మోపీదేవి బ్రహ్మోత్సవాలు ఆరంభం

*రేపటి నుంచి ప్రారంభం కానున్న మోపిదేవి లో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు9 వ తారీకు ఉదయం 11 గంటలకు స్వామివారిని పెళ్ళికుమారుని చేయుటఅనంతరం స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించనున్న ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్11.30 నిమిషాలకు స్వామివారి పుష్కరిణిలో నూతనంగా నిర్మించబడిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి 21 అడుగుల విగ్రహావిష్కరణ10 వ తారీకు సాయంత్రం 3.30 నిమిషాలకు స్వామివారిని శేష వాహనంపై గ్రామోత్సవం
అనంతరం రాత్రి 8.00 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం మరియు నంది వాహన ఉత్సవం11 తారీకు రాత్రి 8.00 గంటలకు స్వామివారి రథోత్సవం12 వ తారీకు ఉదయం 9.00 గంటలకు వసంతోత్సవం మరియు సుబ్రహ్మణ్య మాలధారుల దీక్ష విరమణ అనంతరం పూర్ణాహుతి మరియు స్వామివారి గ్రామోత్సవం రాత్రి 7.00 గంటలకు శమీ వృక్ష పూజ రాత్రి 8.00 గంటలకు స్వామి వారి మయూర వాహన ఉత్సవం13 వ తారీకు ఉదయం 10 గంటలకు సుబ్రమణ్య వాహనం అనంతరం తీర్థప్రసాద వినియోగము రాత్రి 7.00 గంటలకు ద్వాదశ ప్రదక్షణలుఅనంతరం బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం 9 వ తారీకు నుంచి 13వ తారీకు వరకు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలు.
1. ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేదీ వరకుశ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
**బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం సాయంత్రం
24-02-2019(ఆదివారం) ధ్వజారోహణం(కుంబలగ్నం) పెద్దశేష వాహనం
25-02-2019(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
26-02-2019(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం 27-02-2019(బుధవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
28-02-2019(గురువారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
01-03-2019(శుక్రవారం) హనుమంత వాహనం స్వర్ణరథం,గజ వాహనం
02-03-2019(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
03-03-2019(ఆది వారం) రథోత్సవం అశ్వవాహనం
04-03-2019(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
2. ఫిబ్రవరి 13వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 19వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఫిబ్రవరి 13న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 14న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 15న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 16న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 17, 18, 19వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు – 7 చుట్లు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
3. ఫిబ్రవరి 21న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 21వ తేదీ గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 11.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలైన తిరుప్పావడ, కళ్యాణోత్సవంలను టిటిడి రద్దు చేసింది.
4. గుణదల మాత ఉత్సవాలు ఈనెల 9 నుంచి 11 వరకు
దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లులను సృష్టించారంటారు. మరి ఆ దైవ కుమారుడికే పుట్టుకను ఇచ్చిన మాతృమూర్తి మేరీమాత. ఆమె మూడేళ్ల వయసులోనే దేవుడి అనుగ్రహాన్ని పొంది యెరూషలేము లోని దేవాలయంలో అర్పణ పొందినట్లు, ఏడేళ్ల వయసులోనే కన్యగా వ్రత దీక్ష తీసుకున్నట్లు లేఖనాలు పేర్కొంటున్నాయి. ఆమెను భక్తులు వ్యాకులమాతగా స్మరిస్తారు. దీనికి కారణం ఆమె జీవితంలో జరిగిన ఏడు వ్యాకులతలు. అంటే విచారం. ఏసు పుట్టిన ఎనిమిదో రోజున ఆయనను గుళ్లో కానుకగా అర్పిచండం. అంటే ఆయనను పాపుల రక్షణ కోసం త్యాగం చేయడం ఆమె మొదటి వ్యాకులతగా చెబుతారు. క్రీస్తు పుట్టిన రెండేళ్లకు ఆనాటి చక్రవర్తి హేరోదు వల్ల ఆపదను గుర్తించి ఆ బాలుడిని సురక్షితంగా దేశాన్ని దాటించడం రెండో కష్టం. యేసు పన్నెండేళ్ల వయసులో యెరూషలేము దేవాలయం దర్శించినప్పుడు ఆయన తప్పిపోయి మూడో రోజు దొరికాడు. అప్పుడు ఆ తల్లి వ్యధను మూడో వ్యాకులతగా భావిస్తారు. క్రీస్తును సిలువ వేసే ముందు సైనికులు ఆయనను కొరడాలతో హింసిస్తారు. రక్తసిక్తమైన ఆయన దేహాన్ని చూసి ఆ మాతృమూర్తి అంతులేని ఆవేదనను అనుభవించింది. ఇద్దరు నేరస్తుల మధ్య క్రీస్తును సిలువ వేయడం. ప్రభువు రక్తసిక్తమైన దేహాన్ని సిలువపై నుంచి తన ఒడిలో పడుకోబెట్టినప్పుడు ఆ తల్లి హృదయం పడ్డ బాధ వర్ణనాతీతం. ప్రభువు పరిశుద్ధ దేహాన్ని శిష్యులు సమాధిలో ఉంచిన ఘటన ఆ తల్లికి అంతులేని వ్యాకులతను కలిగించింది.సాక్షాత్తు దైవ కుమారుడినే తన గర్భాన మోసిన ఆ తల్లి, చివరి వరకు ఆయనతోనే ఉండి ఆయనతో పాటే మోక్షారోహణంతో తన జీవితాన్ని సంపూర్ణం చేసుకుంది. 1929లో విజయవాడలోని గుణదలలో ఆ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు..
