పౌరుష గ్రంధి జాగ్రత్త

పురుషుల్లో మాత్రమే ఉండే గ్రంథి ప్రోస్టేట్‌. దీనికి పౌరుష గ్రంథి అని కూడా పేరు. వీర్యం ఉత్పత్తిలో దీని పాత్ర కీలకం. ఈ భాగానికి వచ్చే క్యాన్సర్‌నే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అంటారు. మిగతా క్యాన్సర్లతో పోల్చితే ఇది కాస్త అరుదుగా వస్తుంది. అలాగని తేలిగ్గా తీసుకోవాల్సిన క్యాన్సర్‌ కాదు.మూత్రాశయం నుంచి మూత్రనాళం కిందకు వచ్చే చోట పెద్ద ఉసిరికాయంత పరిమాణంలో ప్రోస్టేట్‌ గ్రంథి ఉంటుంది. ఇది మూత్రనాళం చుట్టూ ఉంటుంది. వృషణాల్లో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు… ఈ ప్రోస్టేట్‌ గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసే వీర్యం రూపంలో బయటకు వస్తుంటాయి. సంతానోత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఈ గ్రంథి వయసు పెరుగుతున్నకొద్దీ పరిమాణంలోనూ పెద్దదవుతుంది. ఫలితంగా మూత్రనాళం ఒత్తిడికి గురై మూత్ర విసర్జనలో సమస్యలు తలెత్తుతాయి. దీన్నే ‘బినైన్‌ ప్రోస్టాటిక్‌ హైపర్‌ప్లేసియా(బీపీహెచ్‌)’ అంటారు. వృద్ధుల్లో కళ్లకు శుక్లాల సమస్య వచ్చినట్లు ప్రోస్టేట్‌ గ్రంథికి బీపీహెచ్‌ వస్తుంది. ఇది ఇబ్బంది పెట్టేదే కానీ, ప్రమాదం తెచ్చిపెట్టేది కాదు. కానీ ఇదే వయసులో, ఇవే లక్షణాలతో ప్రోస్టేట్‌లో క్యాన్సర్‌ కూడా ఆరంభం కావొచ్చు. పాశ్చాత్య దేశాల్లో ఈ క్యాన్సర్‌ సగటున లక్షకు 150-200 మందికి వస్తే మన దగ్గర 10-12 మందికి వస్తుంది. నగరజీవుల్లోనే ఇది ఎక్కువ. 40 ఏళ్లుదాటిన వాళ్లలో ఈ క్యాన్సర్‌ కనిపిస్తున్నా, బాధితుల్లో 70 శాతం 60 ఏళ్లు పైబడినవాళ్లే. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రావడానికి నిర్దిష్ట కారణాల్ని చెప్పలేం. కొవ్వు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, సూర్యరశ్మి తగలకపోవడం కొంతవరకూ కారకాలని చెప్పొచ్చు. మద్యం తాగేవాళ్లలో- ప్రత్యేకించి విస్కీ తాగేవాళ్లలో, పొగ తాగేవాళ్లలో, వేయించిన మాంసాహారం తినేవాళ్లలో ఈ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు.
**ఎలా తెలుస్తుందంటే…
మూత్రానికి ఎక్కువగా వెళ్లడం, మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం, మూత్రం సరిగ్గా రాకపోవడం, అరుదుగా మూత్రంలో రక్తం కూడా కనిపించడం, ఎముకల్లో నొప్పి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ లక్షణాలు. వీటిలో కొన్ని లక్షణాలు బీపీహెచ్‌లోనూ ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించగానే క్యాన్సర్‌ అని భయపడకుండా యూరాలజిస్టు లేదా క్యాన్సర్‌ స్పెషలిస్టులను సంప్రదించాలి. క్యాన్సర్‌, బీపీహెచ్‌ల మధ్య తేడాను వీళ్లు చెప్పగలరు. మలద్వారంలో వేలు పెట్టి ప్రోస్టేట్‌ని తాకి చూడ్డంద్వారా ఈ గ్రంథిలో వస్తున్న మార్పుల్ని ప్రాథమికంగా గుర్తించవచ్చు. తర్వాత పీఎస్‌ఏ(ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌) రక్త పరీక్ష చేస్తారు. సాధారణ వ్యక్తుల్లో పీఎస్‌ఏ 4 నానోగ్రామ్స్‌/ఎం.ఎల్‌, అంతకంటే తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే క్యాన్సర్‌గా అనుమానించాలి. కొన్నిసార్లు ప్రోస్టేట్‌కి ఇతర రకాల ఇన్‌ఫెక్షన్లు సోకినా కూడా పీఎస్‌ఏ ఎక్కువగా ఉంటుంది. 20నానోగ్రామ్‌/ఎం.ఎల్‌. దాటితే మాత్రం క్యాన్సర్‌ అని బలంగా అనుమానించాలి. అనుమాన నివృత్తికి అల్ట్రాసౌండ్‌తో పరిశీలిస్తారు. చివరగా బయాప్సీ చేస్తేకానీ క్యాన్సర్‌ని నిర్ధారించలేం. ప్రోస్టేట్‌, ఇంకా చుట్టుపక్కల ముక్కల్ని తీసి బయాప్సీ పరీక్షకు పంపుతారు. బయాప్సీలో క్యాన్సర్‌ నిర్ధారణ కావడంతోపాటు ఏ దశలో ఉన్నదీ, ఏయే చోట్లకు విస్తరించింది కూడా తెలుస్తుంది. తర్వాతే చికిత్స మొదలవుతుంది.
