వసంత పంచమి ప్రత్యేకం

ఆమె అక్షరం… ఆమె అక్షయం… ఆమె గీర్వాణి… ఆమె సకల శాస్త్రాలకూ రారాణిఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం…వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె. వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే.యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు.ఆ తల్లి సరస్వతి… మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. ఆమె ఆవిర్భవించిన రోజు వసంతపంచమి.
**మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారమవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభసూచిక అవుతుంది. అజ్ఞానం అనే మంచుతో గడ్డకట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింపజేయటమే వసంత పంచమి అంత‌రార్థం. మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం. ఈ రోజుకే శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి.
* చైత్ర, వైశాఖమాసాల్లో వచ్చే వసంత రుతువుకు స్వాగతోపచారాలు మాఘమాసంలోనే మొదలవుతాయి. కాలగమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మకర సంక్రమణం (సంక్రాంతి) తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మాఘమాసం ప్రారంభం కావడంతోనే చెట్లు చిగురించడం, పూలు పూయడం మొదలవుతుంది. చలి, ఎండల మిశ్రమ వాతావరణం ప్రజలకు ఎంతో హాయి కలిగిస్తుంది. పంటలు నిండుగా చేతికి వచ్చి ఉంటాయి. పాడి పశువులకు పుష్కలంగా గ్రాసం లభిస్తుంది. దీంతో అవి సమృద్ధిగా పాలనిస్తాయి. గ్రహగమనాలన్నీ శుభస్థానాల్లో జరుగుతాయి. వివాహాది శుభకార్యాల సందడి మొదలవుతుంది. మొత్తంగా మానవజీవితానికి అత్యంత ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే కాలం ప్రారంభమవుతుంది. ఇదంతా రాబోయే వసంతమాసానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండి వసంత సందడి ముందుగానే వచ్చిన అనుభూతి కలిగిస్తుంది.
* పురాణ, ఇతిహాసపరంగా కూడా వసంత పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బ్రహ్మవైవర్త పురాణం, కృత్యసార సముచ్చయం, హేమాద్రి గ్రంథాల్లో ఇందుకు సంబంధించిన అనేక విషయాలు వివరణాత్మకంగా ఉన్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రాచీన రోమన్లు వసంతపంచమి ఉత్సవాన్ని జరిపేవారని తెలుస్తోంది. గ్రీకులు జ్ఞానదేవతగా భావించి ఈ రోజున సరస్వతీదేవికి పూజలు చేసేవారు.
రతికామ దమనోత్సవంగా జరుపుకునే ఆచారం కొన్నిచోట్ల ఉంది. పంచమినాడు రతీదేవి కామదేవ పూజచేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. రుతువుల రాజు అయిన వసంతుడికి, కామదేవుడికి మధ్య ఎంతో సఖ్యత ఉంది. వసంతుడు సస్యదేవత. కాముడు ప్రేమదేవత. రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురి కలయిక… అంటే, ప్రకృతి ద్వారా లభించే అమితమైన జీవనోపాధి మనుషుల మధ్య ప్రేమానురాగాల్ని కలిగిస్తుంది. ఏ ప్రాంతమైతే పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుందో అక్కడి మనుషులు ప్రేమానురాగాలతో సుఖంగా ఉంటారనేది ఇందులో అంతరార్థం.
* ఈరోజును బెంగాల్‌లో శ్రీపంచమిగా మూడురోజుల పాటు ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్తరభారతంలో ఈ రోజున ఉదయం నుంచే సరస్వతీదేవిని పూజించి, సాయంకాలం ఆ ప్రతిమకు ఊరేగింపు జరిపి, నిమజ్జనం చేసే ఆచారం కొనసాగుతోంది. వసంతరుతువుకు స్వాగతం పలికే రోజు వసంత పంచమి అని, ఇది రుతువులకు సంబంధించిన పండుగ అని శాస్త్రాలు చెబుతున్నాయి. పంజాబ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో ఈ రోజున పతంగుల పండుగ చేసుకుంటారు. వేదవ్యాస మహర్షి గోదావరీ నదీతీరంలో ఇసుకతో సరస్వతీదేవిని ప్రతిష్ఠించి, అర్చన చేశాడు. వ్యాసుడి కారణంగా ఏర్పడిన ఆ క్షేత్రమే ‘వ్యాసర’ లేదా ‘వ్యాసపురి’ కాలక్రమంలో ‘బాసర’గా ప్రసిద్ధి పొందింది.
