WorldWonders

తాడేపల్లి వీధుల్లో నోట్లకట్టల కుప్పలు-తాజావార్తలు

Fake Kids Currency On Tadepalli Streets In Andhra

* రూ.2000, రూ.500, రూ.200.. చెత్త ఎత్తే కొద్దీ నోట్ల కట్టలు!పొద్దున్నే రోడ్లపై పడిన చెత్తను ఊడ్చేందుకు తాడేపల్లిలో పంచాయతీ కార్మికులు డ్యూటీ ఎక్కారు. ఉండవల్లి సెంటర్ లోని ఎస్బీఐ వద్ద చీపుర్లు పట్టి చెత్తను ఓ వైపునకు ఊడ్చి ఎత్తుతున్నారు. ఇంతలో కార్మికులకు ఓ రూ.500 నోటు కనిపించింది. అదృష్టం బాగుందని దానిని తీసి దాచారు. చెత్త ఎత్తే కొద్దీ నోట్లు దొరుకుతూనే ఉన్నాయి. ఏంటా అని మొత్తం చెత్త తీసే సరికి దాదాపు 30 దాకా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి.ఆ నోట్ల కట్టలను చూసి భయపడిపోయిన పంచాయతీ కార్మికులు.. వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి ఆ నోట్లను పరిశీలించి చూశారు. దొంగనోట్లు అనుకున్నారు. కానీ, కట్టలన్నింటినీ క్షుణ్ణంగా చూస్తే.. దాని మీద చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ స్కూల్ జోన్ అని రాసి ఉంది. దీంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. మళ్లీ ఆ ‘పిల్లల నోట్ల’ కట్టలను చెత్తలో వేసేసి డంప్ యార్డుకు పంపించారు.

* దేశంలో ఇటీవల అనతికాలంలోనే కొవిడ్‌ కేసులు ఐదు రెట్లు పెరిగాయని, పరిస్థితి తీవ్రంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. మాస్క్‌లు ముక్కు, నోటిపైనే ఉండాలని సూచించింది. ప్రభుత్వాలు కూడా తక్షణ చర్యలు చేపట్టి పరిస్థితి చేజారకుండా చూసుకోవాలని సూచించింది. దేశంలో వైరస్‌ ఉద్ధృతిపై ఆరోగ్యశాఖ అధికారులు నేడు మీడియాతో మాట్లాడారు.‘‘గతేడాది జులై నుంచి కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. సెప్టెంబరులో వైరస్‌ మరింత తీవ్రమైంది. ఆ తర్వాత నుంచి కొవిడ్‌ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య నుంచి కేసులు మళ్లీ పెరిగాయి. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దానివల్ల యావత్‌ దేశం ప్రమాదంలో పడుతోంది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’ అని నీతి ఆయోగ్‌(ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. అయితే ప్రజలు కూడా కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలి, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచాలని పేర్కొంది.

* ఖమ్మం జిల్లా డిసీసీబీ బ్యాంక్‌లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. గత పాలక మండలి హయాంలో 10 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రస్తుత బ్యాంక్ సీఈవో గుర్తించారు. సీఈవో అట్లూరి వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ చైర్మన్‌తో పాటు 20 మంది డైరెక్టర్లపై 403, 406, 409, 420 సెక్షన్ల కింద ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత పాలక మండలి హయాంలో జరిగిన అవకతవకలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు.

* పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఓర్వలేక మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని వైకాపా పట్టణ కన్వీనర్ శంకర, గోరంట్ల ఉప సర్పంచ్ రాజరెడ్డిలు తీవ్రంగా విమర్శించారు. గోరంట్ల వైకాపా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డబ్బు, దౌర్జన్యం, వాలంటీర్లు, పోలీసులే వైకాపా అభ్యర్థులను గెలిపించారని, ప్రజాస్వామ్య బద్ధంగా గెలవలేదంటూ నిమ్మల చేసిన ఆరోపణలపై ఈ సందర్భంగా వీరు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేక నిమ్మల సాకులు చూపుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో సిఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేశారని గుర్తు చేశారు. మండలంలోని18మంది సర్పంచులుగా గెలిచారని, నీ పార్టీ తరపున ఇద్దరు మాత్రం గెలిచిన సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎన్నడూ లేని విధంగా ఏ చిన్న సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని వివరించారు. ప్రస్తుతం పట్టణంలో ఆరు రోజులకు ఒకసారి కొళాయిల్లో నీళ్ళు వస్తున్నాయని, అదే నీ హయాంలో రెండేళ్లకు ఒకసారి నీళ్లు రావడం ప్రజలకు తెలుసునని, అందుకే తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నాయకులు రామచంద్రారెడ్డి, నాగే నాయక్ తో పాటు సర్పంచులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

* రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ విజయవంతం.ఢిల్లీ ఎయిమ్స్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ.ట్విట్టర్లో వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.ఎయిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపిన రాజ్ నాథ్ సింగ్.రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వేగంగా కోలుకోవాలని ఆకాంక్ష.ఛాతీ అసౌకర్యంతో కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.అనంతరం ఆర్మీ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్ లో చేరిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.

* కరోనా కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నిన్న 7,85,864 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..56,211 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసులు 17 శాతం మేర తగ్గాయి. అలాగే నిన్న ఒక్కరోజే 37,028 మంది కొవిడ్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 42,461 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 463 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,07,205కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1694కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 364 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,00,833కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,678 యాక్టివ్‌ కేసుల్లో 1,723 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,00,95,487కి చేరింది.

* ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2021 సీజన్‌లో పాల్గొనేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌ స్వదేశం నుండి బయలుదేరాడు. వార్నర్‌.. ఈ సీజన్‌ తొలి విడత మ్యాచ్‌లకు దూరమవుతాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో, లీగ్‌లో పాల్గొనేందుకు బయలుదేరానని ఆయన గుడ్‌న్యూస్‌ చెప్పడంతో సన్‌రైజర్స్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు వార్నర్‌ తన కుటుంబ సభ్యులతో గడిపాడు. తన పిల్లలతో కలిసి విందును ఆరగించి ఎంజాయ్‌ చేశాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు.