ఆదిదేవ నమస్తుభ్యం! -ఈ నెల 12న రథసప్తమి

ఆదిత్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు. లోకయాత్ర సాగిస్తాడు. జగత్తుకు వెలుగును ప్రసాదిస్తూ, సమస్త జీవరాశినీ కర్మలకు ప్రేరేపిస్తూ, తాను సాక్షిగా ఉన్నాడు. అందుకే ఆయనను ‘కర్మసాక్షి’ అంటారు. జగత్తుకే నేత్రంగా ఉండడం వల్ల ఆయన జగచ్ఛక్షువు. లోక బాంధవుడు. ప్రత్యక్ష దైవం. సృష్టికి పూర్వం నుంచీ ఉండడం వల్ల ఆదిదేవుడు.. సూర్యునికి ఎన్నో నామాలు ఉన్నాయి. ఈ భావన చేస్తే ప్రతిరోజూ ఉత్తరాయణ పుణ్యకాలమే! ఆదిత్యారాధనకు అనుకూలమే. అందుకే ప్రతి దినం సంధ్యావందనం విధిగా చేయాలన్నారు. సంధ్యావందనమే ఆదిత్యుణ్ణి ఉపాసించే రథసప్తమీ వ్రతం.
** మాసానికో నామం
సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కాలాన్ని ఒక సంవత్సరంగా ఖగోళ శాస్త్రజ్ఞులు పరిగణించారు. ఆ పరిభ్రమణంలో భూమిపై సూరశక్తి ప్రభావం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆయా మాసాలలో భూమిపై ఉన్న శక్తిని ఆదిత్యునిగా చెబుతూ, ద్వాదశాదిత్యులని పన్నెండు పేర్లు పెట్టి, మంత్రపూర్వకంగా ఆరాధించాలని పెద్దలు చెప్పారు. చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకూ ఆదిత్యుని నామాలు- ధాతీ, ఆర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్‌, పూషా, పర్జన్య, అంశుమాన్‌, భగ, తష్ట్వా. విష్ణు.
*సూర్యుడి పాదాలపై తొలి కిరణం
దేశంలోనే విశిష్టమైన సూర్యదేవాలయం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉంది. దేవేంద్రుడు ఇక్కడ సూర్యుణ్ణి ప్రతిష్ఠించి, ఆరాధించాడని భవిష్య, భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మ అరుణ శిలతో ఆదిత్యుడి విగ్రహాన్ని మలిచాడని స్థలపురాణం పేర్కొంటోంది. కాలగతిలో కనుమరుగైన ఈ దేవాలయాన్ని ఏడవ శతాబ్దిలో కళింగ రాజైన దేవేంద్రవర్మ ఉత్కళ శిల్ప శైలితో పునర్నిర్మించాడు. వెయ్యేళ్ళపాటు వర్ధిల్లిన ఈ ఆలయం పద్ధెనిమిదో శతాబ్దంలో మరోసారి పునర్నిర్మాణానికి ఇది నోచుకుంది. ఇప్పుడు అశేష భక్తుల పూజలతో అలరారుతూ, నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా వర్ధిల్లుతోంది. పురాణాలలో ‘హర్షవలి’్లగా పేర్కొన్న ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ‘అరసవల్లి’గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ సూర్య విగ్రహం అయిదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. దేవేరులైన ఉష, ఛాయ, పద్మినులతో సప్తాశ్వ రథారూఢుడై, అనూరుడు రథసారథిగా స్వామి దర్శనమిస్తారు. సాధారణ రోజుల్లో గర్భగుడిలోని విగ్రహాలు అలంకారాలతో నిండి ఉంటాయి. రథసప్తమి రోజున స్వామి నిజరూపం ప్రదర్శితమవుతుంది. ఆ రోజు ఉషోదయంలో ఆదిత్యుడి తొలి కిరణం గర్భగుడిలోని సూర్యనారాయణుని పాదాలను స్పృశించడం అద్భుతమైన విశేషం. ఆ దృశ్యాన్ని దర్శించడానికి లక్షలాది భక్తులు వస్తారు.