**శ్వేతరూపం… జ్ఞానదీపం
* సరః అంటే కాంతి. కాంతి అంటే జ్ఞానం. మన జీవితాన్ని జ్ఞానంతో నింపే మాతృశక్తి సరస్వతి. శుద్ధ జ్ఞానానికి ఆమె ప్రతీక. వికాసం, విజ్ఞానాలకు ఆమె ఆకృతి. అక్షర అక్షయ సంపదలకు మూలమైన ప్రణవ స్వరూపిణి ఆమె. వేదజ్ఞానానికి మాతృకగా, గాయత్రిగా, సావిత్రిగా, లౌకిక, అలౌకిక విద్యల ప్రదాతగా ఆమె పూజలందుకుంటోంది.
* సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం అంటే నిరంతరం సాగిపోయే చైతన్యం. సాధారణంగా జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. జలం జీవశక్తికి సంకేతం. దాన్నుంచే అన్ని జీవులకూ శక్తి అందుతోంది. తద్వారా ప్రకృతిలో ఉత్పాదకత జరుగుతోంది. ఈ ఉత్పాదకతకు ప్రతిఫలమే సరస్వతి (జ్ఞానం). సృష్టి కార్యాన్ని నిర్వహించే బ్రహ్మదేవుడికి కూడా అందుకు తగిన జ్ఞానాన్ని సరస్వతి అందిస్తుంది.
* సరస్వతీ అవతారం అహింసకు కూడా తార్కాణంగా కనిపిస్తుంది. తెల్లటి వస్త్రాలు, తెల్లటి పువ్వులు, తెల్లటి ముత్యాల సరం, గంధపు పూత ఇవన్నీ గీర్వాణికి ఇష్టమైనవి. ఇవన్నీ శాంతికి, స్వచ్ఛతకు చిహ్నాలు. ఏవిధమైన ఆయుధాలూ ఆమె చేతిలో ఉండవు. మనలో ఉన్న అజ్ఞానమనే రాక్షసుడిని సంహరించే విజ్ఞానమనే ఆయుధాన్ని అందించే పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట హింసకు, అశాంతికి తావుండదు కదా. ఇంకో ఉపమానంలో తెలుపు శుభ్రతకు, నిర్మలత్వానికి, స్వచ్ఛతకు ప్రతీక. ఈ ప్రకారం సరస్వతి స్వచ్ఛతకు ఆలంబనగా నిలుస్తుంది. అన్నిరకాలైన విద్యలు సరస్వతీదేవి అనుగ్రహంతో లభిస్తాయి. అంటే, విద్య ద్వారా మనిషి స్వచ్ఛంగా తయారై, నిర్మలహృదయంతో ప్రకాశిస్తాడని అర్థం చేసుకోవచ్చు.
* నదుల పరంగా చూస్తే గంగ, యమునలతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఈ కోణంలో చూస్తే జ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ప్రవహించాలే కానీ బాహ్యప్రదర్శనల కోసం విజ్ఞానాన్ని ప్రకటించకూడదనే సందేశాన్ని సరస్వతీ నది ద్వారా మనకు అందుతుంది.
బౌద్ధమతం వ్యాప్తిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో సరస్వతీదేవిని మంజుశ్రీ, మహాసరస్వతి, వజ్రసరస్వతి, ఆర్య వజ్రసరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్రశారద వంటి పేర్లతో ఆరాధిస్తారు. జైనులు కూడా శృతదేవత, షోడశవిద్యాదేవతగా పూజలు చేస్తారు.రుగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త, పద్మపురాణాల్లో సరస్వతీదేవి వర్ణన విస్తారంగా ఉంది. వీటిప్రకారం సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలు ధరించి, హంసవాహనాన్ని అధిరోహించి ఉంటుంది. చేతుల్లో వీణ, రుద్రాక్షమాల, పుస్తకం ధరించి ఉంటుంది.
* సరస్వతీదేవి చేతిలో ఉన్న పుస్తకం జ్ఞానానికి సంకేతం. పుస్తకం ద్వారా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం మనిషిలో తీర్చిదిద్దిన సంపూర్ణ వ్యక్తిత్వానికి, హృదయ నిర్మలత్వానికి ప్రతీక. సంహరించాల్సింది వ్యక్తిని కాదు… అతడిలోని రాక్షస గుణాన్ని మాత్రమే అనే సంకేతాన్ని సరస్వతి చేతిలోని పుస్తకం ద్వారా అందుతుంది.
