ఏపీలో శ్రీనివాస కళ్యాణాలకు సన్నాహాలు

ఫిబ్రవరి 8 నుంచి 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాలోని 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
**పశ్చిమ గోదావరి జిల్లా..
* ఫిబ్రవరి 8వ తేదీన కుక్కునూరు మండలం బనగాల గూడెం గ్రామంలో గల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయ పరిసరాల్లో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.
* ఫిబ్రవరి 9న బుట్టయ్యగూడెం మండలం గుర్రప్ప గూడెం గ్రామంలో గల శ్రీకోదండరామలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
* ఫిబ్రవరి 10న జంగారెడ్డిగూడెం మండలం పెద్దకప్పగూడెం గ్రామంలో గల శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకుసాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
* ఫిబ్రవరి 11న టి.నరసాపురం మండలం రుద్రరాజుకోట గూడెం గ్రామంలో గల శ్రీకోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
* ఫిబ్రవరి 12న కామవరపుకోట మండలం శ్రీ కోదండరామ నగర్‌ గ్రామంలో శ్రీకోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
***తూర్పు గోదావరి జిల్లా..
* ఫిబ్రవరి 15న రాజవోమంగి మండలం రేవటిపాళ్యం గ్రామంలోని శ్రీ గంగాలమ్మతల్లి ఆలయ పరిసరాల్లో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
* ఫిబ్రవరి 16న అడ్డతీగల మండలం వేటమమ్మిడి గ్రామంలోని శ్రీ రేణుక యలమ్మతల్లి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
* ఫిబ్రవరి 17న దేవిపట్నం మండలం రాయవరం గ్రామంలోని శ్రీ రామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం జరుగనుంది.
* ఫిబ్రవరి 18న కూన‌వ‌రం మండలం టెక్కలబోరు గ్రామంలోని శ్రీ అయప్పస్వామివారి ఆలమంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.
* ఫిబ్రవరి 19న యాటపాక మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
***నెల్లూరుజిల్లా..
* ఫిబ్రవరి 20న కొడవలూరు మండలం కమ్మపాళ్యం గ్రామంలోని శ్రీ మహాలక్షి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
*శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తితిదే రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
1. హంపిలో స్తంభాలను పడగొట్టిన పోకిరీలు
కొందరు ఆకతాయిలు హంపీ శిథిలాల్లో తిరుగుతూ రెచ్చిపోయారు. పాతకాలపు స్తంభాలను పడదోశారు. తామేదో ఘనకార్యం చేస్తున్నట్టు ఆ చిల్లరపనిని వీడియో తీసుకున్నారు. ఏతావాతా ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. నెటిజనులు దానిపై మండిపడ్డారు. యునెస్కో వారసత్వ సంపదగా భావించే హంపిలో ఇలాంటి ఘోరాలు చోటుచేసుకోవడమా? అని ఆగ్రహావేశాలు వక్తమవుతున్నాయి. వ్యవహారం ధర్నాల దాకా పోయింది. దీంతో ప్రభుత్వం మేల్కొంది. నిజానికి ఆ వీడియో ఇప్పటిది కాదు. ఓ ఏడాది క్రితం నాటిది. ఏమైతేనేం.. ఆ వీడియో కదలిక తెచ్చింది. ప్రజల ఆగ్రహం ఫలితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి వచ్చింది. హడావుడిగా కన్నడ సర్కారు హంపి శిథిలాల భద్రతను సమీక్షించింది. హంపి శిథిలాల పరిరక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఆర్కెలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక నిర్వహణను మాత్రమే చూసుకుంటుంది. 14వ శతాబ్దానికి చెందిన హంపి శిథిలాలు 4100 హెక్టార్లలో పరచుకుని ఉన్నాయి. సుమారు 1600 నిర్మాణాలు అందులో ఉన్నాయి. అంతంత మాత్రంగా ఉన్న సిబ్బందితో శిథిలాల రక్షణ తగిన రీతిలో నిర్వహించలేమని కర్నాటక టూరిజం విభాగం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం శిథిలాల పరిరక్షణకు హంపీ ప్రపంచ వారసత్వ ప్రాంత నిర్వహణా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ వల్ల సంపూర్ణ పరిరక్షణ సాధ్యం కాదని ఆకతాయిల వీడియోతో తేలిపోయింది. అలాగని శిథిలాల చుట్టూ ఇనుపకంచె ఏర్పాటు చేయాడం కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే స్థానికులు పొలాలకు వెళ్లిరావడం, చిన్న వ్యాపారుల కదలికకు దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. అంతటా సెక్యూరిటీ గార్డులను పెట్టడం కూడా సాధ్యం కాదు కనుక కనీసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. హంపిలోని సుప్రసిద్ధ విష్ణు ఆలయం వద్ద మాత్రం ఇద్దరు కానిస్టేబుళ్లను, ఇదందరు రోజుకూలీలను భద్రతకు నియమించారు.
