కుంభమేళా విశేషాలు

ప్రపంచం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువే ‘కుంభమేళా’. కుంభమేళా అనేది దేవనాగరి లిపి నుండి వచ్చింది. వేదకాలం నుంచీ ఈ మహాక్రతువును నిర్వహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి కుంభమేళా ప్రయాగ వద్ద సంగమ తీరంలో ఇపుడు మళ్లీ మొదలైంది. ఇది అర్ధ కుంభమేళానే అయినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ‘కుంభ్’ అనాలని ప్రకటించింది. అంతేకాదు ఇప్పుడు ఈ పూర్ణకుంభ్‌ను ‘మహాకుంభ్’ అని కూడా అంటున్నారు. యునెస్కో కూడా కుంభమేళాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ మేళాను నిర్వహించే ప్రభుత్వానికి ఇంతకు మించిన ప్రచారం ఏదీ ఉండదేమో!
*ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం. సమస్త దేవతలూ నివసించే స్థలం జలం. హిందూ సంస్కృతిలో నదులన్నింటినీ దేవతలుగా భావిస్తారు. దీన్ని బట్టి నది నీటిని.. అందులోనూ ముఖ్యంగా గంగా నదినీ మనం ప్రథమంగా స్మరిస్తాం.. పూజిస్తాం.. మనదేశంలో ఉన్న ఏడు ముఖ్యమైన తీర్థ క్షేత్రాల్లో ఒకటి ప్రయాగ. ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్థం. గంగ, యమున, సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించడం వల్ల దీనికి ‘త్రివేణీ సంగమం’ అనే పేరు వచ్చింది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఆయా రాశుల్లో ఉన్న సమయంలో అర్ధ కుంభమేళాను నిర్వహిస్తారు. ఇవి ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్‌లలో జరుగుతాయి. చివరి అర్ధ కుంభమేళాను మహా కుంభమేళాగా పిలుస్తారు. కుంభస్నానాలు ఆచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి.
*అసలు మహాకుంభమేళా అంటే ఏమిటి? ప్రతి పుష్కరానికి (12 సంవత్సరాలకు) ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహామేళా విశేషాలను లోతుగా పరిశీలిస్తే.. కుంభం అనగా కుండ లేదా కలశం అని అర్థం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం ‘కుంభం’ అనేది ఒక రాశి కూడా. ‘మేళా’ అంటే కలయిక లేదా జాతర. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూ ధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
దక్షిణ భారతంలో పుష్కరాలు, పుష్కర స్నానాలు ఏయే నదులకు ఎప్పుడు వస్తాయో మనకు తెలుసు కానీ ఈ కుంభస్నానాలనేవి కేవలం ఉత్తరదేశపు తీర్థాలకే సొంతం. అనేకమంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ వేడుకను జరుపుతారు. ఈ కుంభస్నానాలు ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలోనే జరుగుతాయి. దక్షిణాదిలో నదీ తీరాల వద్ద పుష్కరాలు గురుగ్రహ సంచారంలో ఒక్కొక్క రాశి ప్రవేశంతో ప్రారంభమవుతాయి. ఇవి పనె్నండు రోజుల వరకూ కొనసాగుతాయి. అయితే ఈ కుంభస్నానాలు మాత్రం ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలో ఖగోళీయ గ్రహగతుల ఆధారంగా ప్రారంభమవుతాయి. పుష్కర స్నానాలకు గురుచారం ఒకటే ప్రాతిపదిక అయితే, కుంభస్నానాలకు గురు గ్రహ సంచారంతోపాటు రవి, చంద్రుల సంచారం కూడా ప్రాతిపదికగా తీసుకుని స్నాన తేదీలను నిర్ణయిస్తారు. సూర్యుడు-బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను నాసిక్‌లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోను, బృహస్పతి వృషభరాశిలో- సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలోను, బృహస్పతి-సూర్యుడు వృశ్చికరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాను నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి స్థలంలో కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గ్రహస్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది.