**చికిత్సల రకాలు
ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ని గుర్తించే సరికే 50 శాతం కేసుల్లో తొలి రెండు దశలు దాటిపోతున్నాయి. క్యాన్సర్‌ కణాలు ప్రోస్టేట్‌ లోపల ప్రారంభదశలో ఉంటే మొదటిదశగా చెబుతారు. దీనికి రెండు విధానాల్లో చికిత్స చేస్తారు. మొదటిది శస్త్రచికిత్స. దీన్ని రోబోటిక్‌ విధానంలో చేస్తారు. దీన్లో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. కోలుకోవడం కూడా త్వరగా జరుగుతుంది. సర్జరీ వద్దనుకుంటే రేడియేషన్‌ ద్వారా చికిత్స అందిస్తారు. రెండో దశలో క్యాన్సర్‌ ప్రోస్టేట్‌లో బాగా ముదిరి ఉంటుంది. ఈ దశలోనూ శస్త్రచికిత్స లేదా రేడియేషన్‌ ద్వారా చికిత్స చేయొచ్చు. రెంటితోనూ ఫలితం ఒకేలా ఉంటుంది. ఇది వరకు రేడియేషన్‌ చికిత్సకు 7-8 వారాలు పట్టేది. ప్రస్తుతం హైపో ఫ్రాక్షనేషన్‌ ట్రీట్‌మెంట్‌తో కేవలం 1-3 వారాల్లోనే చికిత్స పూర్తవుతుంది. ఈ సమయంలో రోగి సాధారణ జీవితాన్ని గడపొచ్చు. మూడో దశలో క్యాన్సర్‌ కణాలు ప్రోస్టేట్‌ బయటకు వచ్చి ఇతర భాగాలకూ వ్యాపిస్తాయి. ఈ దశలో రేడియేషన్‌తోపాటు హార్మోన్ల చికిత్స ఉంటుంది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కణాలకు మన శరీరంలో సహజంగా తయారయ్యే హార్మోన్లే ప్రేరకాల వంటివి. కాబట్టి హార్మోన్లని అడ్డుకోవడం ముఖ్యం. పురుష హార్మోన్లను 95 శాతం వృషణాలూ, మిగిలిన అయిదు శాతాన్ని మూత్రపిండాలమీద ఉండే అడ్రినల్‌ గ్రంథులూ ఉత్పత్తి చేస్తాయి. వీటి ఉత్పత్తిని అడ్డుకోవడంద్వారా క్యాన్సర్‌ను నిలువరించవచ్చు. హార్మోన్ల చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. మొదటి విధానంలో శస్త్రచికిత్సచేసి వృషణాల్ని తొలగించడం, రెండో విధానంలో ఇంజెక్షన్లు ఇచ్చి టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తిని నిలుపుదల చేయడం. నాలుగో దశలో క్యాన్సర్‌ ప్రోస్టేట్‌ని దాటి లింఫ్‌ గ్రంథులకూ, ఎముకలకూ బలంగా విస్తరిస్తుంది. ఈ దశలో హార్మోన్ల చికిత్స లేదంటే కీమోథెరపీ చేస్తారు. రోగి ఆరోగ్య పరిస్థితి బావుంటే కీమోథెరపీతో ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. రోగి జీవితకాలం 2-10 ఏళ్లు పెరుగుతుంది. ఇది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్సలో వచ్చిన కొత్త అభివృద్ధి అని చెప్పాలి. మిగతా వాటితో పోల్చితే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అంత భయానకమైంది కాదు. దీని చికిత్స కూడా సులభంగా ఉంటుంది. అయితే ఏ క్యాన్సర్‌కైనా నివారణ ముఖ్యం. మద్యం, పొగ తాగే అలవాట్లుంటే మానేయాలి. కొవ్వు ఎక్కువగా ఉండే మాంసానికి బదులు గుడ్లు, చేపలు తీసుకోవడం మేలు. పొద్దు తిరుగుడు నూనెని ఆహారంలో తగు మోతాదులో తీసుకుంటే ప్రోస్టేట్‌ను కొంతవరకూ నివారించవచ్చు. కాఫీ తాగేవాళ్లతో పోల్చితే టీ తాగేవాళ్లలో ప్రొస్టేట్‌ రావడం తక్కువని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com