కొత్తిమీర లేకపోతే వంటా పూర్తి కాదు. ఆరోగ్యమూ చేకూరదు. ఎంత గొప్ప వంటకం వండినా, ఏ కూర చేసినా చివర్లో కొత్తిమీర తప్పనిసరి. ఆకులు చిదిమితే ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే పరోపకార గుణం దాని సొంతం. కొత్తిమీరతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే… కొత్తిమీరలో ఇన్ఫెక్షన్లు దూరం చేసే యాంటిసెప్టిక్, యాంటీఫంగల్ గుణాలు ఉన్నాయి. అందుకే చర్మంపై అయ్యే గాయాలు త్వరగా మానడానికి అదెంతో ఉపకరిస్తుంది. అంతేకాదు… ఎగ్జిమా లాంటి చర్మవ్యాధులనూ అరికడుతుంది. కొత్తిమీర రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సమర్థంగా తగ్గిస్తుంది. రక్తనాళాలలోపలి వైపున అంటుకుపోయి ఉండే కొవ్వులను శుభ్రం చేసి రక్తం సాఫీగా ప్రవహించేలా చూస్తుంది. అంతేకాదు… మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ అన్నింటి కారణంగా గుండెపోటును నివారిస్తుంది. ఇది ఆకలిని పెంచే సహజమైన అపిటైజర్. తిన్నతర్వాత ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది. డయేరియా లాంటి సమస్యలనూ నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కొత్తిమీర వికారాన్ని, వాంతులను అరికడుతుంది. దాని సువాసనతోనే వికారం చాలావరకు తగ్గిపోతుంది. రక్తపోటుతో బాధపడే రోగుల్లోని అధిక రక్తపోటును కొత్తిమీర నియంత్రిస్తుంది. రక్తనాళాలలో పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా గుండెపోటు, పక్షవాతం ప్రమాదాలను నివారిస్తుంది. కొందరికి నోట్లో వచ్చే కురుపులు వంటి వాటిని తగ్గిస్తుంది. కొత్తిమీరలో ఉండే సహజ యాంటిసెప్టిక్ గుణం ఇందుకు తోడ్పడుతుంది. నోటిదుర్వాసననూ ఇది అరికడుతుంది. కొత్తిమీరలో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇది రక్తహీనత (అనీమియా)ను తగ్గిస్తుంది. దాంతో రక్తహీనత కారణంగా వచ్చే ఆయాసం, శ్వాస సరిగా అందకపోవడం, గుండెదడ, అలసట, నీరసం వంటి ఎన్నో లక్షణాలను తొలగిస్తుంది. కొత్తిమీరలోని యాంటీహిస్టమైన్ గుణాల కారణంగా ఇది ఎన్నో అలర్జీలకు సహజమైన ఔషధంగా పనిచేస్తుంది. కొత్తిమీరలో క్యాల్షియమ్ చాలా ఎక్కువ. అందుకే ఇది ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఎముకల పెరుగుదలకూ బాగా దోహదపడుతుంది. కాబట్టి ఎదిగే వయసు పిల్లలకు కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది. విటమిన్–ఏ పుష్కలంగా ఉండటం వల్ల కొత్తిమీర కళ్లకూ, కంటి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. చూపును చాలాకాలం పదిలంగా ఉంచుతుంది.
కొత్తిమీర లేని వంట ఉంటుందా?
Related tags :