యూఎస్‌లో వివాదంలో చిక్కుకున్న రెడ్డీస్-వాణిజ్య-02/08

**డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌, మరికొన్ని ఇతర కంపెనీలు యూఎస్‌లో ఔషధ ధరల వివాదంలో చిక్కుకున్నాయి. దాదాపు 30 జనరిక్‌ ఔషధాల ధరలకు సంబంధించిన బిడ్‌లను రిగ్గింగ్‌ చేయటానికి డాక్టర్‌ రెడ్డీస్‌, మరో 42 సంస్థలు ప్రయత్నించాయని యూఎస్‌లోని బీమా సంస్థ అయిన యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ఫిర్యాదు దాఖలు చేసింది. యూఎస్‌లోని షేర్‌మ్యాన్‌ చట్టంలోని 1వ సెక్షన్‌, మిన్నోసోటా తో పాటు మరో 29 రాష్ట్రాల విశ్వాసరాహిత్య చట్టాలను ఈ కంపెనీలు ఉల్లంఘించినట్లు అందులో ఆరోపించింది. వీటిపై చర్యలు తీసుకోవటమే కాకుండా నష్టపరిహారం, ఖర్చులు ఇప్పించాలని కోరింది. కానీ ఈ ఆరోపణలను డాక్టర్‌ రెడ్డీస్‌ తోసిపుచ్చింది. తన తప్పులేదని స్పష్టం చేసింది. ఈ న్యాయ వివాదాన్ని ఎదుర్కొంటామని పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలపై ఈ వివాదం ప్రభావం లేదని వివరించింది.
*అమెరికాలో రెండు దిగ్గజ బ్యాంకులు బీబీఅండ్‌టీ, సన్‌ట్రస్ట్‌ విలీనానికి ఒప్పందం చేసుకున్నాయి. 66 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.70 లక్షల కోట్ల) ఒప్పందం ద్వారా, అమెరికాలో ఆరోపెద్ద బ్యాంకుగా విలీన బ్యాంకు ఉంటుందని రెండు బ్యాంకులు ప్రకటించాయి. స్టాక్స్‌ ఒప్పందం ద్వారా విలీనానికి ఇరు బ్యాంకుల బోర్డులు అంగీకరించాయని తెలిపాయి. విలీన బ్యాంకుకు 442 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.31.38 లక్షల కోట్ల) ఆస్తులు, 301 బి.డా. (సుమారు రూ.21.37 లక్షల కోట్ల) రుణాలు, 324 బి.డా. (సుమారు రూ.23 లక్షల కోట్ల) డిపాజిట్లు ఉంటాయని, కోటి మందికి పైగా ఖాతాదార్లకు సేవలందిస్తుందని వెల్లడించాయి. 2019 నాలుగో త్రైమాసికంలో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రకటించాయి. సన్‌ట్రస్ట్‌ బ్యాంక్‌ అట్లాంటా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుండగా, బీబీఅండ్‌టీ నార్త్‌ కరోలినాలోని విన్‌స్టన్‌ సలెమ్‌ కేంద్రంగా నడుస్తోంది. విలీన బ్యాంక్‌ నార్త్‌ కరోలినాలోని చార్లొటే కేంద్రంగా, కొత్త పేరు, బ్రాండ్‌పై పనిచేయనుంది. ఇరు సంస్థలకు సమాన వాటా లభిస్తుంది. కార్యనిర్వాహక అధికారులు ఇరు సంస్థల నుంచి సమానంగా నియమితులవుతారు. 2000 సంవత్సరం తరవాత అమెరికాలో బ్యాంకుల సంఖ్య 40 శాతం తగ్గిపోయింది.
*శామ్‌సంగ్‌ మొబైళ్ల అమ్మకాల్లో దేశ వ్యాప్తంగా మూడో స్థానానికి చేరిన బిగ్‌ సి మొబైల్స్‌ను శామ్‌సంగ్‌ పశ్చిమాసియా అధ్యక్షుడు, సీఈఓ హెచ్‌.సి.హాంగ్‌ అభినందించారు.
*అరబిందో ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.5,269.70 కోట్ల ఆదాయాన్ని, రూ.712.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18 ఇదేకాలంలో ఆదాయం రూ.4,336.10 కోట్లు, నికర లాభం రూ.595 కోట్లుగా ఉన్నాయి.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పిట్టీ ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ రూ.5.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.2.94 కోట్లతో పోలిస్తే ఇది 76.87% అధికం. మొత్తం ఆదాయం రూ.165.68 కోట్లు ఆర్జించింది. 2017-18 ఇదే కాలం నాటి రూ.77.23 కోట్లతో పోలిస్తే ఇది 114.53% అధికం.