5.బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభం
బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గణపతి హోమం, చండియాగంతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి చారి, ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, బాసర సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, ఆలయ ప్రత్యేకాధికారి సుధాకర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
6. 9న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీశైలానికి రాక
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీశైలభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొనేందుకు ఈనెల 9న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోటతీర్‌ బి.రాధాకృష్ణన్‌ రానున్నారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలసి వస్తున్నట్లు బుధవారం శ్రీశైల దేవస్థానానికి సమాచారం అందింది. ఆయన వెంట తెలంగాణా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అలీ మొహమ్మద్‌ సర్ఫరాజ్‌ రానున్నట్లు తెలిపారు. 9వ తేది రాత్రికి శ్రీశైలంలో బసచేసి 10వ తేది ప్రత్యేక పూజలు నిర్వహించుకోనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
7. హుండీ ఆదాయం రూ. 2.75 కోట్లు
శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు బుధవారం ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణమండపంలో జరిగింది. ఇందులో నగదు రూపేణ రూ. 2,75,21,598, బంగారు 224 గ్రాములు, వెండి 5.530 కిలోలతోపాటు యూఎస్‌, మలేషియా, యూఏఈ, సౌదీ, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, కువైట్‌ తదితర దేశాల విదేశీ కరెన్సీ ఉన్నట్లు ఈవో శ్రీరామచంద్రమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు గత 39 రోజుల్లో కానుకల రూపేణా హుండీల్లో సమర్పించినట్లు తెలిపారు.
8. అక్షరాభ్యాసం ఎలా చేయాలి?
విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ.
* పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం.
* సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి లభిస్తుంది. ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లోగానీ, దేవాలయంలోగానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు.
* మన సంప్రదాయంలో విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థిచేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలనూ తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యాదేవతలుగా పూజిస్తారు.
* ఆ తరువాత ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది.
* విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం
9. 12న తిరుచానూరు అమ్మవారికి సప్త వాహనసేవలు
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారు ఈనెల 12న రథసప్తమిని పురస్కరించుకుని సప్తవాహనాలపై ఊరేగనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారు సప్త వాహనసేవల్లో భక్తులకు సాక్షాత్కరించనున్నారు. అదే రోజు వేకువ జామున ఆరు గంటలకు గ్రామంలో కొలువుదీరిన శ్రీసూర్యనారాయణుడు అశ్వవాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనసేవ, 8.30 గంటలకు హంస వాహనం, 10 గంటలకు అశ్వవాహనం, 11.30 గంటలకు గరుడవాహనం, మధ్యాహ్నం ఒంటి గంటకు చిన్నశేషవాహనం, సాయంత్రం ఆరు గంటలకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవలు జరగనున్నాయి. ఆలయంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు అమ్మవారి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రథసప్తమి సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేకు దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి వివరించారు.
10. శబరిమలకు అన్ని వయసుల మహిళలూ రావొచ్చు
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నిర్వహించే ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) తన వైఖరిని మార్చుకుంది. ఆలయానికి అన్ని వయసుల మహిళల్నీ అనుమతించవచ్చని బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో గత తీర్పును సమర్థించింది. తాజా వైఖరి వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. శబరిమల పుణ్యక్షేత్రంలోకి అన్ని వయసుల మహిళలూ ప్రవేశించేందుకు అనుమతించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం 2018, సెప్టెంబర్‌ 28న తీర్పు ఇచ్చింది. దీన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన 65 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రివ్యూ పిటిషన్లు దాఖలుచేసిన పక్షాల వాదనలు వింటామని, తీర్పును పునఃసమీక్షించాలన్న అంశానికే వాదనలు పరిమితం కావాలని ధర్మాసనం న్యాయవాదులకు స్పష్టం చేసింది. బుధవారం మూడున్నర గంటలసేపు వాదనలు సాగిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూమల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
11. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణం ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని నిన్న 63,394 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,840 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.03 కోట్లుగా ఉంది.