* అమ్మ చేతిలో వీణ సంగీతానికి ప్రతిరూపం. ఈ వీణ పేరు ‘కచ్ఛపి’. చదువంటే కేవలం పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు. కళలన్నీ చదువులో భాగమే. కళాకారుడు అత్యుత్తమ సంస్కారం, ఆత్మీయత కలిగి ఉంటాడు. మనుషులందరూ ఇలాంటివారు కావాలని సరస్వతి చేతిలోని వీణ చెబుతుంది. అందులో ఏడుతంత్రులు ఉంటాయి. వీటిద్వారా నాదం ఉత్పత్తి అవుతుంది. మనం చూసే ప్రపంచమంతా నాదమయం. పరమేశ్వరుడు నాదస్వరూపుడు. కాబట్టి, పరమేశ్వరుడిని చేరుకోవాలంటే నాదోపాసన చెయ్యాలన్న సందేశం కూడా సరస్వతీదేవి చేతిలోని వీణ చెబుతుంది.
* ఆమె వాహనం హంస. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరించే గుణం హంసకు ఉంది. సమాజంలో మంచి, చెడూ పాలూనీళ్లలా కలిసే ఉంటాయి. ఉత్తమ జ్ఞానం కలిగిన వ్యక్తి హంసలాగా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పటం హంసవాహనం ఇచ్చే సందేశం.
* కమలం వికాసానికి, పవిత్రతకూ చిహ్నం. కమలం పుట్టుక బురదలోనే. కానీ, బురద వాసన, అపవిత్రత దానికి సోకవు. అందుకే అమ్మకు కమలం ఆసనమైంది. అలాగే మనిషి కూడా అనేక అపవిత్రాలు ఉండే సమాజంలో ఉంటూనే తన పవిత్రతను కాపాడుకోవాలి. మనోవికాసాన్ని సాధించాలనే సందేశాన్ని కమలం అందిస్తుంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు అందుకు ప్రతీకగా కూడా కమలాన్ని యోగసాధకులు చెబుతారు.
* సరస్వతీదేవి ధరించే ధవళవస్త్రాలు స్వచ్ఛతకు చిహ్నం. మనిషి కూడా స్వచ్ఛంగా ఉండాలని ఇవి సూచిస్తాయి. తెలుపు వస్త్రం ఏ చిన్న రంగు పడినా అది సహజత్వాన్ని కోల్పోతుంది. చూడటానికి ఇంపుగా ఉండదు. మనిషి కూడా అంతే. ఏ చిన్న అపవాదు వచ్చినా, తప్పు చేసినా ఆ ఫలితం అతడి జీవితాంతం వెన్నంటి ఉంటుంది. అందుకే, ఏ తప్పూ చెయ్యకుండా స్వచ్ఛంగా, తెల్లటి వస్త్రంలా ఉండాలని ధవళ వస్త్రాలు సూచిస్తాయి.
* ఆమె చేతిలోని రుద్రాక్షమాల ఆత్మచైతన్యాన్ని సూచిస్తుంది. కేవలం భౌతికం, లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు. అతడు ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ఆత్మసాక్షాత్కారం పొందటానికి రుద్రాక్ష మార్గం చూపుతుంది. రుద్రాక్షను రుషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు.
1. నకిలీ వెబ్‌సైట్‌ నుంచి దర్శన టికెట్లు
తితిదే పేరిట ఉన్న నకిలీ వెబ్‌సైట్‌ నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు పొంది మహారాష్ట్రకు చెందిన పదిమంది భక్తులు మోసపోయారు. మహారాష్ట్ర చిల్వాడకు చెందిన పంకజ్‌ కుటుంబసభ్యులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను రూ.3,600 చెల్లించి ఆన్‌లైన్‌లో కొన్నారు. వీటితో శుక్రవారం శ్రీవారి దర్శనానికి రాగా టిక్కెట్లను స్కానింగ్‌ చేసి నకిలీ వెబ్‌సైట్‌ నుంచి పొందినవని తితిదే సిబ్బంది తేల్చారు. బాధితులు తితిదే విజిలెన్స్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
2. యాదాద్రిలో సీఎం సూచనల అమలు షురూ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల యాదాద్రి పర్యటన సందర్భంగా చేసిన సూచనల అమలు మొదలైంది. ఆలయ సన్నిధిలో నిర్మిస్తున్న రథశాల ఎత్తును తగ్గించాలన్న ఆయన ఆదేశాల మేరకు సదరు కట్టడాల తొలగింపు పనులు శుక్రవారం ప్రారంభించారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో ‘యాడా’కు చెందిన ఈఎన్‌సీ గణపతిరెడ్డి, ఆలయ శిల్పి ఆనందసాయి, స్తపతి ఆనందాచారి వేలు శుక్రవారం యాదాద్రిని సందర్శించారు. లోటుపాట్లపై ప్రత్యేక నివేదికను రూపొందించి ‘యాడా’కు అందజేయనుంది. మరోవైపు పెద్దగుట్టపై ఆలయ నగరిలో నిర్మిస్తున్న ‘యాడా’ అతిథిగృహంతోపాటు కొండ దిగువన గండిచర్ల వద్ద కల్యాణకట్ట సముదాయం పనులనూ నిలిపివేశారు. ఈఎన్‌సీ గణపతి రెడ్డి సూచనల మేరకు పనులు ఆగాయి. అతిథిగృహం ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రతిపాదనలు ఉన్నాయి. గర్భాలయం ఎదుట రాతి గోడలు ఏవీ ఖాళీగా ఉండకుండా వైష్ణవత్వం ఉట్టిపడే శిల్పాలను పొందుపరిచేందుకు సన్నాహాలు మొదలుకానున్నాయి.
3. వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు
గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థనాల్లో వందలాది మంది భక్తులు పాల్గొనన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్యప్రసాదాన్ని అందచేశారు .మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మేరీమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ పీఠాధిపతి డాక్టర్ తెలగతోటి రాజారావు భక్తులనుద్దేశించి శాంతి సందేశం అందించారు
4. శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు సీజే
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామిసేవలో పాల్గొన్నారు. అనంతరం కాణిపాకం వినాయకుడి సేవలో పాల్గొన్నారు.
5. భద్రాద్రిలో రామదాసు ఉత్సవ శోభ
సీతారాముల ఆలయంలో శుక్రవారం భక్త రామదాసు జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా, నగర సంకీర్తన అనంతరం రామదాసు విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. నవరత్న కీర్తనలతో కచేరి సాగించారు. పుణ్య గోదావరికి పూజలు జరిపారు. జాతీయస్థాయి కళాకారుల మృదుమధుర గాత్రాలకు వయొలిన్‌, మృదంగం, ఘటం, తబలా, వీణ, కంజీర వంటి పలు వాయిద్య పరికరాల నిపుణత తోడై.. అంతా రామమయంగా మారింది. స్వామికి, అమ్మవారికి స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు శ్రీచక్ర సిమెంట్‌ లిమిటెడ్‌ సహకారం అందిస్తోంది. ఇవి 5 రోజులు కొనసాగుతాయని ఈవో రమేశ్‌బాబు తెలిపారు.
6. కులాతీత వైభవ క్షేత్రం-నేడు దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపనలు
కులాలకు అతీతంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం గోళ్లమూడిలోని దళితవాడలో నిర్మించిన శ్రీరామపాద క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. వైరా ఏటి ఒడ్డున ఉండే గ్రామంలో దాతల విరాళాలు, ప్రభుత్వ నిధులు కలిపి రూ.70 లక్షలతో ఈ క్షేత్రాన్ని నిర్మించారు.శ్రీరాముడు ఉత్తరాపథం నుంచి దక్షిణాపథం వైపునకు వెళ్తూ ఇక్కడ తన పాదాన్ని మోపిన చారిత్రక స్థలంగా ఈ ప్రాంతం గుర్తింపు దక్కించుకుంది. దేశంలోనే తొలి శ్రీరామపాద క్షేత్రమని చరిత్రకారులు చెబుతున్నారు. పూర్వం నుంచి ఇక్కడ చిన్న రామమందిరం ఉండగా దీని స్థానంలో దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఎస్సీ కాలనీల్లో అనేక రామాలయాలు ఉన్నా ఇక్కడ ఎస్సీలను భాగస్వాములను చేసి దీనిని నిర్మించారు. ప్రస్తుతం పునఃప్రతిష్ఠోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
7. 3 ఆలయాలకు పాలకవర్గ సభ్యుల నియామకం
శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం, విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, పిఠాపురంలోని శ్రీ కుకుటేశ్వరస్వామి దేవస్థానాలకు రాష్ట్ర ప్రభుత్వ పాలకవర్గ సభ్యులను నియమించింది.