**అంటే.. గురుడు మేషరాశిలో ఉండి రవి, చంద్రులు మకర రాశిలో ఉన్నప్పుడు అమావాస్య నాడు కుంభయోగం ఏర్పడుతుంది అని అర్థం. అలా ఏర్పడిన తరువాత మకర సంక్రమణం నాడు మొదటి షాహీస్నాన్‌తో కుంభస్నానాలు ప్రారంభం అవుతాయి. ఈ గ్రహస్థితి ప్రకారం 2013 జనవరి 14న మకర సంక్రమణం నాడు ప్రయాగరాజ్ (అలహాబాద్) వద్ద కుంభమేళా ప్రారంభమైంది. మరి ఇప్పుడు జరిగేదేమిటి… అనుకుంటున్నారా? ఇది అర్ధ కుంభమేళా.. ప్రధాన కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మధ్యలో ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధకుంభ్‌ను నిర్వహించాలని కొన్ని శతాబ్దాల క్రితమే సాధుసంత్‌ల మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అర్ధకుంభ్ కేవలం ప్రయాగ, హరిద్వార్‌లలోనే జరుగుతుంది. ఆయాచోట్ల ప్రధాన కుంభయోగానికి సరిగ్గా ఆరు సంవత్సరాలకు అర్ధకుంభ్‌ను జరుపుతారు. అం దువల్ల 2013లో ప్రధాన కుంభమేళా జరిగాక 2019 మకర సంక్రమణమైన జనవరి 15న అర్ధకుంభ్ ప్రారంభమైంది. అర్ధకుంభ్‌నకు ఖగోళ గ్రహగతులతో సంబంధం లేదు. ప్రధాన కుంభమేళా జరిగాక ఆరు సంవత్సరాలు పూర్తి కావాలి.
**పురాణాల్లో…
కుంభమేళాల గురించి భాగవతం, మహాభారతం, రామాయణం, విష్ణుపురాణం మొదలైన గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయట. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాల్లో ఒకచోట ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దీనిని సాధారణ కుంభమేళా అంటారు.
**ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళా అనీ, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అనీ అంటారు. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత చేసేదాన్ని మహా కుంభమేళా అంటారు. అంటే 12తి12=144 సంవత్సరాలకు ఒకసారి చేసే కుంభమేళాను మహా కుంభమేళా అని వ్యవహరిస్తారు. ఈ ఏడాది అర్ధ కుంభమేళా తర్వాత 2025లో పూర్ణ కుంభమేళా జరగనుంది. అలాగే ప్రతి సంవత్సరం పుణ్యనదుల్లో ఏదో ఒకదానికి పుష్కరాలు వస్తాయి. గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరము వస్తుంది. ఈసారి గురుడు ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక 2019 నవంబర్ 5 మంగళవారం నుండి బ్రహ్మపుత్ర నదికి అనగా పుష్కరవాహిని నదికి పుష్కరాలు వస్తాయి.ఇక అర్ధ కుంభమేళా విషయానికి వస్తే జనవరి 15 నుండి గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో ప్రయాగ్‌రాజ్ వద్ద కుంభస్నానాలు ప్రారంభమయ్యాయి. ఈ అర్ధ కుంభమేళాకి ఎన్నో లక్షలమంది అఘోరాలు, సాధువులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు.కుంభమేళా గురించి స్కంద పురాణంలో వర్ణన కూడా ఉంది.
*పురాణాల్లో ప్రస్తావన..
మనకు దేవదానవుల క్షీరసాగర మథనం కథ తెలుసు కదా! అప్పుడు ఉద్భవించిన అమృతం కోసం దేవదానవుల నడుమ 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అలాగే కుంభ పర్వాలు కూడా 12 ఉన్నాయి. అయితే అవి మానవులకు నాలుగు, దేవతలకు ఎనిమిది కేటాయించడం జరిగింది. అందువల్ల భూమిపై నాలుగు, దేవలోకంలో ఎనిమిది కుంభపర్వాలు జరుగుతాయని స్కందపురాణ వచనం. దేవదానవ సంగ్రామంలో అమృత కుంభాన్ని సూర్యచంద్రులు, గురుడు, శని రక్షించారు. చంద్రుడు కలశం నుండి అమృతం బయటకు ఒలకకుండా కాపాడితే, సూర్యుడు కలశం పగిలిపోకుండా చూసుకున్నాడట. గురుడు కలశాన్ని రాక్షసుల నుండి కాపాడితే, శనీశ్వరుడు ఇంద్రుడి నుండి కలశాన్ని కాపాడాడని స్కంద పురాణం ఇలా తెలిపింది..
* సమయంలో ఈ గ్రహాలు కలశాన్ని రక్షించాయో.. అప్పటి గ్రహస్థితికి అనుగుణంగా వర్తమాన గ్రహస్థితులలోకి ఆయా గ్రహాలు వచ్చినప్పుడు ‘కుంభయోగం’ ఏర్పడుతుంది. అయితే అమృత కుంభం నుంచి కొన్ని అమృత బిందువులు తుళ్ళి నాలుగుచోట్ల పడ్డాయనీ, అందువల్ల అవి పడిన నాలుగుచోట్ల.. అంటే ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలో కుంభమేళా జరుగుతుందని స్కందపురాణం చెబుతోంది.
**స్నాన మహాత్మ్యం
మామూలు రోజుల్లోనే ప్రయాగ వద్ద స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇక కుంభయోగంలో స్నానం గురించి చెప్పేదేముంది?వెయ్యి అశ్వమేధ యాగాలు, వంద వాజపేయ యాగాలు, లక్షసార్లు భూ ప్రదక్షిణలు చేస్తే ఎంత ఫలితమో, ప్రయాగలో కుంభస్నానం చేస్తే అంత ఫలితమని విష్ణుపురాణ వచనం.
*అంటే.. వెయ్యి కార్తీక మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, వంద మాఘ స్నానాలు గంగలో చేసిన ఫలితం, కోటిసార్లు వైశాఖ మాస స్నానాలు నర్మదా నదిలో చేసిన ఫలితాన్ని.. ఒక్కసారి ప్రయాగలో కుంభ స్నానం చేయడం వల్ల మానవుడు పొందుతాడని స్కంద పురాణ వచనం.గ్రహాలలో సూర్యుడు, నక్షత్రాలలో చంద్రుడు ఎలా శ్రేష్ఠమో, తీర్థాలలో ప్రయాగ అలా శ్రేష్ఠమని పద్మపురాణ వచనం. ప్రయాగలోని అక్షయవట దర్శం చేస్తే బ్రహ్మహత్యాది పాతక నాశనం అవుతుందని పద్మ పురాణం చెబుతోంది. ప్రయాగ తీర్థాన్ని అరవై వేల ధనుర్ధారులు గంగానదిని, సూర్యభగవానుడు యమునా నదిని, ఇంద్రుడు ప్రయాగ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడని మత్స్యపురాణ వచనం. మాఘమాసంలో త్రివేణీ సంగమ స్నానం విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నారద పురాణ వచనం. అందువల్ల వీలుచూసుకుని పుణ్యాభిలాషులమై, దురిత క్షయాన్ని కాంక్షిస్తూ ప్రయాగలో స్నానం ఆచరించి సాధుదర్శనం చేసుకుంటే జన్మ చరితార్థమైనట్లే..
**ముఖ్యమైన రోజులు
జనవరి 15న (మంగళవారం) రాజస్నానం, జనవరి 21న (సోమవారం) పుష్య పౌర్ణమి ఇప్పటికే ముగిశాయి.
ఫిబ్రవరి 4: సోమవారం వౌని అమావాస్య..
ఫిబ్రవరి 9: శనివారం శ్రీపంచమి..
ఫిబ్రవరి 19: మంగళవారం వ్యాసపూర్ణిమ, మాఘపూర్ణిమ..
మార్చి 4 : సోమవారం మహాశివరాత్రి..
శివరాత్రి పర్వదినంతో ఈ ఏడాది అర్ధ కుంభమేళా పరిసమాప్తమవుతుంది.
**చరిత్రలో..
629-645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్, గ్జుయాన్జాంగ్ రచనల్లో మొదటగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీరసాగర మథన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.‘ఇంపీరియల్ గెజట్ ఆఫ్ ఇండియా’ ప్రకారం హరిద్వార్‌లో 1892లో జరిగిన కుంభమేళాలో పాల్గొన్నవారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వల్ల తరువాతి కాలంలో అధికారులు నిర్వహణ ఏర్పాట్లను మెరుగు పరచడం, హరిద్వార్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది. 1903లో దాదాపు నాలుగు లక్షల మంది కుంభమేళాకు హాజరయ్యారు. 1998, ఏప్రిల్ 14న హరిద్వార్‌లో కుంభమేళాకు పది మిలియన్లకు పైగా భక్తజనులు హాజరయ్యారు. 2001లో జరిగిన చివరి మహాకుంభమేళాకు దాదాపు 60 మిలియన్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
