తెలంగాణ కాంగ్రెస్ అపజయం పక్షుల చూపు లోక్ సభ వైపు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ రాజకీయ వేడి మొదలైంది. లోక్‌సభ సీట్ల కోసం కొందరు, సీఎల్పీ, పీఏసీ ఛైర్మన్‌ పదవుల కోసం మరికొందరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నెల 16న సీఎల్పీ సమావేశం జరగనుండటంతో ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌, సీఎల్పీ నేత పదవులను దక్కించుకోవడానికి ఎవరికి వారు అధిష్ఠానం అశీస్సుల కోసం యత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఫిబ్రవరిలోనే ప్రకటించే యోచనలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉండటంతో రాష్ట్రంలోని సీనియర్‌ నేతలు టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ రాజకీయ హడావుడి ప్రారంభమైంది. ఈనెల 17న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో.. ఆ లోపు పీఏసీ ఛైర్మన్‌, సీఎల్పీ నేతల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే సీఎల్పీ నేతల సమావేశం నిర్వహణకు సీఎల్పీ నేత, పీఏసీ ఛైర్మన్‌ పదవులకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అప్పగించారు. శాసన సభ సమావేశాలకు ఒక్కరోజు ముందు ఈ నెల 16న కాంగ్రెస్‌ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అందరికి ఆమోదయోగ్యమైన పార్టీ శాసనసభాపక్ష నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ను ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం వేణుగోపాల్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ఓటమికి బాధ్యత వహించి పీసీసీ పదవికి రాజీనామా చేయాలని కొందరు పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తుండడంతో ఉత్తమ్‌ ఆ పదవి నుంచి తప్పుకొన్నట్లయితే సీఎల్పీ నేతగా ఆయనను ఎన్నుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్న దృష్ట్యా పీసీసీ పదవిలో ఉత్తమ్‌నే కొనసాగించేలా అధిష్ఠానం చొరవచూపితే.. సీఎల్పీ, పీఏసీ ఛైర్మన్‌ పదవులు రెండు తాజాగా గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అర్హులైన వారిని వరిస్తాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎల్పీనేత పదవి కోసం భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబులతోపాటు, గండ్ర వెంకటరమణారెడ్డి, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పదవి దక్కకపోయిన ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని శ్రీధర్‌బాబు అధిష్ఠానం పెద్దల వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు గాంధీ భవన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. పీఏసీ ఛైర్మన్‌ కోసం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పోటీ పడుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుకొన్నట్లయితే ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఆ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఫిబ్రవరిలోనే కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉండడంతో పార్టీలోని సీనియర్లు టికెట్లు దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్నందున లోక్‌సభ ఎన్నికల్లో ఆరు ఏడు స్థానాలు మినహాయిస్తే మిగిలిన స్థానాల్లో పోటీ చేసేందుకు నేతలు చొరవ కనపరచడంలేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గెలుపునకు మెరుగైన అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసుకుంటున్న ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండ, భువనగిరి టికెట్ల కోసం ఎక్కువగా పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖమ్మం ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి, స్థానిక వ్యాపారవేత్త రాజా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. పొత్తుల్లో భాగంగా తమకు ఇవ్వాలని తెదేపా కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎస్టీ రిజర్వు నియోజకవర్గం అయిన మహబూబాబాద్‌ సీటుకోసం ఎక్కువమంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి రవీంద్రనాయక్‌, ఎమ్మెల్సీ రాములునాయక్‌లతోపాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా కొందరు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి సీటు తమకేనని కొంతకాలంగా ప్రచారం చేస్తున్న పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డితోపాటు ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తుండడంతో మరో ఇద్దరు ముగ్గురు కొత్తవాళ్లు కూడా ఆ టికెట్‌ ఆశిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి నల్గొండ లోక్‌సభ సీటు కావాలని కోరుతున్నట్లు సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com