Business

నాలుగు రోజులు బ్యాంకులు బంద్-వాణిజ్యం

Business News - Four Day Strike At Indian Bank Unions

* రేప‌టి నుంచి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం బ్యాంకుల‌కు సాధార‌ణ సెల‌వులు. ఇక సోమ‌వారం, మంగ‌ళ‌వారం బ్యాంకులు మూతపడబోతున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సోమ, మంగళవారాల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో రేపటి నుంచి వరుసగా అంటే 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బ్యాంకులు తెరుచుకోవన్నమాట. బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఏదైనా సానుకూల ప్రకటన చేస్తే త‌ప్ప‌, ఈ నాలుగు రోజులు బ్యాంకులు మూత‌ప‌డ‌డం ఖాయం. అయితే ఈ నాలుగు రోజులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు ఉండవు.

* శాశ్వత బాండ్లుగా భావించే ఏటీ1 లేదా పర్పెచ్యువల్‌ బాండ్ల వాల్యుయేషన్‌ కోసం కాలపరిమితిని 100 ఏళ్లుగా పరిగణించాలన్న సెబీ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిపై మ్యూచుఫల్‌ ఫండ్ల(ఎంఎఫ్‌) సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగింది. పర్పెచ్యువల్‌ బాండ్ల వాల్యుయేషన్‌ కోసం ఇటీవల జారీ చేసిన 100 ఏళ్ల నియమాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ మేరకు సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగికి కేంద్ర ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. ‘వాల్యుయేషన్‌ కోసం చేర్చిన ఆ నియమం తీవ్ర విఘాతం కలిగించేలా ఉంది’ అంటూ లేఖలో ఘాటుగా వ్యాఖ్యానించింది.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ఇటీవల విడుదల చేసిన 350 సీసీ సామర్థ్యం కలిగిన హెచ్‌నెస్‌ సీబీ 350 మోడల్‌ బైకులను వెనక్కి రప్పించనుంది. ట్రాన్స్‌మిషన్‌ పార్ట్‌ను సరిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోండా తెలిపింది. గతేడాది నవంబరు 25 నుంచి డిసెంబర్‌ 12 మధ్య ఉత్పత్తి చేసిన బైకులను రీకాల్‌ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా బైకుల్లో ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించి నాలుగో గేర్‌ కౌంటర్‌ షాఫ్ట్‌లో వినియోగించిన విభిన్నంగా ఉందని గుర్తించామని ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్‌లో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

* గూగుల్‌ పే తన వినియోగదార్ల గోప్యతా ప్రమాణాలను మరింత పెంచుతోంది. వచ్చే వారం ఈ యాప్‌లో తీసుకురానున్న అప్‌డేట్‌ వల్ల వినియోగదార్లకు తమ లావాదేవీల సమాచారంపై అదనపు నియంత్రణకు వీలు కలుగుతుంది. నియంత్రణ ఉండాలా వద్దా అన్నది కూడా వినియోగదార్ల ఇష్టమే. గూగుల్‌ పేలో ఏదైనా లావాదేవీ చేస్తున్నప్పుడు, సంబంధిత వివరాలను వినియోగించుకోవడం లేదా రికార్డ్‌ కావడం అన్నది పూర్తిగా వినియోగదారుడి ఇష్టానికి వదిలేస్తున్నట్లు గూగుల్‌ పే వైస్‌ ప్రెసిడెంట్‌ అంబరీశ్‌ కెంఘే పేర్కొన్నారు. ఉదాహరణకు మొబైల్‌ ఫోన్‌ రీఛార్జి చేసినపుడు ఈ డేటాను ఆఫర్లు, రివార్డులకు ఉపయోగించుకోవచ్చా లేదా అన్న విషయాన్ని వినియోగదారే నిర్థారించుకోవచ్చు. ‘పర్సనలైజేషన్‌ వితిన్‌ గూగుల్‌ పే’ను ఆన్‌ చేయడం ద్వారా మరిన్ని ఎంపిక చేసుకోవడానికి వీలుంటుందని ఆయన వివరించారు. కాగా, కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల నెలవారీ చురుకైన వినియోగదార్లుండగా.. అందులో ఎక్కువ భాగం భారతీయులే.

* భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాది(2021)లో అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్‌ మస్క్‌, బెజోస్‌ కంటే అదానీ ఈ విషయంలో ముందున్నారు.