**మేళాకు నిధుల వరద..
కుంభమేళా నిర్వహణకు ఉత్తరప్రదేశ్‌లోని ఆదిత్యనాథ్ యోగి సర్కారు రూ. ఏడువేల కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో 3,200 హెక్టార్ల విస్తీర్ణంలో 1.22 లక్షల తాత్కాలిక టాయిలెట్లు, 20 వేల డస్ట్ బిన్లు, 42 మురుగు కాలువలను అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రతేకంగా ఫుడ్ హబ్ ఏర్పాటు చేశారు. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలను వేడివేడిగా వండి వడ్డిస్తారు. ప్రయాగను అందంగా ముస్తాబు చేయడానికి ఉద్దేశించిన సర్కారీ పథకమే ‘పెయింట్ మై సిటీ’. ఈ పథకం ద్వారా రోడ్లు, కూడళ్లు, ఫ్లైఓవర్లు, భవనాలు, గోడలు రంగులద్దుకుని మెరిసిపోతున్నాయి. దీనికోసం ఐదు ఏజెన్సీల ఆధ్వర్యంలో దాదాపు వెయ్యికి పైగా ఆర్టిస్టులు పగలూ రాత్రీ కష్టపడ్డారు. కుంభమేళా ప్రాశస్త్యాన్ని వివరించేలా ప్రభుత్వం ఓ లేజర్ షోను కూడా ఏర్పాటు చేసింది. సాధువుల కోసం ప్రయాగ్‌రాజ్‌లో ఐదు వేల శిబిరాలు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరిలో దాదాపు 192 దేశాల ప్రతినిధులు కుంభమేళాకు హాజరవుతారని అధికారుల అంచనా.
**టెంట్ సిటీ
కుంభమేళా అంటే హిందువులందరికీ పండగే. ముఖ్యంగా మూడు నదుల సంగమంలో మూడు మునకలేసేందుకు, పితృతర్పణాలు వదిలేందుకు, పూజలు చేసేందుకు దేశం నలుమూలల నుంచీ ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఈ సమయంలో త్రివేణీ సంగమం అఖండ భారతావనిలోని సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుగా దర్శనమిస్తుంది. ఆ భిన్నత్వాన్ని తిలకించేందుకు, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కుంభమేళాను కళ్లారా చూసేందుకు, సనాతన ధర్మాన్ని అవగాహన చేసుకునేందుకు విదేశీ పర్యటకులు కూడా లక్షల్లో వస్తుంటారు. అటు భక్తులు, ఇటు పర్యటకులతో నదీ సంగమం జనసంద్రమవుతుంది. వారందరికీ మామూలు హోటళ్లలో గదులు దొరకడం అసాధ్యమే. దీనికి పరిష్కారంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ‘టెంట్ సిటీ’ని నిర్మించింది. పేరుకు ఇవి గుడారాలే కానీ స్టార్ హోటళ్లలో ఉండే అన్ని సౌకర్యాలు ఈ టెంట్లలో ఉండటం విశేషం. హాలు, బెడ్‌రూమ్, లివింగ్‌రూమ్‌లను కలిగి ఉన్న విల్లా టైపు గుడారాలు ఒక రకమైతే, చిన్నగా ఉండి బెడ్‌తో పాటు సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ సదుపాయాలన్నీ ఒకే గదిలో ఉన్నవి మరో రకం. ఇక వీటిలోనే రెస్టారెంట్లు, స్పాలు, యోగ కేంద్రాలు, సాంస్కృతిక వేదికలు.. ఇలా అన్ని రకాల సౌకర్యాలు, భోజన వసతుల్ని బట్టి గుడారాల అద్దె ఉంటుంది. వీటిని ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.
**మత సామరస్యం
యూపీలో యోగి సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుంభమేళాలో మతసామరస్యం వెల్లివిరుస్తోంది. హిందూ ముస్లిం భారుూ భాయి అని మరోసారి రుజువైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన అతి ప్రాచీనమైన కుంభమేళాలలో స్నానం చేసే పాపాలన్నీ తొలిగి, ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండీ దేశ విదేశాల నుంచీ భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. హిందూ ధర్మం ప్రధానంగా ప్రతిబింబించే ఈ కుంభమేళా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
*అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది డాక్టర్లు కుంభమేళాలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల కోసం ముస్లిం డాక్టర్ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వారికి ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తున్నారు. డాక్టర్‌తో పాటు మరి కొంతమంది సభ్యులు కూడా ఈ మెడికల్ క్యాంప్ కోసం పనిచేస్తున్నారు. 24 గంటలపాటు వీరంతా భక్తులకు అందుబాటులో ఉంటున్నారు. కుంభమేళాలో సెక్టార్ నెంబర్ 15 వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో రోజుకు వందలాదిమందికి చికిత్స అందిస్తున్నారు. వీరు ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులో ట్రీట్‌మెంట్ ఎంతో అద్భుతంగా ఉందంటున్నారు భక్తులు. ఓ స్వామీజీ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా బయటకు వెళ్తున్నారన్నారు. ప్రతిరోజు దాదాపు 800 మందికి చికిత్స అందిస్తున్నారన్నారు. మెడికల్ క్యాంపులో ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. కుంభమేళాలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న అలీగఢ్ వర్శిటీ డాక్టర్ల సేవా దృక్పథాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. మొత్తం మీద ఈ కుంభమేళా సాక్షిగా భారతదేశంలో మతసామరస్యం వెల్లువెత్తింది.