2. పోలీసుల అదుపులో కిరీటాల దొంగ..!
తిరుపతినగరంలోని గోవిందరాజస్వామి ఆలయంలో మూడు ఉత్సవ విగ్రహాలపై ఉన్న కిరీటాలను చోరీ చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈ చోరీకి పాల్పడింది పాత నేరస్థుడు మత్తయ్యగా వారికి సమాచారం అందింది. అతను గతంలోనూ తిరుపతిలోని ప్రధాన ఆలయాలతో పాటు, చిన్నచిన్న దేవాలయాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. తమిళనాడుకు వెళ్లిన ప్రత్యేక బృందం అదుపులో నిందితుడు ఉన్నాడని తెలిసింది.
3. ‘ఇది అంటరానితనం కిందికి రాదు’-శబరిమల వివాదంపై సుప్రీంలో పిటిషనర్ల వాదనలు
శబరిమల అయ్యప్ప ఆలయ కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం నుంచి సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట పలువురు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. సీజేఐ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఆర్‌ఎఫ్ నారిమన్‌, ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌, ఇందు మల్హోత్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.ఆలయ సంప్రదాయాల ప్రకారం మహిళలకు శబరిమల ప్రవేశం కల్పించడం లేదని, ఇది అంటరానితనం కిందికి రాదని నాయర్ సర్వీస్‌ సొసైటీ తరఫున వాదనలు వినిపిస్తోన్న కె. పరాశరణ్‌ ధర్మాసనానికి వెల్లడించారు. ట్రావెన్‌ కోర్‌ దేవసం బోర్డ్ మాజీ ఛైర్మన్‌ తరఫున వాదనలు వినిపిస్తోన్న సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ‘హిందూమతంలో ఒక్కో దేవుడికి ఒక్కో పూజా విధానం, సంప్రదాయాలు ఉంటాయి. అలాగే శబరిమల అయ్యప్ప స్వామికి కొన్ని సంప్రదాయాలున్నాయి. ఆర్టికల్ 17 ఇక్కడ ఏమాత్రం వర్తించదు. మత విశ్వాసాన్ని సైన్స్ మ్యూజియంగా చూడలేం. మతవిశ్వాసాలకు సంబంధించిన విషయాల్లో రాజ్యంగా నిబంధనలను గుడ్డిగా అమలు చేయలేం’ అని పేర్కొన్నారు. ‘శతాబ్దాలుగా ఆలయ సంప్రదాయాలు మార్చాలా వద్దా అనే విషయాన్ని సంబంధిత వర్గం నిర్ణయిస్తుంది. కొందరు ఉద్యమకారులు దాన్ని నిర్ణయించలేరు. కొన్ని ఆచారాలను రూపు మాపడానికి ఇంతవరకు ఎటువంటి చట్టపరమైన శిక్షలు లేని పక్షంలో కోర్టు ఈ అంశంలో తలదూర్చకూడదు’ అని సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నేఫడే ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు.అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ 64 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో కొన్ని రివ్యూ పిటిషన్లు ఉన్నాయి. ఈ రోజు సుప్రీం వాటిని విచారిస్తోంది.
