వారానికి ఒక రోజు ద్రవపదార్థాలు తీసుకోవాలి

ఇంట్లో పేరుకొనే చెత్తను ఎప్పటికప్పుడు తీసేస్తాం. మరి మన శరీరంలో పేరుకొనే మలినాలు. వాటినీ తొలగించాలి లేదంటే అనారోగ్యాలు దాడిచేస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించడమే కాదు… అవి పేరుకోకుండా కూడా జాగ్రత్తపడాలి. అందుకు ఆయుర్వేద పరంగా ఏం చేయాలో చూద్దామా… శరీరంలో అనేక రసాయన చర్యలు జరుగుతాయి. వాటిలో భాగంగానే కొన్ని మలినాలు శరీరం నుంచి విడుదలవుతూ ఉంటాయి. ఆహారం జీర్ణమయ్యాక, శ్వాస తీసుకునేటప్పుడు, కండరాల కదలిక… ఇలా ప్రతీ చర్యలోనూ మలినాలు విడుదలవుతూనే ఉంటాయి. ఇవి మలం, మూత్రం, నిశ్వాస, చెమట రూపంలో బయటికి వెళ్లిపోయేలా మన శరీరంలో ఏర్పాట్లున్నాయి. ఇవన్నీ సక్రమంగా జరిగి, శరీరంలో మలినాలు పేరుకోకుండా ఉంటేనే అనారోగ్యాలు దరిచేరవు. శరీరంలో పేరుకునే రోగకారకాలను టాక్సిన్లు (ఆమం) అంటారు. ఇవి శరీరంలో పేరు కోకుండా ఉండటానికి, అలాగే పేరుకున్న వాటిని బయటికి పంపడానికి పలు పద్ధతులను ఉపయోగించవచ్చు. వాటినే ‘లంఘన చికిత్సలు’ అంటారు. వీటిలో కొన్నింటిని వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. అలాగే మరికొన్ని తేలిక పద్ధతులను మనమే సొంతంగా చేసుకోవచ్చు. ‘ఉపవాసం’, ‘పాచనం’ అనే రెండు పద్ధతుల ద్వారా శరీరంలోని మలినాలను బయటికి పంపించొచ్చు. ఈ పద్ధతుల్లో భాగంగా మనం తీసుకునే ఆహారాన్నే ‘డిటాక్స్‌ డైట్స్‌’ అంటారు. నిమ్మరసం, మజ్జిగ: వారంలో ఒక రోజు ఆహారంలో భాగంగా ఘనపదార్థాలను మానేసి, కేవలం ద్రవపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఇలా చేస్తే, శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఇందుకు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు తాగాలి. అలాగే పండ్లు మాత్రమే తినడం వల్ల కూడా శరీరంలో మలినాలు వెలుపలికి పోతాయి. ఉపవాసం చేయలేని వారు వారానికి ఒక రోజు కేవలం జావ తీసుకున్నా కూడా శరీరంలో పేరుకున్న వ్యాధి కారకాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం అర కప్పు బియ్యం, కప్పు పెసరపప్పును విడివిడిగా వేయించి, రెండింటినీ కలిపి కొంచెం బరకగా రవ్వలా మిక్సీ పట్టి భద్రపరుచుకోవాలి. కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీరు తీసుకోవాలి. ముందుగా నీళ్లను పొయ్యిమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు రవ్వ వేయాలి. అది ఉడికి, జావలా తయారయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన తాలింపు, చెంచా నెయ్యి వేసుకుని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు ఈ జావని తీసుకుంటే చాలు. ఇలా వారానికి ఒకసారైనా ఘనపదార్థాలు తగ్గించడం మంచిది.

*** జీర్ణశక్తిని పెంచుకుంటే…
ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియనే ‘పాచనం’ అంటారు. మనం తీసుకునే ఆహారం సంపూర్ణంగా జీర్ణమైతే శరీరంలో వ్యాధికారకాలు పేరుకోవు. అందుకే తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే ఎంచుకోవాలి. అలాగే పొట్ట నిండేవరకు తినకూడదు. ఒకసారి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేవరకు మళ్లీ ఏదీ తినకూడదు. రాత్రిపూట ఎనిమిది గంటల్లోపే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ నియమాలను పాటిస్తే మలినాలు పేరుకొనే సమస్య ఉండదు.
కొన్ని పదార్థాలు జీర్ణశక్తిని పెంచుతూనే, మలినాలను కూడా తగ్గిస్తాయి. అదెలాగంటే…
*ఆహారం తినే ముందు అరచెంచా అల్లం ముక్కలు, చిటికెడు సైంథవ లవణం కలిపి తినాలి. తేలిగ్గా జీర్ణమవుతుంది.
* శొంఠిని నేతిలో వేయించి పొడి చేసి భద్రపరుచుకోవాలి. అన్నంలో మొదటి ముద్దను శొంఠి, నెయ్యి కలిపి తీసుకోవాలి.
* లీటరు నీళ్లను కాచి, వేడిగా ఉన్నప్పుడే ఫ్లాస్కులో పోయాలి. అందులో కొద్దిగా అల్లం ముక్కలు, పావు చెంచా చొప్పున జీలకర్ర, సోంపు, కొద్దిగా మిరియాల పొడి, ఎనిమిది పుదీనా ఆకులు వేసి మూత పెట్టేయాలి. రోజు మొత్తంలో ఈ నీటిని కొద్దికొద్దిగా తాగుతుంటే మలినాలు తొలగిపోతాయి. ఇటువంటి తేలికపాటి చిట్కాలు పాటిస్తే, వ్యాధులబారిన పడకుండా ఉండొచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com