**అఖాడాలు
ప్రయాగలోని మూడు నదుల సంగమ తీరంలో ఇపుడు కుంభమేళా కోలాహలం ప్రారంభమైంది. మేళాకు ప్రధాన ఆకర్షణగా భావించే నాగ సాధువులతో అన్ని అఖాడాలు ఊరేగింపుగా కుంభమేళాలోని తమ శిబిరాలకు చేరుకున్నాయి. సాధువులు, సన్యాసులు, మతపెద్దలు ఉండే అఖాడాలకు నాగా సాధువులు కేంద్రంగా ఉంటారు. సనాతన మత ధర్మాలను పరిరక్షించేందుకే సాధువుల సంప్రదాయం ప్రారంభమైందని వారు చెబుతారు. ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆఖాడా సంప్రదాయంలో మొదట పది అఖాడాలే ఉండేవి. కానీ క్రమంగా వాటి సంఖ్య పెరిగింది. ఇప్పుడు 15 అఖాడాలు ఉన్నాయి. సనాతన ధర్మానికి చెందిన శివ, వైష్ణవ సంప్రదాయాలను ఆచరించే అఖాడాలతో పాటు, సిక్కులకు కూడా సొంత అఖాడా ఉంది. అది 1855 నుంచే కుంభమేళాలో పాల్గొంటోంది.
కొత్తగా ఏర్పడిన అఖాడాల్లో మహిళా సాధువులు మాత్రమే ఉండేదాన్ని పరీ (దేవకన్యల) అఖాడా అంటున్నారు. ట్రాన్స్‌జెండర్స్, హిజ్రాల కోసం ప్రత్యేక అఖాడా కూడా ఉంది. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ అఖాడాలు చాలా పోరాటాలు చేసిన తర్వాత కుంభమేళాలలో పాల్గొనడానికి స్థానం సంపాదించుకున్నాయి. పరీ అఖాడాకు 2013 ప్రయాగలో జరిగిన కుంభమేళాలో ప్రాధాన్యం లభించింది. ఇక హిజ్రాల అఖాడాకు ఇప్పుడు జరిగే అర్ధకుంభ్‌లోనే ప్రాధాన్యం లభించింది. ఈ అఖాడాలు కుంభమేళాకు వచ్చేవారిని ఆకర్షించాయి. అఖాడాల ఊరేగింపు మొదటి మూడురోజులే ఉంటాయి. *
1. శ్రీశైలం మల్లన్నకు తలపాగా!మహాశివరాత్రి రోజున అలంకరణకుసిద్ధం చేస్తున్న పెడన చేనేత కార్మికులు
పెడన ప్రాంతంలోని చేనేత కార్మికులు ఎక్కువగా శైవారాధన చేస్తారు. భోళాశంకరుడు తమను కరుణిస్తాడని పరిశ్రమ విరాజిల్లేలా రక్షిస్తాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకొంటే తమ కష్టాలు తీరతాయని నమ్ముతారు. ఒకప్పుడు పరిశ్రమలో కరవు తాండవించి ఉపాధి లేక వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో శ్రీశైలం మల్లన్నకు తలపాగా ఇస్తామని గూడూరు మండలం కప్పలదొడ్డికి చెందిన ఒక కార్మికుడు మొక్కుకున్నారు. మగ్గంపై సిద్ధం చేసిన తలపాగాను సంప్రదాయబద్ధంగా మహాశివరాత్రి నాడు సమర్పించారు. ఈక్రతువు పూర్తయిన తరువాత తిరిగి పరిశ్రమ విరాజిల్లిందని అప్పట్లో ప్రచారం. దీంతో ఈ ప్రాంతంలో మల్లన్నకు తలపాగా సిద్ధం చేయడం మహాశివరాత్రికి ముందు ఆనవాయితీగా వస్తోంది.
