పొత్తుల కోసం మోడీ తహతహ–రాజకీయ–01/10

*లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పొత్తుల గురించి మాట్లాడారు.
తమిళనాడు పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. అందరి కోసం తలుపులు తెరిచే ఉన్నాయన్నారు.
బీజేపీకి సొంతంగా ఆధిక్యత వచ్చినపుడు కూడా మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. పాత మిత్రులను గుర్తుంచుకుంటామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల కోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. తమిళనాడులోని ఐదు జిల్లాల బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
* మార్పు కోసమే జనసేన పుట్టింది
మార్పు కోసమే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. కడప జిల్లా నేతలతో పవన్‌ కళ్యాణ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ కంటే ముందే కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టినట్లు తెలిపారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. కానీ రాజకీయాలు తనకు వ్యాపారం కాదని పేర్కొన్నారు.
అధికారం కోసం చూసేవారికి ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగాయన్నారు. ఏపీకి మేలు జరుగుతుందనే మోదీని సపోర్ట్‌ చేశానని వివరించారు.
* కాపు రిజర్వేషన్‌ల పై చౌదరి ప్రశ్నలు?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ల బిల్లు ఏమైందో తెలియని పరిస్థితి నెలకొందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత సుజనాచౌదరి, ఆ పార్టీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బిల్లు పరిస్థితి ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈబీసీ)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 124వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావడాన్ని తెదేపా స్వాగతిస్తోందన్నారు. కానీ బిల్లు తీసుకొచ్చిన విధానమే సరికాదన్నారు. బుధవారం రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీలు సీఎం రమేశ్‌, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడారు. ఈబీసీ బిల్లు అందరికీ ఉపకరించకపోయినా.. బిల్లు మంచిదేనన్నారు. కానీ, అమలు చేయడం మాత్రం కష్టమని సుజనా పేర్కొన్నారు. ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని మంగళవారమే తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారని గుర్తుచేశారు. అయితే.. సమయం లేదు కాబట్టి బేషరతుగా బిల్లుకు మద్దతిస్తున్నామన్నారు.
*కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో పీసీసీ అధ్యక్షుల సమావేశం
ఇటీవల మూడు రాష్ట్రాల్లో విజయం అందించిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఏపీ నుంచి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలు, సార్వత్రిక ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ఇతర సీనియర్‌ నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.
*రాహుల్‌ గాంధీకి నోటీసులు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ ‘మోసపూరితమైన, అనైతిక’ వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్లమెంటులో రఫేల్‌ ఒప్పందంపై సీతారామన్‌ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తనను కాపాడుకోవడానికి ఓ మహిళ దొరికారు అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై మహిళా కమిషన్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది.
*టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే సండ్ర?
సత్తుపల్లి, ఇటీవలి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు మిగతా జిల్లాలకు భిన్నంగా వచ్చాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో వారిద్దరు కూడా అధికార పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే మెచ్చా తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో స్పష్టం చేయగా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సండ్ర ఇటీవల వివరణ ఇచ్చారు. అయితే రెండు రోజులుగా ఆయన హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అగ్ర నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టీఆర్‌ఎ్‌సలో సండ్ర చేరిక దాదాపు ఖరారైనట్లు మళ్లీ జోరుగా ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎ్‌సకు చెందిన రాజ్యసభ సభ్యుడు, మరో నాయకుడు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. దీనిపై సండ్రను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.
*ఆ ప్రచారాన్ని నమ్మకండి- కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో హిందీని తప్పనిసరి చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. అదంతా మీడియా ప్రచారమని తెలిపారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన కేంద్రమంత్రి… నూతన విద్యా విధానం రూపకల్పనపై వేసిన కమిటీ తమకు నివేదిక అందించిందని తెలిపారు. అయితే ఆ నివేదికలో ఏ భాషపై ప్రత్యేకమైన సూచనలు లేవన్నారు. కమిటీ రూపొందించిన నివేదికపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఏ భాషను కచ్చితంగా అమలు చేయాలని కమిటీ సూచించలేదన్నారు.
కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నట్టు అలాంటిది ఏమీ లేదన్నారు.
నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై కస్తూరి రంగన్ నేతృత్వంలో తొమ్మిది మంది నిపుణులతో కూడిన కమిటీని గతంలో ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ 2020-40 వరకు విద్యార్థుల కోసం పలు సూచనలు చేసింది.