*నవభారత్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.363.84 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.33.43 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
*అంతర్జాతీయ మేధోహక్కుల (ఐపీ) సూచీలో మన దేశ స్థానం 8 స్థానాలు మెరుగై 36కు చేరింది. అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు చెందిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పాలసీ సెంటర్‌ (జీఐపీసీ), 50 దేశాల్లో ఐపీ స్థితి ఎలా ఉందో విశ్లేషించి, ఏటా ర్యాంకులను కేటాయిస్తుంటుంది.
*వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.26,960.8 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది.
*ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సిప్లా సంస్థ రూ.322.24 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.403.45 కోట్లతో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ.
*ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.151.75 కోట్ల నష్టాన్ని లుపిన్‌ నమోదు చేసింది. 2017-18 ఇదే కాలంలో సంస్థ రూ.221.73 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ పోర్ట్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.1,418.93 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో అదానీ పవర్‌ నష్టం రూ.1,180.78 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.1313.74 కోట్లుగా ఉంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత ప్రాతిపదికన రూ.5005.7 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,284.5 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
*అంకుర సంస్థలకు ప్రాధమిక దశలో మూలధన నిధులు సమకూర్చే సంస్థ అయిన శ్రీ కేపిటల్‌ కొత్తగా ఎడ్జ్‌టెన్సర్‌ అనే టెక్నాలజీ సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టింది. ఎంత మొత్తం సమకూర్చిందీ వెల్లడి కాలేదు. ఎడ్జ్‌టెన్సర్‌ యూఎస్‌లోని డల్లాస్‌ కేంద్రంగా పనిచేస్తోంది.
*ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు ఆకర్షణీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు కార్వీ కన్సల్టెంట్స్‌ విడుదల చేసిన ’కమొడిటీ, కరెన్సీ నివేదిక- 2019’ పేర్కొంది. ‘‘లోహాలకు 2017లో మంచి గిరాకీ లభించింది. కానీ గత ఏడాదిలో మాత్రం లోహాల ధరలు నీరసించాయి.
*కాగ్నిజెంట్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా (సీఈఓ) బ్రయాన్‌ హంప్రైస్‌ నియమితులయ్యారు. 2019 ఏప్రిల్‌ 1 నుంచి ఆయన నియామకం వర్తిస్తుందని కంపెనీ వెల్లడించారు. డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికానికి 64.8 కోట్ల డాలర్ల నికర లాభాన్ని కాగ్నిజెంట్‌ ఆర్జించింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నేడు వెల్లడించనుంది. ఉదయం 11.45 గంటలకు ఇవి వెల్లడవుతాయి.
*ఆర్‌బీఐ బోర్డు సమావేశం ఈ నెల 18వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాత్కాలిక మధ్యంతర బడ్జెట్‌ అనంతరం జరగనున్న మొట్టమొదటి ఆర్‌బీఐ బోర్డు సమావేశం ఇది. తొలుత 9న సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించగా ఇప్పుడు 18కి వాయిదా వేశారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
*బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేసి నెలవారీ వడ్డీ పొందాలనుకుంటున్న వారు, త్వరలోనే ఆ శుభవార్త వినే వీలుంటుంది. రుణ వితరణలో వృద్ధి కొనసాగాలంటే, 2020 మార్చి నాటికి బ్యాంకులకు రూ.20 లక్షల కోట్ల డిపాజిట్లు అవసరమవుతుంది. ఇంత సమీకరించాలంటే, డిపాజిట్‌ రేట్లు పెంచక తప్పని స్థితి ఎదురవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ పేర్కొంటోంది.
*ఇటలీ స్పోర్ట్స్‌ కార్ల దిగ్గజం లంబోర్గినీ గురువారం భారత విపణిలోకి హరికేన్‌ ఎవో మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.3.73 కోట్లు (ఎక్స్‌- షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. గతేడాది భారత్‌లోకి లగ్జరీ ఎస్‌యూవీ ఉరుస్‌ను విడుదల చేసిన సంస్థ.. కొత్త మోడల్‌తో వినియోగదారుల సంఖ్య పెరుగుతారని ఆశిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com