*18వ సారి
పెడనకు సరిహద్దున ఉండే గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు పేరిశెట్టి బాలకోట నాగేశ్వరస్వామి 18వసారి మల్లన్నకు తలపాగాను తన మగ్గంపై సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమలో కరవు విలయతాండవం చేసిన సమయంలో ఈయన పూర్వీకులు శ్రీశైలంలో తలపాగా సమర్పించారని నాగేశ్వరస్వామి చెబుతున్నారు. అదే ఆచారంతో 220 గజాల పొడవు, 18 అంగుళాల వెడల్పు ఉండే తలపాగాను 40వ నెంబరు నూలుతో రూపొందిస్తున్నారు. ఈయన గత 27 ఏళ్లుగా మధ్యలో 9 సంవత్సరాలు విరామం అనంతరం తిరిగి మొదలుపెట్టారు. ప్రస్తుతం 18వసారి శ్రీశైల దేవస్థానానికి మార్చి 24న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తలపాగా అందించనున్నారు. ఇందుకు అవసరమైన నూలును కొంతమంది చేనేత ప్రముఖులు అందజేస్తున్నారని ఈపేద కార్మికుడు చెప్పారు. తలపాగాకు దాదాపు రూ.40 వేల వరకు వెచ్చిస్తున్నారు.
*5జిల్లాల నుంచి తలపాగాలు
కృష్ణాలోని పెడనతోపాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల నుంచి మొత్తం 11 తలపాగాలను శ్రీశైలం దేవస్థానానికి చేనేత కార్మికులు అందజేస్తారు. ఇలా పాగాలు తీసుకువెళ్లే కార్మికులకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. పెడనకు సంబంధించి నాగేశ్వరస్వామికి ఇప్పటికే కలెక్టర్‌ అనుమతి జారీ చేయగా, బ్రహ్మపురానికి చెందిన కోట సుబ్రహ్మణ్యం దరఖాస్తు కలెక్టరేట్‌లో పరిశీలనలో ఉంది. స్వామివారికి సమర్పించనున్న తలపాగాను మగ్గంపై సిద్ధం చేసే సమయంలో అత్యంత నిష్ఠగా ఉంటామని కార్మికుడు కోట సుబ్రహ్మణ్యం చెప్పారు. ఉదయం పూజాది కార్యక్రమాల అనంతరం నేత మొదలుపెడతామని, శుద్ధి పాటిస్తామన్నారు. సంతానం లేని మహిళలు మగ్గం వద్ద పూజ చేసి, ఆతర్వాత కొద్దిసేపు మగ్గంపై నేతపని చేస్తే సంతానం కలుగుతుందని కార్మిక కుటుంబాలు ప్రగాఢంగా విశ్వసిస్తాయి.
*పెడనలో తొలిసారిగా
పెడన బ్రహ్మపురంలో కార్మికుడు యక్కల కోట సుబ్రహ్మణ్యం తొలిసారిగా శ్రీశైల దేవస్థానానికి తలపాగాను సిద్ధం చేస్తున్నారు. ఈయన తన సొంత ఖర్చుతో 60/40వ నెంబరు నూలుతో తలపాగాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీశైలం మల్లికార్జునస్వామిపై అచంచల భక్తితో ఈకార్యక్రమాన్ని తలపెట్టానని చెబుతున్నారు. గత నెలలో చేపట్టిన తలపాగా ఈనెల 20వ తేదీకి సిద్ధమవుతుందని కోటసుబ్రహ్మణ్యం చెబుతున్నారు.
*చీరాల కార్మికునితో అలంకరణ
తలపాగా అలంకరణలో శ్రీశైల దేవస్థానం సంప్రదాయ ఆచారాన్ని పాటిస్తుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఈ తలపాగాలను చీరాలకు చెందిన చేనేత కార్మికుడు పృద్ధ్వీ వెంకటేశ్వరరావుతో స్వామివారి శిఖరంపై ఉన్న 9 లింగాలకు మహాశివరాత్రిరోజు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అలంకరిస్తారు. స్వామివార్లకు ఎదురుగా ఉండే మహానందికి కూడా అలంకరిస్తారు. అలంకరణ సమయంలో ఆలయం వెలుపల విద్యుత్తు దీపాలను ఆర్పివేస్తారు. చీకటిలో ఈఅలంకరణ జరుగుతుంది. అలంకరణ కోసం వచ్చిన వెంకటేశ్వరరావును ఆలయ మర్యాదలతో స్వాగతిస్తారు. ఇలా అలంకరించిన తలపాగాలకు ఆతర్వాత దేవస్థానం వేలంపాట పెడుతుందని… కర్ణాటకకు చెందిన భక్తులు వీటిని పొందేందుకు ఆసక్తి చూపుతారని ఇక్కడి కార్మికులు చెబుతున్నారు. చేనేత పరిశ్రమ రక్షణకు చేపట్టిన ఈపురాతన ఆచారం నేటికీ పదిలంగా ఉండటం విశేషం.