8. బాసరలో ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను మూడురోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు శుక్రవారం వేకువ జామున నాలుగు గంటలకు అమ్మవారికి అభిషేకం, సంకల్ప పూజ అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, హారతి, మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం ఏడు గంటల నుంచి భక్తులు తమ చిన్నారులకు వేద పండితులచే అక్షరశ్రీకారాలు జరిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
9. విజయకీలాద్రిపై శ్రీవారి – బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
పవిత్ర కృష్ణాతీరంలోని సీతానగరంలోని విజయకీలాద్రి పర్వతంపై శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు ఈనెల 9వ తేదీన అంకురార్పణ చేస్తున్నట్లు జీయర్‌ ఆశ్రమ నిర్వహకులు వెంకటాచార్యులు తెలిపారు. ఆలయ అర్చకులైన మధుసూధనాచార్యులు, రఘనాథాచార్యులతో కలిసి విలేకర్లకు బ్రహ్మోత్సవాల వివరాలను తెలిపారు. 10 తేదీన జరిగే విజయకీలాద్రి గిరిప్రదక్షణ ఉండవల్లి కూడలి వద్ద స్క్రూబ్రిడ్జి నుంచి కేఎల్‌రావు కాలనీ కలుపుతూ బ్యారేజీ మీదగా సీతానగరం ఆలయం వద్దకు చేరుకుంటుందని చెప్పారు.10న గోపాలోపాయన పురస్కారాలు ప్రదానం.. విజయకీలాద్రి పర్వతంపై జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనెల 10వ తేదీన గోపాలోపాయన పురస్కారాలుు ప్రదానం చేస్తారు. శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్‌స్వామి శిష్యులు గోపాలాచార్యస్వామి పేరుపై శాస్త్రవేత్త ప్రసిద్ధ విద్వాంసులు ఎంఏ లక్ష్మీతాతాచార్యస్వామి వారికి సమర్పించాలని శ్రీమధుభయవేదాన్తాచార్యపీఠం సంకల్పించినట్లు ఆశ్రమ నిర్వహకులు వెంకటాచార్యులు తెలిపారు. 25 మందికి పురస్కారాలు చినజీయర్‌స్వామి ప్రదానం చేస్తారు.14,15 తేదీల్లో సామూహిక ఉప నయనాలు .. ఈనెల 14, 15వ తేదీల్లో సామూహిక ఉపనయనాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 14వ తేదీ సాయంత్రం ఉదకశాంతి, 15 ఉదయం ఉపనయనాలు జరుగుతాయి. ఈ కార్యక్రమం చిన్న జీయర్‌స్వామి పర్యవేక్షణలో జరుగుతుందని వెంకటాచార్యులు తెలిపారు. 12వ తేదీలోగా వటువులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
10. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 40 నదులను పునరుజ్జీవింపజేసినందుకుగాను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌-2019లో చోటు దక్కింది. కరవు ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల కారణంగా 5 వేలకు పైగా గ్రామాల్లోని 49.9 లక్షల ప్రజలకు నీటి వసతి కలిగింది. 2013 జనవరిలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ స్వచ్ఛంద సంస్థ నాలుగు రాష్ట్రాల్లోని (కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా) నదీ పరివాహక ప్రాంతాల్లో 40కి పైగా నదులు, వాగులను, 9 నదీ పరివాహక ప్రాంతాల్లోని 26 సరస్సులను పునరుజ్జీవింప చేసే కార్యక్రమం చేపట్టింది. మొదటగా భూ భౌతిక శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు ఆయా ప్రాంతాల్లో రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతను ఉపయోగించి విస్తృతంగా పరిశోధనలు చేశారు. వాటి ఆధారంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కార్యకర్తలు సుమారు 5వేల మంది గ్రామస్థులతో చేయి కలిపి బావులను పునరుద్ధరించడం, పూడిక తీయడం, కాలుష్య కారకాలను ఏరివేయడం, నదీ తీరాలను పరిశుభ్రపర్చడం, తీరాల వెంబడి చెట్లను నాటడం, వాతావరణ స్థితిగతులను బట్టి పంట మార్పిడి విధానంలో రైతులకు చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టారని లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రస్తావించింది.
11. శుభమస్తు
తేది : 9, ఫిబ్రవరి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి
(నిన్న ఉదయం 10 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాభద్ర
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 58 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 28 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : భద్ర (విష్టి)
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 20 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 12 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 1 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 11 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 21 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 14 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మీనము
12.నేటి నుంచి రాహుకేతు పూజ ప్రారంభం
ఇంద్రకీలాద్రీ పై నూతనంగా ప్రారంభించిన రాహుకేతు పూజ ట్రయల్ రాన్ శుక్రవారంతో పూర్తయింది. నేటి నుంచి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులతో పూజకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజులు పూజ చేసిన క్రమంలో ఎదురైనా ఇబ్బందులను ఈవో కోటేశ్వరమ్మ, వైదిక కమిటీ సభ్యులు స్వయంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేశారు. రాహుకాలం మాత్రమే పూజ చేయాల్సి ఉన్నందున ప్రతి రోజు పూజ నిర్వహించే వేళలు మారుతున్నాయి. అందుకు అనుగుణంగా అర్చకులను నియమించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com