* దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. మార్చి 25, గురువారం పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు, డీజిల్‌పై 20 పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు రంగ సంస్థలు నిర్ణయించాయి *అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న(మార్చి24, బుధవారం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కూడా ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు. 90.99 నుండి లీటరుకు. 90.78 కు చేరింది. డీజిల్ 20 పైసలు తగ్గి 81.30 నుండి. 81.10 స్థాయికి చేరింది. వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు….ముంబైలో పెట్రోలు ధర రూ. 97.19, డీజిల్ ధర 88.20. చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10. కోల్‌కతాలో పెట్రోల్ రూ.90.98, డీజిల్ రూ.83.98. బెంగళూరులో పెట్రోల్ రూ.94.04, డీజిల్ రూ.86.21. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.39 డీజిల్ రూ.88.45. అమరావతి పెట్రోల్ రూ.96.99, డీజిల్ రూ.90.52.
* దేశీయ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్లు విధిస్తుండడం, ఆర్థిక రికవరీ భయాలతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. దీంతో మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 49 వేల మార్కును, నిఫ్టీ 14,350 మార్కును కోల్పోయాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఎనర్జీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 72.62గా ఉంది.
* పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు చివరి తేది మార్చి 31 సమీపిస్తుంది. గడువు తేది లోపు అనుసంధానించని వారి పాన్ కార్డులు పనిచేయకపోవచ్చు. లోక్‌సభలో మంగళవారం ఆమోదించిన 2021 ఆర్థిక బిల్లులో, ప్రభుత్వం ఒక సవరణను ప్రవేశపెట్టింది, దీని ప్రకారం గడువు తేది లోపుగా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించని వారు రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
* ఓవైపు ఉక్కు కర్మాగార పరిరక్షణకు పోరు సాగుతుండగా, మరోవైపు రికార్డు స్థాయిలో ఉక్కు ఉత్పత్తి చేశారు కార్మికులు. బ్లాస్ట్ ఫర్నేస్‌లో మంగళవారం ఒక్క రోజు 20,400 టన్నుల ద్రవ ఉక్కును ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. కర్మాగారం ప్రారంభమయిన నాటి నుంచి ఒక్క రోజు ఉత్పత్తిలో ఇదే అత్యుత్తమంగా నిలిచింది.