2. ఘనంగా నాగోబా జాతర ప్రారంభం
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతరను సోమవారం రాత్రి ఆదివాసీ గిరిజనులు మహా పూజలతో వైభవంగా ప్రారంభించారు. తెలంగాణలో మేడారం సమ్మక్క,సారలమ్మ జాతర తర్వాత ఇదే పెద్ద జాతర. మెస్రం వంశ పెద్దలు, పూజారులు ఆలయాన్ని శుద్ధిచేసిన అనంతరం నాగోబా దేవతను గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చి గంగాజలంతో అభిషేకం నిర్వహించారు. తర్వాత మెస్రం వంశీయుల్లో ఏడుగురు దేవతను తిరిగి గర్భగుడిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలకు మెస్రం వంశంలోని ఏడుగురు పెద్దలను తప్ప ఇతరులను అనుమతించలేదు. సోమవారం ఉదయం గిరిజన వాయిద్యాలతో నాగోబా విగ్రహాన్ని గ్రామంలోని మందిరం నుంచి ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. మహిళలు గంగాజలాన్ని కుండల్లో తీసుకువచ్చి మట్టితో పుట్టలు తయారు చేశారు. దేవాలయ పునరుద్ధరణ పనుల కోసం పాత ఆలయాన్ని కూల్చి వేయడంతో మూలవిరాట్టు చుట్టూ ఫెన్సింగ్‌తోపాటు పరదాలు కట్టి పూజలు చేశారు. రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి గిరిజనులు ఈ పూజల్లో పాల్గొన్నారు.
3. అయోధ్యపై సుప్రీంలో మరో కొత్త కేసు
అయోధ్యపై మరో కొత్త కేసు సోమవారం నాడు సుప్రీంకోర్టులో దాఖలైంది. వివాదాస్పద కట్టడం ఉన్న ప్రాంతంతో పాటు చుట్టూ ఉన్న 67. 703 ఎకరాల స్థలాన్ని 1993లో కేంద్రం సేకరించడమే చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఏడుగురు వ్యక్తులు ఓ పిటిషన్‌ వేశారు. వీరిలో లఖ్‌నవూకు చెందిన ఇద్దరు న్యాయవాదులు కూడా ఉన్నారు. స్థల సేకరణ అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, పార్లమెంట్‌లో చట్టం చేసి సేకరించడం చట్టప్రకారం చెల్లదన్నది వారి వాదన.
4. మార్చి 2 నుంచి 7వ తేదీ వరకూ కీసర బ్రహ్మోత్సవాలు
రాష్ట్రంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులున్న కేసరగిరి బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కీసర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో కీసర బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎలాంటి లోటు పాట్లకు అవకాశం ఇవ్వకుండ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శాఖల మధ్య సమన్వయం కొరకు కమిటీని ఏర్పాటు చేసిన కలెక్టర్ డీఆర్‌డీఓ కౌటిల్యను కన్వీనర్‌గా నియమించారు. గత అనుభవనాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలన్నారు.
5. ఉపవాసం మంచిదే!
ఉపవాసం వల్ల శరీరంలో జీర్ణక్రియ విశ్రాంతి తీసుకొని ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఉపవాసం వల్ల మెటబాలిజం సరిగ్గా ఉంటుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైంటిస్టులు. ఈ అంశంపై వాళ్లు ఒక అధ్యయనం చేశారు. వారంలోగానీ.. పక్షంలోగానీ ఒకరోజు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు ఆయుష్షు కూడా పెరుగుతుందని చెప్పారు. ఆహారం పూర్తిగా మానేసి అవసరమైనప్పుడు నీళ్లు తాగడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత మెరుగవుతాయి. ఎప్పుడు చూసినా యాక్టివ్‌గా కనిపిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు.. జలుబు లాంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. కాబట్టి ఉపవాసం గురించి ఎలాంటి ఆందోళన చెందకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాటించాలి అంటున్నారు నిపుణులు.
