Business

అవును ₹2000 నోట్లు ముద్రించట్లేదు-వాణిజ్యం

Business News - Anurag Thakur Agrees They Are Not Printing 2000 Notes

* పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది.ఈ నిర్ణయం ద్వారా వ్యూహాత్మక రంగాల్లో పనిచేస్తోన్న వారికి ఉద్యోగం పోయినా, మరే విధమైన నష్టం జరిగినా వాటిని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది.ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ సింగ్​ ఠాకూర్​ ప్రకటించారు.రాజ్యసభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం తీసుకువచ్చిన నూతన విధానం చాలా పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు.అణుశక్తి, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్​,పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్​, బీమా, ఆర్థిక సేవలను వ్యూహత్మక రంగాలుగా, మిగతా రంగాలను వ్యూహత్మకం కానివిగా వర్గీకరించామని స్పష్టం చేశారు ఠాకూర్.

* నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2000 నోట్ల ముద్రణ నిలిపివేసి రెండేళ్లు అయ్యింది.ఈ విషయాన్ని లోక్​సభకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ వెల్లడించారు.2018 మార్చి 30 నాటికి రూ. 2000 నోట్లు.. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 3.27శాతంగా ఉండేవని ఠాకూర్​ పేర్కొన్నారు.2021 ఫిబ్రవరి 26 నాటికి అది 2.01శాతానికి (2,499 మిలియన్​) పడిపోయిందని స్పష్టం చేశారు.2019-20, 2020-21 కాలంలో రూ. 2వేల నోట్లను ముద్రించమని ప్రింటింగ్​ ప్రెస్​లకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదన్నారు ఠాకూర్​.రూ. 2వేలకు సంబంధించి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.99 మిలియన్​ నోట్లను ముద్రించినట్టు ఆర్​బీఐ 2019లో ప్రకటించింది.2017-18లో 111.507 మిలియన్​ నోట్లు మాత్రమే ముద్రించారు.2018-19 నాటికి అది 46.690 మిలియన్​కు పడిపోయింది.ఆ తర్వాత ఒక్క కొత్త నోటు ముద్రణ కూడా జరగలేదు.

* ఇంధన ధరలకు కళ్లెం వేసేలా పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చన్న వార్తలను మరోసారి కేంద్రం తోసిపుచ్చింది.పెట్రోల్, డీజిల్, జెట్‌ ఇంధనం, సహజ వాయువులను వస్తుసేవల పన్ను పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతం తమ వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.లోక్‌సభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* గత ఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) 71.01 లక్షల ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్ని మూసివేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ సోమవారం పార్లమెంటుకు తెలిపారు. 2019లో ఇదే సమయంలో 66.66 లక్షల ఖాతాల్ని మూసివేసినట్లు వెల్లడించారు. ఉద్యోగ విరమణ, ఉద్యోగం కోల్పోవడం, వేరే ఉద్యోగానికి లేదా సంస్థకు మారడం వంటి పలు కారణాల వల్ల ఈపీఎఫ్‌ ఖాతాను మూసివేస్తుంటారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ ఒడుదొడుకులను చవిచూశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాల నేపథ్యంలో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అంతకంతకూ దిగజారుతూ పోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ కీలక 50వేల మార్క్‌ను.. నిఫ్టీ 15వేల మార్క్‌ను కోల్పోయాయి. ఉదయం 51,404 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ప్రీట్రేడింగ్‌లో 50,834 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత 49,799 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 397 పాయింట్లు నష్టపోయి 50,395 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,048 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,048 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి 303 పాయింట్లు కోల్పోయి 14,745 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 107 పాయింట్లు నష్టపోయి 14,923 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.47 వద్ద నిలిచింది.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కొత్త అడ్వెంచర్‌ ప్రీమియం బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సీబీ500క్ష్ పేరిట విడుదల చేసిన ఈ బైక్‌ ధరను రూ.6.87 లక్షలు (ఎక్స్‌ షోరూం, గురుగ్రాం)గా నిర్ణయించింది. బుకింగ్స్‌ ప్రారంభించినట్లు తెలిపింది. కంపెనీకి చెందిన బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా వీటిని విక్రయించనున్నారు. ప్రయాణికులకు మరిచిపోలేని అనుభూతిని అందించేందుకు ఈ ప్రీమియం బైక్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్‌, సీఈవో అత్సుషి ఒగాటా ఓ ప్రకటనలో తెలిపారు.