* బులియన్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయితే, కొన్ని నగరాల్లో ధరలు తగ్గితే మరికొన్ని చోట్ల స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు (మార్చి 26) బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ. 40733గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.222 తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.44468 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.242 తగ్గింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి. ప్రారంభం నుంచీ బుల్ రంకె కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలకు దేశీయంగా కీలక రంగాల షేర్లు రాణించడం కలిసొచ్చింది. మొత్తంగా నేడు మార్కెట్లు రెండు శాతానికి పైగా ఎగిశాయి. సెన్సెక్స్ కీలక 50 వేల మైలురాయిని, నిఫ్టీ 14,800 మార్క్‌ను చేరుకున్నాయి.
* చెల్లింపుల యాప్ మొబీక్విక్ కీలక డేటా బయటకు పొక్కినట్లు సమాచారం. దాదాపు 8.2 టెరాబైట్ల డేటా ఆన్‌లైన్‌లో విక్రయానికి వచ్చినట్ల వార్తలొస్తున్నాయి. వీటిల్లో కేవైసీ సమాచారం, ఫోన్‌నెంబర్లు, ఆధార్ నెంబర్లు వంటి వాటిని డార్క్‌వెబ్‌లో ఉంచారు. మొత్తం 3.5 మిలియన్ల డేటా ఉందని సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజారియా ఫిబ్రవరిలో పేర్కొన్నారు. సోమవారం ఒక లింక్ డార్క్‌వెబ్‌లో వైరల్‌గా మారింది. దీనిని పరిశీలించిన చాలా మంది వినియోగదారులు తమ వివరాలను దానిలో గుర్తించారు. చాలా మంది స్క్రీన్ షాట్లను ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. ఈ డేటాలో పాస్‌వర్డ్‌లు మాత్రమే ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉన్నాయి. ఈ మొత్తం డేటాను 1.5 బిట్‌కాయిన్‌కు విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన కొందరు నిపుణులు కూడా ధ్రువీకరించారు. దీనిపై మొబిక్విక్ స్పందించింది.
* గ్రోసరీ వ్యాపారంలో మరింతగా విస్తరించే ప్రణాళికలతో అమెజాన్ ఇండియా ఉంది. నాన్ మెట్రో, ఇతర పట్టణాల్లోని మొదటి సారి కస్టమర్లను పెద్ద ఎత్తున సొంతం చేసుకోవాలనుకుంటోంది. గడిచిన ఏడాది కాలంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు ఇతర పట్టణాల నుంచి అమెజాన్‌లో షాపింగ్ చేసిన కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త కస్టమర్లలో 85 శాతం.. అలాగే, ఆర్డర్లలో 65 శాతం ద్వితీయ శ్రేణి, అంతకంటే చిన్న పట్టణాల నుంచే ఉన్నాయి. అమెజాన్ గ్రోసరీ వ్యాపారమైన అమెజాన్ ప్యాంట్రీలనూ కొనుగోలు చేసే మొత్తం కస్టమర్ల సంఖ్య పెరిగింది. అమెజాన్ ప్యాంట్రీలో కొనుగోలుదారులు రెట్టింపుయ్యారు. కరోనా తర్వాత అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ ఫ్రెష్‌పై ఆర్డర్లలో 60 శాతానికి పైగా నూతన కస్టమర్ల నుంచే, అది కూడా నాన్ మెట్రోల నుంచే ఉంటున్నాయి.
* కరోనా మహమ్మారి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన సంస్థలు ఇప్పుడు దానిని శాశ్వతంగా కొనసాగించాలని ఆలోచిస్తున్నాయి. తాజాగా బీసీజీ-జూమ్ నిర్వహించిన సర్వేలో 87 శాతం సంస్థలు శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపినట్లు తేలింది. అంతే కాకుండా, కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసే వాళ్ల సంఖ్య ఇప్పటికి మూడు నుంచి ఐదు రెట్లు పెరిగినట్లు కూడా ఈ సర్వే స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలపై పడిన ఆర్థిక ప్రభావం, పనితీరు గురుంచి అంచనా వేయడానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)తో కలిసి జూమ్ ఈ సర్వే నిర్వహించింది.