6. శ్రీవారి దర్శనం- వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక టోకెన్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం 65 ఏళ్లకుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ నాలుగు వేల టోకెన్లను జారీ చేసింది. శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెట్లు, మధ్యాహ్నం 2 గంటలకు రెండువేల టోకెన్లు, మూడు గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు ఇవ్వనుంది.రద్దీరోజుల్లో తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా.. ఈ అవకాశాన్ని కల్పించినట్టు టీటీడీ తెలిపింది. బుధవారం ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని, ఇందుకోసం నాలుగు వేల టోకెన్లు ఇస్తామని టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రిన్స్‌పాల్‌ సెక్రటరీ శైలేంద్ర జోషి, ట్యాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, కర్నాటక డీజీపీ నీలమణిరాజు, తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.
7. వైభవంగా నాగోబా జాతర ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంత కెస్లాపూర్ గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. ఆయాప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులు, భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. నాగోబాకు నిర్వహించే మహాపూజలకు ఉదయం 11 గంటల నుంచే శ్రీకారం చుట్టారు. పవిత్ర గంగాజలంతో మర్రిచెట్లవద్ద బసచేసిన మెస్రం వంశీయులు కెస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నాగోబా విగ్రహాన్ని ఆలయానికి తరలించారు.ముందుగా మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించారు. పురాతన నాగోబా విగ్రహాలతోపాటు సతీదేవతలకు, భాన్ దేవతలతోపాటు పెర్సపేన్‌దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలోని 22 కితలకు చెందిన మహిళలకు పెద్దల చేతులమీదుగా మట్టికుండలు పంపిణీ చేయగా, ఆడపడుచులు మర్రిచెట్ల ప్రాంతంలోని పురాతన బావి కోనేరుకు చేరుకున్నారు. మెస్రం వంశ అల్లుళ్లు మట్టికుండల్లో తోడిచ్చిన నీటిని ఆలయానికి తీసుకొచ్చారు. ఆ నీటితో అల్లుళ్లు బురదమట్టి తయారుచేయగా, అ మట్టితో పాముల పుట్టలు, బౌలదేవతలను తయారుచేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం మహిళలకు గోవాడ్‌లో ప్రవేశం కల్పించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. అనంతరం అతిథులతోపాటు భక్తజనానికి నాగోబా దర్శన అవకాశం కల్పించారు.
8. శుభమస్తు
తేది : 5, ఫిబ్రవరి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము: మంగళవారం
క్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 34 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 15 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(నిన్న తెల్లవారుజాము 2 గం॥ 56 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 1 ని॥ వరకు)
యోగము : వ్యతీపాతము
కరణం : (కింస్తుఘ్న) కౌస్తుభ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 9 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 11 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 9 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 48 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 11 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 33 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 45 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 47 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 12 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మకరము
9. ఫిబ్రవరి 5న దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ మంగళవారం సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
*తేదీ ఉదయం రాత్రి
06-02-2019(బుధవారం) ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం
07-02-2019(గురువారం) సూర్యప్రభవాహనం పెద్దశేష వాహనం
08-02-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం సింహవాహనం
09-02-2019(శనివారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
10-02-2019(ఆదివారం) ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం
11-02-2019(సోమవారం) కల్యాణోత్సవం గజవాహనం
12-02-2019(మంగళవారం) రథోత్సవం ధూళి ఉత్సవం
13-02-2019(బుధవారం) సర్వభూపాల వాహనం అశ్వ వాహనం
14-02-2019(గురువారం) వసంతోత్సవం, చక్రస్నానం హంసవాహనం, ధ్వజావరోహణం
15-02-2019(శుక్రవారం) స్నపనతిరుమంజనం పుష్పయాగం
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి,అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
10. తిరుమల సమాచారం
ఈరోజు మంగళవారం.. *05-02-2019* ఉదయం *5* గంటల సమయానికి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….
శ్రీ వారి దర్శనానికి *2* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు….
శ్రీ వారి సర్వ దర్శనానికి *6* గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *03* గంటల సమయం పడుతోంది.. నిన్న ఫిబ్రవరి *4* న *59,960* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹:2.77* కోట్లు.
11. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణం ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు ఐదు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని నిన్న 59,960 మంది భక్తులు దర్శించుకున్నారు. 17,817 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com