*మహిళ వెనుక దాక్కొన్న మోదీ
రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై పార్లమెంటులో చర్చను ఎదుర్కోలేక రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌కు విషయాన్ని వదిలేసి ప్రధాని మోదీ పారిపోయారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్గ్‌ాంధీ ఎద్దేవా చేశారు. ‘56 అంగుళాల ఛాతీ ఉన్న చౌకీదార్‌ పలాయనం చిత్తగించి తనను తాను రక్షించుకోలేక ఒక మహిళ వెనుక దాక్కొన్నారు. రెండున్నర గంటల చర్చలో ఆమె ఆయన్ని రక్షించలేకపోయారు. కుంభకోణంపై అవునా… కాదా… అనేదానిపై సూటిగా సమాధానం చెప్పాలని నేను నిలదీసేసరికి ఆమె జవాబు ఇవ్వలేకపోయారు’ అని చెప్పారు. బుధవారం జైపుర్‌లో జరిగిన కిసాన్‌ర్యాలీలో రాహుల్‌ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ లోక్‌సభలో ఒక్క నిమిషమైనా అడుగుపెట్టలేకపోయారు. ఎందుకంటే ఆ చౌకీదారే చోరీకి పాల్పడ్డారు. రఫేల్‌ ఒప్పందంలో రూ.30,000 కోట్లను ప్రధాని దొంగిలించారు. దీనిపై న్యాయం జరగాల్సిందే’ అని చెప్పారు. ఎవరిపైనా ప్రతీకారానికి తాము దిగబోమని, న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్సేననే అర్థంతో ఈ మాటలు చెప్పారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. అయితే వ్యవసాయ రంగ సంక్షోభాన్ని తీర్చడానికి ఇదే తుది పరిష్కారం కాదన్నారు. క్రికెట్‌లో సిక్సర్‌ కొట్టడానికి బ్యాట్స్‌మన్‌ ఒక అడుగు ముందుకువేసే (ఫ్రంట్‌ ఫుట్‌) రీతిలోనే రైతులు, యువత ఎంతమాత్రం భయపడకుండా ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. పిచ్‌పై ప్రధాని మోదీ వెనక్కి తగ్గి (బ్యాక్‌ ఫుట్‌) ఆడుతున్నారని విమర్శించారు.
*జగన్‌ విహార యాత్ర ముగించారు
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన విహార యాత్రను ముగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ప్రతి వారం ఇంటికి వెళ్తూ చేసిన ఫ్యాన్సీ యాత్రకు పవిత్రత ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. తాను అర్ధరాత్రి దాటాకా కొన్ని రోజులు నడిచిన సందర్భాలున్నాయని, కానీ ఏనాడైనా రాత్రి 7 గంటల తరువాత జగన్‌ పాదయాత్ర చేశారా? అని నిలదీశారు. రోజుకు 8 కిలోమీటర్లు నడిస్తే దానిని పాదయాత్ర అంటారా? వారానికోసారి విశ్రాంతి తీసుకుని చేసేది పాదయాత్రా? అని ప్రశ్నించారు.
*ఎమ్మెల్సీలకు మంత్రి పదవులపై ఉత్కంఠ
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో శాసనమండలి సభ్యులకు పదవులపై ఉత్కంఠ ఏర్పడింది. గతంతో పోలిస్తే శాసనసభ్యుల నుంచి ఎక్కువగా పోటీ ఉండటంతో మంత్రివర్గ కూర్పులో ఈ అంశం కీలకంగా మారింది. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎమ్మెల్సీల మధ్య సమతూకం తీసుకురావడం సీఎం కేసీఆర్‌కు ఈసారి కష్టతరమవుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మొత్తం 18 మంది మంత్రుల్లో ముగ్గురు ఎమ్మెల్సీలకు సీఎం అవకాశం కల్పించారు. కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డిలకు ఈ పదవులు దక్కాయి.
*ఫిబ్రవరి 1న కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 2019-20వ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కాకుండా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు 14 రోజుల పాటు జరగనున్నాయని, ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెడతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 31న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.
*మా సవరణలూ పరిగణించాలి
తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులు ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలోనే ఉండాలని, కేంద్రానికి సంబంధించినవి కేంద్రం పరిధిలో ఉండాలన్నారు. సమాజం అవసరాలకు తగ్గట్లుగా ప్రభావవంతంగా రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సూచించారు. లేదంటే రాష్ట్రాల్లో ఇబ్బందులు తప్పవన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా రిజర్వేషన్లు ఉన్నాయని.. అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసేలా ఓ విధానం ఉండాలన్నారు.
*కావాలనే పేర్లు తీసేశారు
కావాలనే కొందరు… ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని టీపీసీసీ ఎన్నికల సమన్వయ సంఘం కన్వీనర్‌ జి.నిరంజన్‌ ఆరోపించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, తమ అనుమానం తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ‘ఈ నెల 25వ తేదీవరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఈసీ డిసెంబరు 10న ఒక షెడ్యూల్‌ విడుదల చేసింది.