12. 10 నుంచి విశాఖ శారదా పీఠంలో అష్టబంధన మహాకుంభాభిషేకం
విశాఖలోని శ్రీశారదా పీఠంలో ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకూ అష్టబంధన మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. పీఠం ఆవరణలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వామీజీ ఈ వివరాలను వెల్లడించారు. శారదాపీఠంలో నిర్మించిన నూతన దేవాలయం చుట్టూ ద్వాదశ సరస్వతులు, అంతరాలయంలో శారదామాత విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అష్టబంధన మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 14న జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రముఖులు హాజరవుతారని స్వామీజీ వివరించారు.
13. 26 నుంచి సిలువ గట్టు పుణ్యక్షేత్ర తిరునాళ్లు
నూజివీడులోని అద్భుత సిలువ గట్టు పుణ్యక్షేత్ర తిరునాళ్లు ఈ నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పుణ్యక్షేత్రం రెక్టర్‌ విచారణ గురువు రెవ.ఫా.ఎం.చిన్నప్ప తెలిపారు. గురువారం సాయంత్రం కమిటీ సభ్యులు, భక్తులు ఉపదేశకుల మధ్య తిరునాళ్లకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నూజివీడు వికార్‌ ఫోరెన్‌ టౌన్‌ విచారణ గురువులు రెవ.ఫా.దేవదత్తు, నెహ్రూపేట విచారణ గురువు రెవ.ఫా.తంబి నిర్మల్‌ తదితరులు పాల్గొన్నారు.
14. నెమలి ఆలయ ఏసీగా వినోద్‌కుమార్‌
కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయ సహాయ కమిషనర్‌గా జె.వినోద్‌కుమార్‌ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. జగ్గయ్యపేట ఓంకారేశ్వరస్వామి ఆలయ ఈవోగా పనిచేస్తూ పదోన్నతిపై ఆయన ఇక్కడకు వచ్చారు. ఈవో వై.శివరామయ్య నుంచి వినోద్‌కుమార్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన 2009-11 మధ్యకాలంలో నెమలి ఆలయ ఈవోగానూ పనిచేశారు.
15. సంప్రదాయబద్ధంగా నాగోబా దర్బార్‌
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల మధ్య ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ గ్రామంలో గురువారం నాగోబా జాతర దర్బార్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ జి.నగేష్‌, జిల్లాపరిషత్‌ ఛైర్‌పర్సన్‌ శోభారాణి హాజరుకాగా ఎమ్మెల్యే కోనప్ప, జిల్లా పాలనాధికారి దివ్య, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌, ఏటీడబ్ల్యూఏసీ ఛైర్మన్‌ లక్కేరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మెస్రం వంశస్థులతో కలసి వారు నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
16. జలధీశ్వరుడికి కుంభాభిషేకాలు- ఘంటసాలలో నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
ఘంటసాల.. ప్రాచీన కాలంలో చారిత్రక శైవ, భౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. పార్వతీ పరమేశ్వరులు హిమవత్‌ పర్వతంపై కూర్చున్న ప్రదేశాన్ని కైలాస గిరిగా చెబుతారు. ఒక చోట పరమ శివుడు, మరో పక్క అమ్మవారు ప్రతిష్ఠించి ఉండడం పలు శైవాలయాల్లో చూస్తాం. కానీ ఘంటసాలలోని శైవాలయంలో ఏక పీఠం పై శివపార్వతులు కొలువై ఉండటంతో దక్షిణ కైలాసగిరిగా పేర్కొంటారు. అగస్త్య మహా ముని ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణ గాథలు పేర్కొంటున్నాయి. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి గతేడాది ఏప్రిల్‌ 4న ఘంటసాలలోని జలధీశ్వరస్వామిని దర్శించి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఈ సందర్బాన జలధీశ్వరస్వామికి కుంభాభిషేకాలు చేయాలనే తలంపు తో ఉన్నట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఘంటసాలలోని జలధీశ్వరాలయంలో ఈ నెల 8న శుక్రవారం నుంచి పదో తేదీ వరకు కుంభాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
* 8న గోమాత పూజ, మహా సంకల్పం, హోమక్రతువులు, అమ్మ వారికి లక్ష కుంకుమార్చన, చతుర్వేద పారాయణం నిర్వహిస్తారు. విజయవాడకు చెందిన జమ్మలమడక ఓంకార కృష్ణశాస్త్రిచే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
* 9న కలశస్థాపన, నవగ్రహ హోమం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, పామర్రుకు చెందిన మార్తి శ్యామలాదేవి చే సంగీత కచేరీ నిర్వహిస్తున్నారు.