4. హజ్‌ యాత్రికులకు రాయితీ రద్దు-పాకిస్థాన్‌ ఖజానాకు రూ.450 కోట్లు మిగులు
హజ్‌ యాత్రికులకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీని రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్‌ మతవ్యవహారాల మంత్రి నూరుల్‌హక్‌ ఖాద్రి తెలిపారు. తద్వారా ఖజానాకు రూ.450కోట్లు మిగులుతాయన్నారు. రాయితీ రద్దును తమ మంత్రిత్వశాఖ వ్యతిరేకించినప్పటికీ, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వాన ఇటీవల సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రద్దుకే మొగ్గు చూపిందన్నారు. ‘‘గత పీఎంఎల్‌-ఎన్‌ ప్రభుత్వం ప్రతి హజ్‌ యాత్రికుడికి రూ.42,000 రాయితీ ఇస్తుండటం వల్ల ఖజానాపై రూ.450కోట్లు భారం పడుతోంది’’ అని ఖాద్రి పేర్కొన్నారు.
5. నాగోబా జాతర.. రేపు ప్రభుత్వ సెలవు
నాగోబా జాతర, దర్బార్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు రేపు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సెలవు ప్రకటనతో మార్చి 9న పనిదినంగా పరిగణించాలని కలెక్టర్ ఆదేశించారు. మెస్రం వంశీయులు సోమవారం రాత్రి నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర మంగళవారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మహాపూజల అనంతరం ఆచారం ప్రకారం కొత్తకోడళ్లకు నాగోబా సన్నిధిలో(బేటింగ్) పరిచయవేదిక నిర్వహించారు. అనంతరం వారికి నాగోబాను దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. ఆలయ సమీపంలోని గోవాడ్‌లో మెస్రం వంశీయుల మహిళల ఆధ్వర్యంలో నైవేద్యాలు తయారు చేసి దీపాలు వెలిగించి సంప్రదాయ పూజలు చేశారు. నాగోబాను మంగళవారం ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తూతోపాటు నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా క్రిస్టినా జడ్ చోంగ్తూ మాట్లాడుతూ.. తెలంగాణలో కెస్లాపూర్ నాగోబా జాత ర రెండో అతిపెద్ద జాతరగా గుర్తించారన్నారు. నాగోబా జాతరను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామన్నారు. లండన్‌కు చెందిన మైకేల్ యోర్క్ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఈ సందర్భంగా క్రిస్టినా ప్రారంభించారు.
6. పచ్చల సోమేశ్వరాలయం
కందూరు చోడుల ఆలయాల్లో ఛాయా సోమేశ్వరాలయం ఆనాటి రాజుల కళాతృష్ణకు, శిల్పుల అపార మేథాసంపత్తికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. దీనికి కొద్దిదూరంలోనే వారే నిర్మించిన పచ్చల సోమేశ్వరాలయమూ వారి అద్భుత నిర్మాణ శైలికి, ప్రజ్ఞాపాటవాలకు కూడా నిలువుటద్దంలా నేటికీ కనబడుతున్నది. ఈ ఆలయ నల్లరాతి శిలలు ఆనాటి శిల్పుల చేతుల్లో మైనపు ముద్దల్లాగా ఒదిగి అపురూప శిల్పాలుగా అవతరించిన తీరు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.నల్లగొండ జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పానగల్‌లో కందూరు చోడులు నిర్మించిన పచ్చల సోమేశ్వరాలయం ఉంది. శ్రీ ఛాయా సోమేశ్వరాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పానగల్లు ఊరు మధ్యలో వెలిసిన దివ్యాలయం ఇది. ఈ ఆలయం నాలుగు దిక్కులకు అభిముఖంగా రాతి కట్టడాలతో కూడిన నాలుగు దేవాలయాల క్షేత్రంగా వెలుగొందుతున్నది. నల్లశానపు రాళ్లపై రమ్యంగా మలచిన శిల్పాలు, ఆలయాలు మధ్యయుగ వాస్తు సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి. ఆలయం బయటి గోడలపైన వినాయకస్వామి, కుమారస్వామి, మహిషాసురమర్దిని, దిక్పాలక, రతి మన్మథ, శివ, నటరాజ, ఉమామహేశ్వర శిల్పాలు ఆనాటి శిల్పుల పనితనాన్ని గొప్పగా తెలియజేస్తున్నాయి. అధిష్టానం, పాదవర్గం, ప్రస్తారం, విమానం, సుఖనాసులతో అలరారుతున్న ఈ ఆలయాలు క్రీ.శ. 11-12 శతాబ్దాలకు చెందినవి.
