పావు శాతం మేర వడ్డీ రేట్ల కోత-వాణిజ్య-02/05

*ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ హైదరాబాద్‌ నుంచి జెడ్డాకు ప్రతిరోజూ విమాన సర్వీసును ప్రారంభించింది. మార్చి 25 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఇక్కడి నుంచి ఉదయం 7.10కి బయలుదేరి, జెడ్డాకు ఉదయం 11.05కు (అక్కడి కాలమానం ప్రకారం) చేరుకుంటుంది. జెడ్డా నుంచి తిరిగి మధ్యాహ్నం 12.05కు బయలుదేరి రాత్రి 8.25కు హైదరాబాద్‌ చేరుకుంటుంది. దీనికోసం బోయింగ్‌ 737 మ్యాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కేటాయించినట్లు స్పైస్‌జెట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా హైదరాబాద్‌ నుంచి జెడ్డాకు రూ.13,499, అక్కడి నుంచి హైదరాబాద్‌కు రూ.10,799గా టిక్కెట్ల ధరను నిర్ణయించినట్లు పేర్కొంది.
**వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,400, విజయవాడలో రూ.33,780, విశాఖపట్నంలో రూ.34,410, ప్రొద్దుటూరులో రూ.33,600, చెన్నైలో రూ.33,280గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,850, విజయవాడలో రూ.31,300, విశాఖపట్నంలో రూ.31,650, ప్రొద్దుటూరులో రూ.31,220, చెన్నైలో రూ.31,810గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,500, విజయవాడలో రూ.41,700, విశాఖపట్నంలో రూ.41,300, ప్రొద్దుటూరులో రూ.41,500, చెన్నైలో రూ.43,700 వద్ద ముగిసింది.
*ఆర్‌బీఐ నేటి నుంచి చేపట్టబోయే ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో పావు శాతం మేర వడ్డీ రేట్ల కోత విధించే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నివేదిక వెల్లడించింది.
*వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ఆంధ్ర ప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) నూతన ఛైర్మన్‌గా కె. ప్రవీణ్‌ కుమార్‌ నియమితులయ్యారు.
*ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్‌ రూ.4,185.48 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంకు రూ.1,524.31 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.7,125.20 కోట్ల నుంచి రూ.6,190.94 కోట్లకు పరిమితమైంది.
*గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు చివరి నాటికి ద్రవ్యలోటు రూ.7.01 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలో ఇది 112.4 శాతం. ఏడాదిక్రితం ఇదే సమయంలో ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాలో 113.6 శాతంగా ఉండటం గమనార్హం.
*ఈ నెల 12 వరకు ఆస్తుల విక్రయం లేదా బదిలీ చేపట్టరాదని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)ను జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కంపెనీ ఇచ్చిన బ్యాంక్‌ గ్యారెంటీలను థర్డ్‌ పార్టీలు వినియోగించకూడదని వెల్లడించింది.
* ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సహా ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ప్రమోటర్ల వాటాను తగ్గించుకోవాలని భావిస్తున్నామని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వెల్లడించింది. ఇందుకుగాను వ్యూహాత్మక భాగస్వామి కోసం చూస్తున్నామని పేర్కొంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల పాటు సమావేశం కానుంది. గురువారం ఉదయం 11.45 గంటలకు విధాన నిర్ణయాలను ఆర్‌బీఐ ప్రకటించనుంది. 2016 సెప్టెంబరులో ఎంపీసీ కమిటీ ఏర్పాటైన తర్వాత ఆర్‌బీఐ నిర్ణయాలు మధ్యాహ్నం 2.30 గంటలకు వెలువడేవి. అయితే ఈసారి సమయం ఉదయం 11.45 గంటలకు మారింది.
*రూ.700 కోట్లకు పైగా రుణాలను పొంది చెల్లింపుల్లో చేతులెత్తేసిన సర్వోమ్యాక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులను అమ్మి అప్పులు తీర్చాలంటూ (లిక్విడేషన్‌)కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ సోమవారం ఉత్తర్వులు వెలువరించింది.
*అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఎదురైనా దేశీయ వాణిజ్య ఎగుమతుల్లో గత ఆర్థిక సంవత్సరంలో 5.79శాతం వృద్ధి కనిపించిందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్‌ వధావన్‌ అన్నారు. 2013-14లో ఎగుమతుల విలువ గరిష్ఠంగా 314 బిలియన్‌ డాలర్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది ఇంతకు మించి ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
*ఫ్రాన్స్‌ వాహన దిగ్గజం రెనో తమ చిన్న కారు క్విడ్‌ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను భారత విపణిలో ప్రవేశపెట్టింది. దీని ధరల శ్రేణి రూ.2.67- 4.63 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. కొత్త క్విడ్‌ కారు 0.8 లీటర్‌, 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌లతో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ సదుపాయాల్లో లభిస్తుందని రెనో ఇండియా వెల్లడించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com