కొండెక్కిన బంగారం–వాణిజ్య వార్తలు-01/11

*గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,340, విజయవాడలో రూ.32,800, విశాఖపట్నంలో రూ.33,190, ప్రొద్దుటూరులో రూ.32,750, చెన్నైలో రూ.32,230గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,870, విజయవాడలో రూ.30,300, విశాఖపట్నంలో రూ.30,530, ప్రొద్దుటూరులో రూ.30,033, చెన్నైలో రూ.30,760గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,600, విజయవాడలో రూ.40,800, విశాఖపట్నంలో రూ.40,300, ప్రొద్దుటూరులో రూ.40,500, చెన్నైలో రూ.42,800 వద్ద ముగిసింది*
*దేశ వ్యాప్తంగా ప్రాజెక్టుల విస్తరణ కోసం అర్వింద్‌ స్మార్ట్‌స్పేసెస్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మార్కెట్లో ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తోంది. ఈ ఏడాదిలో సంస్థ మొత్తం రూ.250 కోట్లతో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
*వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం, ఆదేశాలకు అనుగుణంగా నడవని సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు ఎక్కువ అధికారాలు సమకూర్చేలా మళ్లీ ఆర్డినెన్స్‌ జారీ చేయాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది.
*టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ప్రపంచవ్యాప్తంగా 4,500 ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. చైనాలో అమ్మకాలు తగ్గడం, ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వైదొలగడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కంపెనీ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.
*జీవశాస్త్రాల రంగంలోని సంస్థలకు వేదికగా నిలిచే ‘బయోఏషియా’ వచ్చే నెల 25 నుంచి 27వ తేదీ వరకూ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సదస్సులో ఫార్మా, బయోటెక్‌, లైఫ్‌సైన్సెస్‌, వైద్య రంగంలోని స్టార్టప్‌ సంస్థలకు పెద్దపీట వేయనున్నారు. తమ ఆవిష్కరణలను, వినూత్నమైన సేవలను స్టార్టప్‌ సంస్థలు ప్రదర్శించవచ్చని బయోఏషియా నిర్వాహకులు తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌లో టెలీమెడిసిన్‌ సేవల కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టు పనులు రాంఇన్ఫోతోపాటు మరో రెండు ఇతర సంస్థలకు దక్కాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణ వైద్య సహాయం కోసం ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఉప కేంద్రాలను ప్రామాణీకరణ చేసేందుకు ప్రభుత్వం రూ.400 కోట్లను ఖర్చు చేయనుంది.
*బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. గత 3 రోజుల్లో 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర రూ.300 మేర పెరగ్గా, బులియన్‌ విపణిలో వరుసగా నాలుగో రోజూ రూ.270 అధికమై రూ.33,070కి చేరింది. ఇదే విధంగా కిలో వెండి ధర కూడా రూ.410 పెరిగి రూ.40,510కి చేరింది. అమెరికా డాలర్‌ విలువ రూ.70.41కి పెరగడం, అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 1289 డాలర్లు అధిగమించడం వల్ల దేశీయంగా కూడా ధర పెరిగింది. పండుగలకు తోడు వచ్చే నెలలో వివాహాది శుభకార్యాలుండటం వ్లల దేశీయంగా ఆభరణాల తయారీదార్లు కూడా బంగారాన్ని కొంటున్నందున, గిరాకీ హెచ్చుతోందని చెబుతున్నారు. ఆభరణాల బంగారం సెవరు (8 గ్రాములు) ధర రూ.100 అధికమై రూ.25,300కు చేరింది.
*ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులు ఐరోపా మార్కెట్లోకి విస్తరించేందుకు వీలుకల్పించే ఈస్థోనియా ‘ఇ-రెసిడెన్సీ’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆ దేశ రాయబారి రిహో క్రూవ్‌ కోరారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో ‘ఇ-రెసిడెన్సీ’ ప్రత్యేకతలను వివరించారు.
*గతేడాది డిసెంబరులో నియామకాలు పెరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. 2017 డిసెంబరుతో పోలిస్తే గతేడాది డిసెంబరులో ఇవి 8 శాతం మేర రాణించాయని చెబుతోంది. ముఖ్యంగా వాహన, వాహన విడిభాగాల పరిశ్రమ 24%; మానవ వనరుల విభాగం 17% చొప్పున నియమాకాల్లో వృద్ధిని నమోదు చేశాయని వివరించింది. ఐటీ-సాఫ్ట్‌వేర్‌ రంగంలో నియామకాలు 14% పెరిగినట్లు తెలిపింది. బెంగళూరు, దిల్లీలలో వరుసగా 13%, 10% మేర నియామకాలు మెరుగయ్యాయని వెల్లడించింది.
*అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి బంధన్‌ బ్యాంక్‌ రూ.331.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2017లో ఇదే కాలంలో ఆర్జించిన రూ.300.04 కోట్లతో పోలిస్తే లాభం 10.3 శాతం పెరిగింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపునకు ఇచ్చిన రుణాల నిమిత్తం రూ.385 కోట్ల వరకు కేటాయింపులు చేయాల్సి రావడం లాభంలో వృద్ధిని పరిమితం చేసింది.
*హోండా కార్స్‌ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్‌ మోడల్‌ సిటీలో కొత్త వేరియంట్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.12.75 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. కొత్త వేరియంట్‌ ‘జడ్‌ఎక్స్‌ ఎంటీ’లో 1.5 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రైన్‌ ఇంజిన్‌ను అమర్చారు.
*అగ్రగామి కార్ల సంస్థ మారుతీ సుజుకీ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.10,000 వరకు ధరలు పెంచింది. ముడివస్తువుల ధరలు పెరగడం, విదేశీ మారక రేట్లు ప్రతికూల ప్రభావం చూపడమే ఇందుకు కారణమని మారుతీ సుజుకీ తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com