**10న కుంభాభిషేకాలు
ఈ నెల 10న ఉదయం శృంగేరీ పీఠానికి చెందిన రుత్విక్‌లు, ఆగమ పండితులు, తితిదేకు చెందిన వేద పండితులచే జలధీశ్వరస్వామికి కుంభాభిషేకాలు నిర్వహిస్తారు. దివిసీమ నుంచే కాక హైదరాబాద్‌, అమరావతి, విజయవాడ, విశాఖపటట్న నుంచి వేలల్లో భక్తులు ఈ మహా కుంభాభిషేకాలను తిలకించాడానికి తరలి వస్తున్నారు. పి.ఫణిరాజు ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, తితిదే వేద పాఠశాల ప్రిన్సిపల్‌ కుప్ప శివశుబ్రహ్మణ్య అవధాని, తదితరలు పాల్గొంటారు. అభిషేకాల అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశామని నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు.
17. 12న రథసప్తమి మహోత్సవం – సప్త వాహనాలపై ఊరేగనున్న సర్వాంతర్యామి
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో రథసప్తమి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. సూర్య జయంతిని రథసప్తమి పేరుతో వైష్ణవాలయాల్లో నిర్వహిస్తారు. ఈనెల 12న సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీవేంకటేశ్వరస్వామి సప్త వాహనాల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహించనున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి మందిరం మహద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణ చేయనున్నారు. స్వామివారు విహరించనున్న తిరువీధులను సన్నద్ధం చేశారు. మొదట సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. సూర్యోదయానికి ముందే నాలుగుమాడ వీధుల్లోని వాయువ్య దిశకు వాహనం చేరుకుంటుంది. సూర్యోదయం కాగానే తొలి కిరణాలు స్వామివారి నుదుట, నాభి, పాదాలను తాకుతాయి. ఈ సమయంలో సర్కారు హారతితో వాహనం ముందుకు కదులుతుంది. సకలరోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రధాత సూర్య భగవానునికి భక్తులు ఈ పర్వదినం సందర్భంగా ఉషోదయాన్నే పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం కూడా జరుగుతుంది. శ్రీవారికి ఒక రోజు బ్రహ్మోత్సవంగా రథసప్తమి వేడుక జరగనుంది. పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 11, 12 తేదీల్లో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తుంది. దివ్యాంగులకు, వయోవృద్ధులకు, చంటిబిడ్డలతో పాటు తల్లిదండ్రుల దర్శనాలను కూడా నిలిపివేయనుంది.
18. 1,840 ఆలయాలకు ధూపదీప నైవేద్యం నిధులు
రాష్ట్రంలోని మరో 1,840 ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధుల మంజూరీ ప్రక్రియ మొదలైంది. వీటికి 2018, అక్టోబరు, నవంబరు నెలలకు సంబంధించి మొత్తం రూ.12వేల చొప్పున దేవాదాయ శాఖ గురువారం ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించింది. వీటితో కలిపితే ప్రస్తుతం ఈ పథకంలో చేరిన ఆలయాల సంఖ్య 3,645కు చేరింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ పథకంలో మరో 1,160 ఆలయాలను అధికారులు ఎంపిక చేయాల్సి ఉంది. సరైన ఆదాయం లేని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం నెలకు రూ.2,500 చొప్పున అందజేసే పథకాన్ని తెలంగాణ సర్కారు 2015లో సంస్కరించింది. నెలవారీ ఇస్తున్న సాయాన్ని రూ.6వేలకు పెంచి.. ఆతర్వాత మరో మూడు వేల ఆలయాలను కొత్తగా ఈ పథకం పరిధిలోకి తేనున్నట్టు ప్రకటించింది. ఇలా ప్రకటించిన 3వేల ఆలయాల్లో 1,840 దేవాలయాలను 5 నెలల క్రితమే ఎంపిక చేసినప్పటికీ అప్పట్లో ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉండటంతో నిధుల మంజూరీని దేవాదాయ శాఖ వాయిదా వేసి.. తాజాగా ఆ ప్రక్రియను మొదలు పెట్టింది. పలు ఆలయాలను పథకం పరిధిలోకి తేవటం పట్ల తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, ఇతర ప్రతినిధులు ఏటూరి ఆంజనేయాచారి, నవీన్‌, రాజేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
19. శుభమస్తు
తేది : 8, ఫిబ్రవరి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న ఉదయం 7 గం॥ 53 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 16 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాభద్ర
(నిన్న ఉదయం 12 గం॥ 9 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 57 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : గరజ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 6 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 48 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 9 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 48 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 38 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 47 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 14 ని॥ లకు
సూర్యరాశి : మకరము

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com