*ఎమ్మెల్సీలకు మంత్రి పదవులపై ఉత్కంఠ
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో శాసనమండలి సభ్యులకు పదవులపై ఉత్కంఠ ఏర్పడింది. గతంతో పోలిస్తే శాసనసభ్యుల నుంచి ఎక్కువగా పోటీ ఉండటంతో మంత్రివర్గ కూర్పులో ఈ అంశం కీలకంగా మారింది. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎమ్మెల్సీల మధ్య సమతూకం తీసుకురావడం సీఎం కేసీఆర్‌కు ఈసారి కష్టతరమవుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మొత్తం 18 మంది మంత్రుల్లో ముగ్గురు ఎమ్మెల్సీలకు సీఎం అవకాశం కల్పించారు.
*16న సీఎల్పీ నేత ఎన్నిక
కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 16న జరగనుంది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నేత ఎన్నిక బాధ్యతను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌కు అప్పగించినట్లు సమాచారం. 15న కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు చేరుకుంటారు. 15, 16న కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులతో సమావేశమై సీఎల్పీ నేత ఎంపికను పూర్తి చేస్తారు. 17 నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో 16న సీఎల్పీ నేత ఎన్నికను పూర్తి చేయనున్నారు.
*సభాపతి పదవికి ఇంద్రకరణ్‌ పేరూ పరిశీలన
తెలంగాణ శాసనసభాపతి పదవి కోసం ఇప్పటికే పలు పేర్లు పరిశీలనలో ఉండగా.. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. నిర్మల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేరుపై ముఖ్యమంత్రి వద్ద చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. సభాపతి పదవికి ఇప్పటికే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. న్యాయవాద విద్యను అభ్యసించిన ఇంద్రకరణ్‌రెడ్డి.. ఎంపీగా, ఎమ్మెల్యేగా అనుభవజ్ఞుడనే భావన పార్టీ వర్గాల్లో ఉంది.
*శరద్‌ పవార్‌తో రాహుల్‌ భేటీ
కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) నేత శరద్‌ పవార్‌ను కలిశారు. మహారాష్ట్రలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై నేతలిద్దరూ చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వెలువడనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు పార్టీలూ దాదాపు చెరి సగం స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉంది. కొద్ది స్థానాలు మాత్రం కూటమిలో కలిసే చిన్నపార్టీలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కూడా నేతలిద్దరూ చర్చించినట్లు సమాచారం.
*భాజపాలో చేరిన తృణమూల్‌ ఎంపీ
పశ్చిమబెంగాల్‌లో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న కమలదళానికి కలిసొచ్చే పరిణామం.. కొద్దినెలల్లో లోక్‌సభ ఎన్నికలున్న నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీ సౌమిత్ర ఖాన్‌ బుధవారం భాజపాలో చేరారు. కాగా కొద్ది గంటల్లోనే ఖాన్‌తో పాటు మరో ఎంపీ (బోల్‌పుర్‌) అనుమప్‌ హాజ్రాను టీఎంసీ పార్టీ నుంచి బహిష్కరించింది.
*18న కడపకు అమిత్‌షా
రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ బూత్‌స్థాయి కార్యకర్తలు, నాయకులతో ఈ నెల 18న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కడపలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ఆయన సమీక్ష చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఫిబ్రవరి 2న శ్రీకాకుళం నుంచి బస్సుయాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. కాకినాడ ఘటన, గుంటూరులో కన్నా ఇంటిముట్టడికి సంబంధించి తెదేపా నాయకులపై గవర్నర్‌, డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నాయకులు త్వరలో కేంద్ర హోంమంత్రికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
*మోదీని ఎందుకు నిలదీయడంలేదు: మంత్రి కళా
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని ప్రధాని మోదీని జగన్‌ ఎందుకు నిలదీయడం లేదని మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.75వేల కోట్లు రావాలని స్వతంత్ర నిపుణుల బృందం నిర్ధరించిందన్నారు. ఈ విషయాన్ని జగన్‌ పాదయాత్ర ముగింపు సభలోనూ ప్రస్తావించకపోవడం శోచనీయమని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
*వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాదయాత్ర: తులసిరెడ్డి
కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్‌ పాదయాత్ర చేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి విమర్శించారు. బుధవారం విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు పాదయాత్రే ఏకైక మార్గమని జగన్‌, వైకాపా నాయకులు భావించటం హాస్యాస్పదమన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com