్‌ అన్నారు. ఇటీవలి కాలంలో కృత్రిమ మేధే గొప్పదన్న ప్రచారం జరుగుతోందని, కృత్రిమ మేధ మానవీయత ప్రదర్శించగలదా? అని ప్రశ్నించారు. విద్యార్థులను ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా తయారు చేయవద్దని, ఉద్యోగాలిచ్చే స్థాయి మానవ వనరులుగా తీర్చిదిద్దాలని విశ్వవిద్యాలయాలకు, విద్యా సంస్థలకు ఐఐటీ- దిల్లీ సంచాలకులు వి.రామ్‌గోపాల్‌రావు ఉద్బోధించారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే పరిష్కార మార్గాలపై వారు పరిశోధనలు చేస్తారని తెలిపారు. ఐఐటీ దిల్లీ విద్యార్థులను గ్రామాలకు పంపి వ్యవసాయదారులతో, ఎయిమ్స్‌ వైద్యులతో కలిసి పనిచేసేలా చర్యలు చేపట్టామని వివరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com