DailyDose

వనస్థలిపురంలో దారుణం-నేరవార్తలు

వనస్థలిపురంలో దారుణం-నేరవార్తలు

* హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం జరిగింది. నౌసిన్‌ బేగం అనే మహిళ తన భర్త గగన్ అగర్వాల్ (38)ను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సహారా రోడ్డులోని వివేకానందనగర్‌ కాలనీలో గగన్‌ అగర్వాల్‌ (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్‌ గత ఏడాది జులైలో పాతబస్తీకి చెందిన నౌసిన్‌ బేగం(38)ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి గగన్‌ కనిపించకుండా పోయారు. గగన్‌ సోదరుడు.. తన అన్న కనిపించకుండా పోవడంపై 8వ తేదీన వదినను ప్రశ్నించాడు. అనంతరం ఇద్దరు కలిసి ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* ఓటుకు నోటు కేసు విచారణను నెల రోజులు వాయిదా వేయాలని ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయస్థానాన్ని కోరింది. పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున కేసు విచారణను ఏప్రిల్‌ 8 వరకు వాయిదా వేయాలని రేవంత్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణను జాప్యం చేస్తున్నారని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని ఈనెల 15కు వాయిదా వేసింది.

* అద్దాలతో మూసే వ్యాపార సముదాయాలు.. రహదారి పక్కనే ఉండే షట్టర్లు.. తాళం వేసి ఉన్న ఇళ్లు.. ఇవే వారి లక్ష్యాలు. రెక్కీ చేస్తారు.. పక్కాగా కొట్టేస్తారు.. ఇలా నాలుగు నెలల్లో ఇద్దరు స్నేహితులు కలిసి బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో ఆరు చోరీలు చేశారని నేర పరిశోధన విభాగ ఇన్‌స్పెక్టర్‌(డీఐ) మహ్మద్‌ హఫీజుద్దీన్‌ డీఎస్‌ఐ భరత్‌భూషణ్‌ వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అబ్ధుల్లా(28) బంజారాహిల్స్‌లోని ఫస్ట్‌ ల్యాన్సర్‌లో ఉండేవాడు. డ్రైవింగ్‌ పనిచేసే ఇతడికి పదేళ్ల కిందట వరంగల్‌ పాపయ్యపేట చమన్‌ ప్రాంతానికి చెంది బంజారాహిల్స్‌ సింగాడకుంట బస్తీలో నివసిస్తున్న మహ్మద్‌ గౌస్‌(35)తో పరిచయం ఏర్పడింది. ఇటీవల కాలంలో గౌస్‌కు ఖర్చులు పెరగడంతో అబ్ధుల్లాతో కలిసి చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. వీరిద్దరు బంజారాహిల్స్‌లో వరుస చోరీలకు పాల్పడ్డారు. గత నెల 27న రోడ్‌ 11లో తాళాలు వేసి ఉన్న ఇంట్లో బంగారు నగలు, రూ. 50వేల నగదు చోరీ చేశారు. మొదటి అంతస్థులో ఉన్న గృహోత్పత్తులను కూడా చోరీ చేశారు. బంజారాహిల్స్‌ ముత్తూట్‌ ఫైనాన్స్‌, పక్కనే ఉన్న మరో కార్యాలయంలో, మంగళం స్టోర్‌, సెరాక్‌ పాఠశాలలో, పంచవటి కాలనీలో చోరీలకు పాల్పడ్డారు. బంగారు నగలను సికింద్రాబాద్‌కు చెందిన సాయికిరణ్‌ అనే బంగారం వ్యాపారికి ఇచ్చారు. అతను వాటిని కరిగించాలని బస్వజిత్‌ ధార(27)కు అందించారు. నలుగురిపై కేసు నమోదు చేశామని డీఐ చెప్పారు.

* ప్రైవేటు బ్యాంకు ఉద్యోగినంటూ ఓ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డీఎస్‌ మక్తాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవల కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు వెళ్లగా యువతి(23) ఇంట్లోనే ఉంటోంది. మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులమని, ఫైనాన్స్‌ ఇస్తామని యువతి ఉంటున్న ఇంటికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటి బయట కాపలా ఉండగా.. మరో వ్యక్తి యువతితో ఫైనాన్స్‌ గురించి మాటలు కలిపి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌ తెలిపారు. కేసును ఛేదించడానికి పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

* కుటుంబమంతా కలిసి ఊరెళితే, ఇంటిపై ఓ కన్నేసి ఉంచమని పక్కింటి వారికి చెబుతాం. అయితే పొరుగున ఉండే వ్యక్తే చోరీ చేస్తే ఏమిటీ పరిస్థితి. వినడానికి వింతగానే ఉన్నా పెద్దపల్లిలో సరిగ్గా ఇదే జరిగింది. పట్టణంలో ఈ నెల 7న జరిగిన చోరీ ఘటనను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. డీసీపీ రవీందర్‌ మంగళవారం వివరాలను విలేకరులకు వెల్లడించారు. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సురేష్‌ కుటుంబం కొద్ది రోజులుగా పట్టణంలోని సాయినగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటోంది. గత ఆదివారం ఉదయం సురేష్‌ భార్యాపిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళం వేసినట్లే ఉంది కానీ లోప బీరువా తలుపు పగులగొట్టి ఉంది. బీరువాలోని 9 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విచారణ చేపట్టి కేవలం 24 గంటల వ్యవధిలోనే దొంగను పట్టేశారు. ఆ ప్రాంతంలో తిరిగే పాత నేరస్థుల గురించి ఆరా తీసే క్రమంలో సురేష్‌ పక్కింట్లో ఉండే సుందరి రాజు అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇంటి తాళం పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. వ్యసనాలకు బానిసగా మారిన నిందితుడు డబ్బుల కోసం దొంగతనానికి పాల్పడ్డట్లు డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.2.80 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒకే రోజులో కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను డీసీపీ అభినందించారు. ఏసీపీ నిథిక పంత్‌, సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్సై రాజేశ్‌ పాల్గొన్నారు.

* ఖైరతాబాద్‌ చింతలబస్తీకి చెందిన మల్లచెరువు రామారావు(52)పై 61 చోరీ కేసులు, రాజమండ్రికి చెందిన కోసూరి శ్రీనివాసరావు(54)పై 27 చోరీ కేసులున్నాయి. మేడిపల్లి పరిధిలోని బుద్ధనగర్‌లో తరచూ చోరీలు జరుగుతుండటంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థానిక సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ఈ ఇద్దర్నీ గుర్తించారు. వీరికంటూ ప్రత్యేక ఇల్లు లేకపోవడం, లాడ్జీల్లోనే ఉండడం వల్ల పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది. సోమవారం అర్ధరాత్రి చోరీ సొత్తుతో దర్జాగా వెళ్తుండగా మేడిపల్లి పోలీసులు అడ్డుకోగా, ఉపాధ్యాయులమంటూ బోల్తా కొట్టించేందుకు యత్నించినా తప్పించుకోలేకపోయారు.