70 స్తంభాలతో మహామండపం మూడు రంగమండపాలను కలుపుతూ ఉంటుంది. తూర్పు ముఖంగా మూడు ఆలయాలు, పడమర ముఖంగా ఒక ఆలయం ఈ మహాముఖ మండపంతో అనుసంధానమై ఉన్నాయి. ఈ ఆలయ ముఖ మండప స్తంభాలపై ఎన్నో పురాణగాథలను తెలిపే అపురూప శిల్పాలు ఉన్నాయి. అందుకే వీటిని ప్రదర్శన మండపాలు అని అంటారు.ఆలయ స్తంభాలు, గోడలపై శైవ రీతులు, గజాశుర సంహారం, నరసింహ రూపకం, రావణాసురుడు కైలాసాన్ని కదిలించడం, దేవ నర్తకీమణుల నాగినీ నృత్య రూపాలు, రామాయణ మహాభారత భాగవత గాథలతో కూడిన ఘట్టాలను అద్భుతంగా చెక్కారు. స్తంభాలపైన, పైకప్పులపైన చెక్కిన అష్టదిక్పాలక శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.పచ్చల సోమేశ్వర స్వామి వారి ముందున్న రంగ మండపంలోని నాలుగు స్తంభాల మీద వరుసగా భారత, భాగవత, రామాయణ, శివపురాణ గాథల్ని చెక్కిన తీరు చూస్తే వర్ణించడానికి అక్షరాలు చాలవు. ఈ మండంలో స్వామి వారికి ఎదురుగా సుందర నందీశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఆంత్రాలయ ప్రవేశం వద్ద మరొక చిన్న నందీశ్వరుడు కాపలా కాస్తూ దర్శనమిస్తాడు. గర్భగుడిలో శ్రీ పచ్చల సోమేశ్వరుడు దివ్యకాంతితో విరాజిల్లుతూ, భక్తులతో నీరాజనాలం దుకుంటున్నాడు. ఈ ఆలయ శివలింగానికి అమర్చిన పచ్చల వెలుగు గర్భగుడి అంతటా ఒకప్పుడు కన్పించేదట. ఈ కారణంగానే ఈ ఆలయానికి పచ్చల సోమేశ్వరాలయం అనే పేరు వచ్చిందని అంటారు. మహ్మదీయుల దండయాత్రలో పచ్చల సోమేశ్వరాలయం లింగం పచ్చలను దొంగిలించినట్లు కథనం.స్వామి వారికి ఎదురుగా ఉన్న ఉపాలయంలో సంకట గణపతి దర్శనమిస్తాడు. ఈయనను చూస్తే ఏదో చరిత్రకందని విశేషాన్ని దాచుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, శివునికి అభిముఖంగా గణపతిని ప్రతిష్ఠించడం కొంచెం అరుదైన విషయమేనని చరిత్రకారులు చెబుతారు. అది కూడా విగ్రహం, పీఠం కలిపి ఏక కవచంతో కప్పి ఉంచడం కూడా ఈ ఆలయం ప్రత్యేకతగా చెబుతారు. ఈ ఆలయానికి రెండు వైపులా దగ్గర దగ్గరగా రెండు స్తంభాలు, ఈ రెండింటికి మధ్యలో 12 అడుగుల దూరంలో గణపతి ఎదురుగా మరో స్తంభం నిలపెట్టి ఉన్నాయి. అంటే శివుని వద్ద నుంచి చూస్తే గణపతి సూటిగా కనబడడు.ఈ ప్రాంగణంలో శ్రీ స్వామి వారికి కుడివైపున ఉన్న మరొక ఉపాలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ రెండు ఆలయాల మధ్యలో మరొక ఉపాలయం అర్ధాంతరంగా నిర్మాణం నిలిచిపోయి మనకు కన్పిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం చెక్కిన శిలలు, శిల్పాలన్నీ ఆలయం వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో వెయ్యి సంవత్సరాలుగా పడి ఉన్నట్లు స్థానికులు చెబుతారు. ఆలయ ఆవరణ నిండా శిథిలాలు, శిల్పాలు కుప్పలు తెప్పలుగా కన్పిస్తూ, ఆనాటి విధ్వంసానికి చెరగని సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.పచ్చల సోమేశ్వర ఆలయం పక్కనే చెన్నకేశవాలయం కూడా అద్భుత శిల్పకళతో నిర్మితమైంది. దీని ఎదురుగా రాతిపై చెక్కిన తామర పుష్పాల పద్మపీఠం చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.ఈ ఆలయ ప్రాంగణంలోనే పురావస్తు ప్రదర్శన శాల ఉంది. 