NRI-NRT

డల్లాస్ తానాలో ఏమవుతుందో?-TNI ప్రత్యేకం

TANA Elections 2021 - Dallas Fort Worth Regional Vice President - Kommana Tripuraneni

తానా ఎన్నికల్లో ప్యానెళ్ల మధ్య పోరు అందరికీ తెలిసిందే. వీటితో పాటు స్థానికంగా ప్రాంతీయ ప్రతినిధులకు కూడా ఈ పర్యాయం ఎన్నికలు జరుగుతున్నాయి. బే-ఏరియా, న్యూయార్క్-న్యూజెర్సీ, చికాగో, అట్లాంటా, డెట్రాయిట్, డల్లాస్ ప్రాంతాల్లో ప్రవాసులు అత్యధికంగా నివసిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన తానా నామినేషన్ల పట్టిక ప్రకారం కొన్ని ప్రాంతీయ పదవులు ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల ప్యానెల్ మద్దతుతో స్పష్టమైన మెజార్టీ కలిగి ఉన్నాయి.

ప్రవాసులు అత్యధికంగా ఉండే డల్లాస్‌లో గత ప్రాంతీయ ప్రతినిధులుగా పనిచేసిన చాగర్లమూడి సుగన్, దొడ్డా సాంబాలు DFWలో తానాను బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఈ పర్యాయం ప్రాంతీయ ప్రతినిధి పదవులకు త్రిపురనేని దినేష్, కొమ్మన సతీష్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. దినేష్ 2013 నుండి తానాలో చురుగ్గా ఉంటుండగా, సతీష్ కూడా దీర్ఘకాలంగా స్థానిక తానా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరు ఇరువురిలో ఎవరినీ విజయం వరిస్తుందోనని స్థానిక ప్రవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

గడిచిన రెండు ఎన్నికల్లో దినేష్ ఈ పదవిని ఆశించారు. కానీ సేవా సంస్థల్లో పదవులకు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన బరిలో నుండి తప్పుకున్నారు. ఈ సారి ఖచ్చితంగా తనను ఏకగ్రీవంగా గెలిపిస్తారని ఆశించిన ఆయనకు ఈ ఎన్నికల్లో కొమ్మన సతీష్ రూపంలో పోటీ ఎదురు అయింది. స్థానిక ప్రవాసులు, తానా సభ్యుల్లో మంచి పేరు కలిగిన ఈ ఇరువురిలో ఎవరు గెలుపు గుర్రంగా అవతరిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సతీష్‌కు కొందరు స్థానిక తానా పెద్దల మద్దతు ఉండగా, గత రెండు పర్యాయాల్లో జరిగిన రాజీల చరిత్ర తెలిసిన తానా ఓటుబ్యాంక్ మాత్రం దినేష్ వైపు మొగ్గుచూపుతోంది. తనకు గత రెండు పర్యాయాల్లో ఇచ్చిన మాటను ఈసారి తానా పెద్దలు నిలబెట్టుకోవల్సిందేనని, తనకు కార్యవర్గంలోకి వెళ్లేందుకు ఆసక్తి లేదని, డల్లాస్‌లోనే తాడో పేడో తేల్చుకుంటానని, తన నామినేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో విరమించుకోనని, DFW ప్రాంతీయ ప్రతినిధిగా బరిలో ఉంటానని ఆయన సన్నిహితులతో కుండబద్ధలు కొట్టినట్లు వినికిడి.

అటు పెద్దల మద్దతు, ఇటు ఓటుబ్యాంక్ మద్దతు మధ్య డల్లాస్ తానా తరాజులో ఎవరి మీద మోజు పడుతుందో, డల్లాస్‌లో తానా జెండాను మరోసారి రెపరెపలాడించేది ఎవరో తెలియాలంటే బ్యాలెట్ లెక్కింపు వరకు వేచి ఉండాల్సిందే. —సుందరసుందరి(sundarasundari@aol.com)