లింగ వివక్షకు అంతం

శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నిర్వహించే ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) తన వైఖరిని మార్చుకుంది. ఆలయానికి అన్ని వయసుల మహిళల్నీ అనుమతించవచ్చని బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో గత తీర్పును సమర్థించింది. తాజా వైఖరి వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. శబరిమల పుణ్యక్షేత్రంలోకి అన్ని వయసుల మహిళలూ ప్రవేశించేందుకు అనుమతించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం 2018, సెప్టెంబర్‌ 28న తీర్పు ఇచ్చింది. దీన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన 65 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రివ్యూ పిటిషన్లు దాఖలుచేసిన పక్షాల వాదనలు వింటామని, తీర్పును పునఃసమీక్షించాలన్న అంశానికే వాదనలు పరిమితం కావాలని ధర్మాసనం న్యాయవాదులకు స్పష్టం చేసింది. బుధవారం మూడున్నర గంటలసేపు వాదనలు సాగిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూమల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సుప్రీం తీర్పును సమర్థిస్తూ, శబరిమలకు అందరినీ అనుమతించాలని టీడీబీ పేర్కొనడంతో ధర్మాసనం కూడా ఆశ్చర్యపోయింది. ఇంతకుముందు మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా వాదించారని టీడీబీ తరఫు న్యాయవాది రాకేశ్‌ ద్వివేదిని జస్టిస్‌ ఇందూమల్హోత్రా అడగ్గా… తీర్పును గౌరవించాలని బోర్డు నిర్ణయించినట్లు బదులిచ్చారు. శరీర సంబంధ లక్షణాలతో ప్రత్యేకించి ఒక వర్గంపై వివక్షకు అంతం పలికేందుకు ఇదే సరైన సమయమన్నారు. తీర్పు మార్చాల్సిన అవసరం లేదని, రివ్యూ పిటిషన్లన్నింటినీ కొట్టివేయాలని కేరళ ప్రభుత్వం కోరింది. నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌), శబరిమల దేవస్థానం తంత్రితోపాటు పలు సంస్థలు తీర్పును పునఃపరిశీలించాలంటూ వాదనలు వినిపించాయి. ఆర్టికల్‌ 15 ప్రకారం దేశంలోని లౌకిక సంస్థల్లోకి ప్రజలందరికీ ప్రవేశం ఉంటుందని, మతపరమైన సంస్థల్లోకి కాదని మాజీ అటార్నీ జనరల్‌ కె.పరాశరన్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ తరఫున వాదించారు. దైవారాధన హక్కులో దేవుని విగ్రహానికి ప్రత్యేకత కూడా ఉంటుందని, ఇది అక్కడి అనివార్యమైన మతాచారంలో భాగంగా ఏర్పడుతుందని ఆలయ తంత్రి తరఫు న్యాయవాది వి.గిరి పేర్కొన్నారు. మతాన్ని నిర్దిష్ట పద్ధతిలోనే ఆచరించాలని ఏ వర్గాన్నీ న్యాయస్థానం ఆదేశించజాలదని సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నఫాడే పేర్కొన్నారు. మరో పిటిషనర్‌ తరఫున తెలుగు న్యాయవాది సాయిదీపక్‌ వాదనలు వినిపించారు. కాగా, ఫిబ్రవరి 12 నుంచి తెరిచే ఆలయానికి మళ్లీ వెళ్లి తీరతామని గతంలో శబరిమల ఆలయానికి వెళ్లి సంచలనం సృష్టించిన కేరళ మహిళలు బిందు, కనకదుర్గ సుప్రీంకోర్టుకు తెలిపారు. టీడీబీ వైఖరి మారడం వెనక ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ ఒత్తిడి ఉందని హిందూ సంస్థల ఉద్యమకారులు ఆరోపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com