డూడూ బసవన్న….అయ్యగారికి దణ్ణం పెట్టు-అమ్మగారికి దణ్ణం పెట్టు!

నేనూ గంగిరెద్దునొచ్చా. అంతా బాగున్నారా..? ఈ పండగ వేళ నేను మీ వాకిట్లో నిలబడి వంగి వంగి దణ్ణాలు పెడుతుంటే… మీరంతా ఎంత సంతోషపడిపోతారో…! కానీ నేను మామూలుగా అంత శాంతమూర్తినేం కాదు…నా కోపాన్నంతా తగ్గించి మీకు వందనాలు చేసేలా నన్ను తీర్చిదిద్దుతారు… అదెలాగో ఏంటో అన్నీ చెప్పేస్తా వినేయండి!
****సంక్రాంతి పండగ వచ్చిందంటేనే వీధుల్లో నా సందడి మొదలవుతుంది కదా. పండగకు కొన్ని రోజుల ముందు నుంచే నా యజమానులు… అదేనండీ మీరు గంగిరెద్దులోళ్లంటారు కదా. వాళ్లే వీధుల్లో తిరుగుతూ, సన్నాయి వాయిస్తూ నన్ను ఆడిస్తుంటారు.
* మామూలుగా నేనూ ఎద్దునే. అయితే వ్యవసాయ పనులకు ఉపయోగించే ఎద్దుకూ నాకూ ఎంతో తేడా ఉంది.
* కోడె గిత్తగా ఉన్నప్పుడు… అంటే దాదాపు ఏడాది వయసున్నప్పుడు తీసుకువచ్చి నన్ను గంగిరెద్దుగా పెంచేందుకు సిద్ధం చేస్తారు.
* నాకు కోపం తగ్గడానికి ముక్కుతాడు వేస్తారు. చిన్న వయసులోనే ఇది వేయడం వీలవుతుందట. ఇది వేయడం వల్ల నేను నా యజమానులు చెప్పిన మాట వింటా. అలా వారు నా పొగరుబోతుతనాన్ని అణచివేస్తారు.
* అలా నన్ను లొంగ దీసుకుని, బాగా మచ్చిక చేసుకుంటారు.
* ఆ తర్వాత సర్కస్‌ వాళ్లు జంతువులకు తర్ఫీదు ఇస్తారు కదా. అలాగే నాకూ శిక్షణ ఇస్తారు.
* పరుగెత్తటం, పడుకోవటం, మూడు కాళ్ల మీద నిలబడటం, చెప్పినట్లుగా తల ఊపటం, కాలు పైకెత్తి సలాం చెయ్యటం… లాంటివన్నీ నేర్పించేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తయితే నన్ను ఆడించే వ్యక్తి వెల్లకిలా పడుకుని తన గుండెల మీద నా ముందరి రెండు కాళ్లు, తొడల మీద వెనుక కాళ్లు పెట్టించుకుని ఆడే ఆట చూసి అంతా ఆశ్చర్యపడిపోవాల్సిందే.
* ఇలా ఇంకా బోలెడు విద్యల్నీ నాకు నేర్పిస్తారు. బలంగా తయారయ్యేందుకు ఎక్కువ ఆహారమూ పెడతారు. నేను ఎంత బలంగా ఉంటే అంత ఆకర్షణీయంగా ఉంటానని యజమానులు అనుకుంటుంటారు.
* సంక్రాంతి నెలలో ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిస్తాగానీ మిగిలిన నెలలన్నింటిలోనూ నాకింకేం పనుండదు. ఎవరైనా ఇళ్ల శంకుస్థాపనలకు పిలిస్తే అలా వెళ్లొస్తాఅంతే.
***అదిరే అలంకరణ
* నా విద్యలన్నీ ఒక ఎత్తయితే నాకు అలంకారం మరో ఎత్తు. నా మూపురం ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉన్నట్లట. అందుకే మూపురాన్ని రంగు వస్త్రాలతో అలంకరించి, దండ వేస్తారు.
* నా మూపురం శివలింగ స్వరూపమని నమ్మకం. అందుకే దాని నుంచి తోక వరకూ వస్త్రాలతో కుట్టిన బొంతను కప్పుతారు. నోటికి తోలుతో కుట్టిన శికమారు కడతారు.
* కొమ్ముల చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలు తొడుగుతారు. నుదురు మీద అందంగా ఉండే తోలుకుచ్చులు వేలాడదీస్తారు. పొట్టచుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలుబెల్టు, కాళ్లకు ఇత్తడి గజ్జెలు కడతారు. ఇలా నన్ను చక్కగా అలంకరించి గంగిరెద్దులాట ఆడిస్తుంటే
మీరంతా ముచ్చటగా చూస్తుంటారు.
* జోడుగా వచ్చే మమ్మల్ని రామలక్ష్మణులుగా పేర్లుపెట్టి పిలుస్తారు. ఒరే రాముడూ, ఒరే లచ్చన్నా! అంటూ ఆప్యాయంగా పిలిచేస్తారు. కొన్ని ప్రాంతాల్లో నన్ను బసవన్న అనీ పిలుస్తారు. శివుడి రూపంగా భావించి పూజలు చేస్తారు.
* నన్ను ఆడించేవాళ్లూ ఎంతో అందంగా ముస్తాబవుతారు. అచ్చమైన గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పంచెకట్టు కడతారు. లాల్చీ లేదా పూర్తిచేతుల చొక్కా మీద అరకోటు వేసుకుంటారు. భుజం మీద కండువా నెత్తికి రంగు వస్త్రాన్ని కట్టుకుంటారు. కోరమీసాలు, చెవులకు కమ్మలు, చేతికి వెండి మురుగులు, నుదుటి మీద పంగనామం పెట్టుకుంటారు. కంచుతో చేసిన చిన్నగంట, శృతి, సన్నాయి, బూర, డోలు వీరి వాద్యాలు. వీటన్నింటినీ పాటకు అనుగుణంగా వాయిస్తూ, ఊరంతా మంచి జరగాలని కోరుకుంటూ పాటలు పాడతారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com