Kids

నలుగురు భార్యలు-తెలుగు చిన్నారుల కథ

నలుగురు భార్యలు-తెలుగు చిన్నారుల కథ

ఒక వ్యక్తికి నలుగురు భార్యలు. వారిలో నాల్గవ భార్యంటే అతనికి ప్రేమ ఎక్కువ. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. బెస్ట్ అన్నీ ఆమెకు ఇచ్చాడు.

మూడవ భార్యను కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెను తన స్నేహితులకు చూపించాలని కోరుకుంటాడు. అయితే, ఆమె వేరే వ్యక్తితో పారిపోతుందనే భయం ఉండేది.

రెండవ భార్యంటే కూడా ఇష్టమే. అతనికి సమస్యలు ఎదురైనప్పుడల్లా ఆమె వైపు చూసేవాడు. ఆమె అతనికి సహాయం చేసేది

మొదటి భార్యను అస్సలు ప్రేమించలేదు. కానీ ఆమె మాత్రం అతన్ని గాఢంగా ప్రేమించేది. అతనికి విధేయంగా ఉండేది. అతనిని చాలా జాగ్రత్తగా చూసుకునేది.

ఒక రోజు ఆ వ్యక్తి చాలా అనారోగ్యానికి గురయ్యాడు, త్వరలోనే చనిపోతాడని తెలుసుకున్నాడు. “నాకు నలుగురు భార్యలు ఉన్నారు, నేను చనిపోయినప్పుడు వారిలో ఒకరిని నాతో పాటు తీసుకెళ్తాను, మరణంలోనూ నాకు తోడుంటుంది” అనుకున్నాడు.

తనకెంతో ఇషటమైన నాల్గవ భార్యను తనతో పాటు సహగమనం చేయమని కోరాడు. “ప్రసక్తే లేదు!” అని మరొక మాట లేకుండా వెళ్ళిపోయింది.

తన మూడవ భార్యను అడిగాడు. “మీరు చనిపోతే నేనెందుకు చావాలి. నేను తిరిగి వివాహం చేసుకుంటాను” అని చెప్పి వెళ్లిపోయింది.

అనంతరం తన రెండవ భార్యను అడిగాడు. “నన్ను క్షమించండి. మీ సమాధి వరకు మాత్రమే రాగలను.” అని స్పష్టం చేసింది.

తాను అమితంగా ప్రేమించిన ముగ్గురు భార్యలూ అలా చెప్పేసరికి అతను విషాదంలో మునిగిపోయాడు. అప్పుడు “మీకు నేనున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని అనుసరిస్తాను” అని ఒక స్వరం వినిపించింది.

ఎవరా… అని తలెత్తి చూశాడు. సన్నగా పీలగా మొదటి భార్య కనిపించింది. ఆమె పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లుగా ఉంది. “నేను నిన్ను బాగా చూసుకుని ఉండాల్సింది” అని చాలా బాధపడ్డాడు.

మనందరికీ జీవితంలో నలుగురు భార్యలు ఉన్నారు.

నాల్గవ భార్య మన శరీరం. అందంగా కనిపించడం కోసం మనం ఎంత సమయం, శ్రమ చేసినా మరణంతో అది మనలను వదిలివేస్తుంది.

మూడవ భార్య మన ఆస్తిపాస్తులు, హోదా, సంపద. మనం చనిపోయినప్పుడు ఇతరుల వద్దకు చేరుతుంది.

రెండవ భార్య మన కుటుంబం మరియు స్నేహితులు. మనం జీవించి ఉన్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నా, సమాధి వరకు మాత్రమే రాగలరు.

మొదటి భార్య మన ఆత్మ సంతృప్తి (fulfillment). భౌతిక సంపద, కీర్తి ప్రతిష్టల కోసం దాన్నిఎంత నిర్లక్ష్యం చేసినా, మరణంలోనూ అది మనలను అనుసరిస్తుంది.