* ఈజిప్టులోని సూయిజ్ కాలువలో చిక్కుకుపోయిన భారీ కంటైనర్ నౌక ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది. నౌక ప్రయాణంలో ఏర్పడ్డ అవాంతరాలను అధికారులు పరిష్కరించడంతో ఈ రాకాసి ఓడ ప్రయాణం మొదలైంది. దీంతో ఇప్పటికే భారీగా జామ్ అయిన ఇతర నౌకలకు మార్గం సుగమమైనట్లు సూయిజ్ కాలువ నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 20వేల కంటైనర్లతో వెళ్తున్న ఎవర్ గివెన్ నౌక.. గత మంగళవారం సూయిజ్ కాలువలో అడ్డంగా తిరిగి చిక్కుకున్న విషయం తెలిసిందే.
* సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆ రంగంలోని కంపెనీలకు 2030 వరకు పన్ను విరామం ప్రకటించింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో అప్రమత్తమైన డ్రాగన్ నష్టనివారణ చర్యలను ప్రారంభించింది. ఈ ఏడాది ఆర్థిక లక్ష్యాల్లో సెమీకండక్టర్లలో స్వయంసమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా కావాల్సిన చర్యలను వేగవంతం చేయాలని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.
* మనం చేసే ఖర్చులకు సంబంధించి బడ్జెట్ వేసుకుంటే ఎంత ఖర్చవుతుంది… ఎంత పొదుపు చేస్తున్నాం… తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ప్రతీ నెలా ఇంటి ఖర్చులు ఎంత? పదవీవిరమణ నిధికి ఎంత వెనకేస్తున్నాం, అత్యవసరనిధి కోసం ఎంత పొదుపు చేస్తున్నాం అనేది లెక్క వేసుకోవాలి. 50/30/20 కుటుంబ బడ్జెట్ నియమం. ఈ నియమం ప్రకారం పన్ను చెల్లించాక మిగిలే ఆదాయాన్ని నికర ఆదాయంగా పరిగణించి ఆ మొత్తన్ని మూడు భాగాలుగా విభజించి ప్రణాళిక వేసుకోవాలి. 50 శాతం అవసరాలకు – ఈ నియమం ప్రకారం 50 శాతం మన అవసరాలకు వినియోగించుకోవాలి. అవసరాలంటే మన జీవించేందుకు అవసరమయ్యే ఇళ్లు, తిండి, బట్టలు మొదలైనవి. ఇంటిరుణానికి చెల్లించే ఈఎమ్ఐలు, వాహన, బీమా, విద్య, ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఇందులో వస్తాయి. 30 శాతం కోరికలకు – ఇవి జీవించేందుకు తప్పనిసరి అవసరాల కింద రావు. విహారయాత్రలు, ఎంటరటైన్ మెంట్, సినిమాలు, ఆటలుపాటలు ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. సాధారణంగా చూసే టీవీ షోలు మాత్రమేకాకుండా ప్రీమియం షోలు, కొత్త గాడ్జెట్ లు, ఖరీదైన కారు మొదలైన అంశాలు. 20 శాతం పొదుపు – మీరు సంపాదించిన మొత్తంలో పొదుపు, పెట్టుబడుల కోసం కేటాయించే మొత్తం. అత్యవసరనిధి, పొదుపుఖాతాలో డబ్బు, మ్యూచువల్ ఫండ్లు మొదలైనవి.
* రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వ్యాక్సిన్ వినియోగానికి భారత్‌లో మరికొన్ని వారాల్లో అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏపీఐ, సర్వీసెస్ సీఈఓ దీపక్ సప్రా తెలిపారు. భారత్‌లో ఈ టీకాను సరఫరా చేసేందుకు ‘రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)’తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వాటి మధ్యంతర ఫలితాల్ని భారత ఔషధ నియంత్రణ సంస్థకు అందజేశారు.
* కరోనా విజృంభిస్తున్న వేళ వెనిజువెలా అధ్యక్షుడు కొత్త తరహా దౌత్యానికి తెరతీశారు. మరోసారి పాతకాలపు వస్తుమార్పిడి వ్యవస్థను తెరపైకి తెచ్చారు. చమురు ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన వెనిజువెలా దాన్నే ఇప్పుడు టీకాలకు పెట్టుబడిగా మార్చుకునేందుకు సిద్ధమైంది. తమకు టీకాలు ఇచ్చిన వారికి చమురు ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆదివారం ప్రకటించారు. ‘‘వెనిజువెలా వద్ద చమురు ఉంది. దాన్ని కొనేందుకు వినియోగదారులూ సిద్ధంగా ఉన్నారు. అయితే, మా ఉత్పత్తిలో కొంత భాగాన్ని టీకా పొందేందుకు వినియోగించాలనుకుంటున్నాం. టీకాలిచ్చే వారికి చమురు ఇస్తాం’’ అని మదురో ప్రకటించారు. అయితే, వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్ వంటి దేశాలు అక్కడి నుంచి చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేశాయి.