మళ్ళీ తేనెతుట్టెను కదిలించనున్న కేసీఆర్

ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత అనుభవంతో పాటు ఇతర రాష్ట్రాల విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పరంగా హోదాలు కాకుండా శాసనసభ పరంగా హోదా ఇచ్చే ఆలోచనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటరీ కార్యదర్శులను మళ్లీ నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. 2015లో తెరాస ప్రభుత్వం ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులను నియమించగా.. అప్పట్లో హైకోర్టు వారి నియామకాన్ని రద్దు చేసింది. ఈ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ పదవుల జోలికి పోలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ ఈ అంశంపై దృష్టి సారించారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా కొంతమంది శాసనసభ్యులను నియమించాలని సీఎం నిర్ణయించారు. అయితే గతంలో న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఈసారి ఎలాంటి చిక్కులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శులు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలు, సాంకేతిక అంశాల పరిశీలన కోసం న్యాయ నిపుణులకు బాధ్యతలు అప్పగించారు. మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేస్తే బాగుంటుంది? ఎలాంటి విధానాలను అనుసరిచాలన్న విధానంపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా కాకుండా శాసనసభ పరంగా పార్లమెంటరీ కార్యదర్శుల హోదా ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. శాసనసభ పరంగా హోదా ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని చట్ట సభలకు సంబంధించిన అంశాలపై న్యాయస్థానం కూడా తప్పుపట్టే అవకాశాలు ఉండవని అంటున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు, ఆయా శాఖలకు సంబంధించి అవగాహన రావాలన్న ఉద్దేశంతోనే పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. శాసన సభలోనూ మంత్రుల తరపున ఆయా శాఖలకు సంబంధించి కార్యదర్శులతోనూ సమాధానాలు ఇచ్చేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వపరంగా కాకుండా.. శాసనసభ పరంగా హోదా ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఉండబోవన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. శాసనసభ, మండలిలో ప్రభుత్వ విప్‌లు ఉన్నట్లే.. పార్లమెంటరీ కార్యదర్శుల నియామానికి వీలుందని అంటున్నారు. అవసరమైతే ఇందుకోసం.. శాసనసభ, మండలి నిబంధనలను సవరించవచ్చని కూడా చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని పార్లమెంటరీ కార్యదర్శుల నియామాక ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాసనసభ సభ్యుల సంఖ్యలో 15 శాతం వరకూ మంత్రులను తీసుకోవచ్చు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా గరిష్ఠంగా 18 మంది ఉండవచ్చు. శాసనసభాపతి, ఉపసభాపతితో పాటు విప్‌లు, కేబినెట్‌ హోదా కలిగిన కొన్ని కీలక కార్పోరేషన్‌ ఛైర్మన్లు.. ఇలా వివిధ పదవులు శాసనసభ్యులకు దక్కనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 31తో పాటు, కొత్తగా ఏర్పాటు చేయనున్నా.. మరో 2జిల్లాలు కలిపితే 33జిల్లాలు అవుతాయి. ప్రతి జిల్లాకు కనీసం ఓ పదవి ఉండాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా.. పార్లమెంటరీ కార్యదర్శుల నియామాకం చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com