1994లో పురావస్తు శాఖ వారు ఆలయం వెనుక భాగంలో మ్యూజియంను నెలకొల్పారు. దేవరకొండ, భువనగిరి, ఏలేశ్వరం, పిల్లలమర్రి మొదలైన ప్రాంతాల నుంచి సేకరించిన అనేక చారిత్రక వస్తువులను ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆదిమ మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, వంటపాత్రలు, లిపి, దేవతా విగ్రహాలు, పలు నాణేలు మొదలైనవి ఇక్కడ దర్శనమిస్తాయి. ఇవన్నీ 1వ శతాబ్ది నుంచి 18వ శతాబ్దం మధ్య వాడినవిగా చెప్తారు. ఈ మ్యూజియం సందర్శన వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు. సోమవారం సెలవు.
7. శుభమస్తు
తేది : 6, ఫిబ్రవరి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
ాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 16 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 7 గం॥ 52 ని॥ వరకు)
నక్షత్రం : ధనిష్ట
(నిన్న ఉదయం 6 గం॥ 2 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
యోగము : వరియానము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 1 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 51 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 28 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 36 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 13 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : కుంభము
8. తిరుమల సమాచారం
ఈరోజు బుధవారం.. *06-02-2019* ఉదయం *5* గంటల సమయానికి.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…. శ్రీ వారి దర్శనానికి *1* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు…. శ్రీ వారి సర్వ దర్శనానికి *2* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *02* గంటల సమయం పడుతోంది.. నిన్న ఫిబ్రవరి *5* న *58,203* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹:2.43* కోట్లు.
9. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో వేంచేసియున్న ఆర్యవైశ్యల ఆరాధ్యదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పోటెత్తిన భక్తజన సందోహం.వాసవి మాత ఆత్మార్పణ దీనోత్సవం
సందర్భంగా కేరళ, చెన్నై, కర్ణాటక, కోయంబత్తూర్, వివిధ రాష్ట్రాలు, జిల్లా నుండి విచ్చేసిన మాలధారణల తో విచ్చేసిన భక్తులు.వాసవి మాత ఆలయ ప్రాంగణం లో 102 హోమాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు. 102 మంది కన్యకా భక్తులు చే కలశాలతో పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు. భక్తుల చే పుర వీధుల్లో పండగ వాతావరణం.
10. పెనుకొండ ఉత్సవాలు ఫిబ్రవరి 14, 15 తేదీలను మార్పు: ఇంచార్జి కలెక్టర్
ఈ నెల 10,11 తేదీలలో నిర్వహించనున్న పెనుకొండ ఉత్సవాలను ఈ నెల14, 15 తేదీలలో నిర్వహించనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ ఎస్.డిల్లీ రావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయా కమిటీల కన్వీనర్లు ఇదివరకే నిర్ణయించిన విధంగా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను చేయాల్సిందిగా ఆదేశించారు..
11. ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు నూతన ఆర్జిత సేవ ఈ రోజు శ్రీయుత కలెక్టర్, శ్రీ బి.లక్ష్మీకాంతం గారి దంపతులు, నగర పోలీసు కమీషనర్ శ్రీ ద్వారక తిరుమలరావు గారు, విజయవాడ మున్సిపల్ కమీషనర్ గారి సతీమణి పాపిత వారు మరియు భక్తులు పూజలో పాల్గొనగా,
ముందుగా కార్యనిర్వహణాధికారి, ఆలయ చైర్మెన్ గారు ఉదయం 9 గంటల నుండి 9-30 వరకు శ్రీ వినాయక స్వామి పూజలో పాల్గొన్నారు.దయం 9-00 గఁటల నుండి 12-30 వరకు విగ్రహముల పంచలోహ శోదన నిమిత్తం యాగం నిర్వహించి నారు. రాహువు కి దుర్గా దేవి అధిష్టాన దేవత అయినందువలన పూజ చేసుకొను భక్తులు అభీష్టములు నెరవేరును మరియు దోషా నివారణ జరుగును. రుసుము రూ.1,116/- ఇరువురికి పూజ అనుమతి, ఇరువురికి ముఖ మండపం ద్వారా దర్శనమునకు అనుమతి రానూన్న ౩ రోజులలో పూజ ట్రయిల్ రన్ ప్రయోగత్మకముగా ఉండును. (ప్రతి రోజు రాహు కాలములో జరుగును) పూజ వేదిక శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయము ప్రక్కన గల ఖాళీ స్ధలము నందు జరుగును. ఈ రోజు ప్రత్యేక పూజ కార్యక్రమమునకు శ్రీయుత జిల్లా కలెక్టర్ శ్రీ లక్శ్మీ కాంతం గారి దంపతులు, నగర పోలీసు కమీషనర్ శ్రీ ద్వారక తిరుమల రావు గారు, విజయవాడ మున్సిపల్ కమీషనర్ గారి సతీమణి పాపిత పాటుగా ఆలయ కార్యనిర్వహణాదికారి శ్రీమతి వి.కోటేశ్వరమ్మ గారు ఆలయ చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ధర్మరావు, శ్రీమతి వల్లి పాప, శ్రీ పద్మశేఖర్, శ్రీమతి సాంబసుశీల, ప్రదాన అర్చక దుర్గా ప్రసాదు దఁపతులు పూజ కార్యక్రమములో పాల్గొనగా, సుమారు 15 మఁది అర్చక సిబ్బఁది, స్ధాన చార్య వి.శివప్రసాద్ మరియు వైదిక కమీటి వారి ఆధర్వంలో పూజా కార్యక్రమము ఘనంగా జరిగినది.
12. ఒంటిమిట్ట బ్రహ్మూత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం బ్రహ్మూెత్సవాలలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ ఆలయ పరిసరాలు, ఉద్యానవన పనులు, పుష్కరిణి, కల్యాణవేదిక ప్రాంతాలను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి బుధవారం ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించామన్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.60.40 కోట్లతో శాశ్వత కల్యాణవేదిక, మరుగుదొడ్లు తదితర పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను గత జనవరి 2వ తేది పరిశీలించానన్నారు. అందులో భాగంగా గత నెల తనిఖీలకు, ఈరోజు పరిశీలనలో చాలా పురోగతి ఉందన్నారు. మరోసారి మార్చి 7వ తేది వచ్చి అభివృద్ధి పనులను పరిశీలిస్తానన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ సిబ్బందిని తెప్పించుకోవాలన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మూెత్సవాలకు ఏప్రిల్‌ 12న అంకురార్పణ జరుగనుందని, ఏప్రిల్‌ 18న శ్రీరాములవారి కల్యాణం, ఏప్రిల్‌ 22వ తేది పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా బ్రహ్మూెత్సవాలలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు అవసరమైన తాత్కలిక ఏర్పాట్లను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, వేచి ఉండే గదులు, కార్యాలయ భవనం, విశ్రాంతిగృహం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీ కోదండరామప్వామివారి ఆలయం, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ పి. కోటేశ్వర రావు, రాజంపేట ఆర్డీవో శ్రీ కోదండరామి రెడ్డిల, ఇతర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, డిప్యూటీ ఈవో శ్రీ నటేష్‌ బాబు, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీ రవిశంకర్‌ రెడ్డి, శ్రీ చంద్రశేఖర్‌, ఏఈవో శ్రీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com