అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-రీటైల్ సంస్థ అమెజాన్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్. దీర్ఘకాలం ఇక్కడ కొనసాగేందుకు ఎన్నో ప్రణాళికలతో ముందుకు వచ్చింది. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) నిబంధనలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టాయి. దీంతో అనేక ఉత్పత్తులను అమెజాన్ ఇండియా తన వెబ్సైట్ నుంచి తొలగిస్తూ వస్తోంది. దాదాపు 4లక్షల ఉత్పత్తులను తొలగించినట్టు సమాచారం. ఇప్పటికే అమెజాన్ ఎకో స్పీకర్స్, బ్యాటరీలు, ఫ్లోర్ క్లీనర్లు తదితర వస్తువులను తొలగించగా, ఇప్పుడు ప్యాంట్రీలో లభించే వివిధ నిత్యావసర సరకులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తోంది. అమెజాన్ భారత్‌లో విస్తరణకు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది. కాగా, డిసెంబరు 2018 త్రైమాసికంలో అమెజాన్ నికర అమ్మకాలు 20శాతం పెరిగి 72.4బిలియన్ డాలర్లుగా నమోదు చేసింది. అయితే, కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ఈ అమ్మకాలు 56-60బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా వేస్తోంది. ‘‘ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రభావం వల్ల ఈ-కామర్స్ రంగంలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నియమ, నిబంధనలకు మేము కట్టుబడి ఉన్నాం. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం’ అని అమెజాన్ సీఎఫ్‌వో బ్రెయిన్ ఓల్స్వాస్కీ పేర్కొన్నారు. మరోపక్క వినియోగదారుల నుంచి వరుసగా అమెజాన్‌కు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ‘ప్రస్తుతం భారత్‌లో ప్యాంట్రీ సేవలను అందించలేమని, అమెజాన్.ఇన్ను అనుసరిస్తూ ఉండాలని’ సంస్థ కోరుతోంది. గత డిసెంబర్లో ఈ- కామర్స్ రంగానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను కేంద్రం మార్చింది. దేశీయ వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేలా నియమ, నిబంధనలను సవరించింది. ఈ నిర్ణయం అమెజాన్.కామ్‌తోపాటు వాల్‌మార్ట్‌లాంటి సంస్థలపైనా పడింది. కొత్త ఈ-కామర్స్ పెట్టుబడుల నిబంధనల ప్రకారం తమకు వాటాలున్న సంస్థల ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముకోరాదు. అలాగే ఆయా వస్తువుల కోసం ప్రత్యేకత (ఎక్స్‌క్లూజివ్) అమ్మకాల ఒప్పందాలను కుదుర్చుకోరాదు. దీంతో క్లౌడ్‌టేల్ లాంటి విక్రేతల వస్తువులను అమెజాన్ ఇండియా వెబ్సైట్ నుంచి తొలగించింది. ఈ నిబంధనలు అమల్లోకి రాకుండా అమెజాన్, వాల్‌మార్ట్ సంస్థలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినా పనిచేయలేదు.