పంచ్ కన్నా నడక భయం

ప్రముఖ రెజ్లర్‌ కామన్వెల్త్‌ బంగారు పతక విజేత గీతా ఫొగాట్‌ రింగ్‌ వదిలి కాసేపు ర్యాంప్‌పై కనిపించారు. ల్యాక్మే ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఆమె మహిళలకు పలు సూచనలు చేశారు. మహిళలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండడమే నిజమైన అందమంటూ వ్యాఖ్యానించారు. మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

‘‘ర్యాంప్‌పై నడవడం ఇదే మొదటిసారి. రింగ్‌లోకి వెళ్లడం కంటే ర్యాంప్‌పై నడవడానికే భయంగా ఉంది. ఇది నాకు ఒక గొప్ప అనుభవం. ఈ రంగంలో ఉన్న అనేక మంది గొప్ప వ్యక్తులను కలవడం సంతోషంగా ఉంది’’ అని గీతా ఫొగాట్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆత్మస్థైర్యం లేకపోతే బయటికి అందంగా కనిపించడం కష్టమంటూ మహిళలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. ‘బ్యూటిఫుల్లీస్ట్రాంగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పలు ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న ఈ ‘షో’లో వివిధ రంగాలకు చెందిన 11మంది ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో నటీమణులు తిలోత్తమ షోమ్‌, సయానీ గుప్తా, నాటక రంగంలో పేరుగాంచిన ఐషా సయ్యద్‌తో పాటు సెలబ్రెటీ చెఫ్‌ సారా టాడ్‌ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా తన దుస్తులను డిజైన్‌ చేసిన ప్రముఖ డిజైనర్‌ రీనా గురించి మాట్లాడుతూ..‘‘హరియాణాకు చెందిన రీనా ఫ్యాషన్‌ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనను చూస్తే చాలా గర్వంగా ఉంది. మా తండ్రి (రెజ్లర్‌ మహవీర్‌ సింగ్‌ ఫొగాట్‌) మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో.. రీనా కూడా ఈ రంగంలో రాణించడానికి అంతే కష్టపడ్డారు’’ అంటూ గీత ఆమెపై ప్రశంసలు కురిపించారు.

గీతా ఫొగాట్‌ తండ్రి ప్రముఖ రెజ్లర్‌ మహవీర్‌ సింగ్‌ ఫొగాట్‌ జీవితం ఆధారంగా ‘దంగల్’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహవీర్‌ సింగ్‌ పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ ఖాన్‌ కనిపించారు. అలాగే గీతా ఫొగాట్‌ తన సోదరి బబితా ఫొగాట్‌ పాత్రల్లో నటించిన ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రాలకు ఈ చిత్రం తరవాత ఎంతో గుర్తింపు లభించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com