*మోక్షప్రదం క్షీరాభిషేక దర్శనం
రథసప్తమి రోజున అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శంచుకోవడం వల్ల సర్వ రోగాల నుంచి విముక్తి కలుగుతుందన్న నమ్మకం ఉంది. ఆ రోజు తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక సేవలూ, పూజలూ ప్రారంభం అవుతాయి. రథసప్తమి నాడు స్వామి వారికి నిర్వహించే క్షీరాభిషేకాన్ని కనులారా వీక్షిస్తే రోగ. శోక, మోహాల నుంచి విముక్తి కలుగుతుందనీ, మోక్షం సిద్ధిస్తుందనీ పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆ రోజున సమీపంలోని నది లేదా చెరువులో… తొలి సంధ్య వేళలో తలపై జిల్లేడు ఆకు, దానిలో రేగు పళ్ళు పెట్టి తూర్పు దిశగా నిలబడి స్నానం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇలా చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పెద్దల మాట.
*సూర్యుడి రథానికి ఒకటే గుర్రం!
‘ఏకో అశ్వో సప్తమాన’- సూర్యుని రథాశ్వం ఒక్కటేననీ, అదే ‘సప్త’ అనే పేరు పొందిందనీ చెబుతూ ఆ ఏకకాంతిని సప్తవర్ణాలుగా విశ్లేషించి, సప్తాశ్వాలుగా ఋషులు దర్శించారు. ‘అరుణ కేతుకం’ ప్రకారం సూర్యునికి ‘సప్త’ అనే (ఒకే వేగవంతమైన) అశ్వం ఉంది. ‘సప్త’ అనేది సూర్య రథానికి పేరు. అదే అశ్వం. అంతే కాని ఏడు అశ్వాలు లేవన్నది ఒక అభిప్రాయం. ఆ సప్తకు ఒకే చక్రం! అది సంవత్సరానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న ఆరు ఆకులు… ఆరు ఋతువులకు చిహ్నాలు. సూర్యుని కిరణాలలోంచీ ప్రధానంగా ఏడు కిరణాలు వెలువడతాయి. అవి- సుషుమ్నం, హరికేశం, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాస్యం, విశ్వస్రవ, సర్వాద్వసు. సప్త ఛందస్తులు, సప్త వర్ణాలు, సప్త లోకాలు… ఇలా అనేకమైనవీ, ‘సప్త’ అనే రథం లేదా అశ్వం వల్ల ప్రభావితం అవుతున్నాయని వేదమంత్రం చెబుతోంది. ‘సప్తయుంజంతి రథమేక చక్రం ఏకో అశ్వో వహతి సప్తనామా’ అంటోంది ఋగ్వేదం.
*ఉత్తర దిశగా సూర్య రథం
సూర్యుణ్ణి నిత్యం అర్ఘ్యం ఇచ్చి పూజిస్తున్నప్పటికీ, మకర సంక్రాంతి, రథసప్తమి రోజుల్లో చేసే ఆరాధనలు ప్రధానమైనవని శాస్త్ర వచనం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధను రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అయితే, వాస్తవంగా సూర్యుడు ఉత్తర దిశకు పయనించే రోజు మాఘ శుద్ధ సప్తమి. అందుకే దీన్ని ‘రథ సప్తమి’గా పేర్కొంటారు. సూర్యుడికి ‘సప్తమి’ అనే పేరుంది. ‘హిరణ్యయేన సవితా రథేన! ఆదేవోయాతి భువనాపివశ్యన్‌’ అని శ్రుతి వాక్యం. ఆ రథం ఉత్తర దిశగా పయనించే రోజు కనుక ‘రథ సప్తమి’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ‘శతపథ బ్రాహ్మణం’ ఇలా వివరించింది: ‘అసేవా ఆదిత్య ఏషోశ్వః’. ఆదిత్యుడే అశ్వమనీ, ఆదిత్య మండలమే రథమనీ భావం. ఆదిత్య మండలమే వేద మండలమనీ, అది భూమండలానికి వెలుగును ఇస్తున్నదనీ కూడా అది చెప్పింది.
*బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః
సాయం ధ్యాయే మహా విష్ణుం, త్రయీ మూర్త దివాకరః
సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడు. సూర్యుడి జన్మతిథి మాఘ శుద్ధ సప్తమి. దీన్నే ‘రథ సప్తమి’ అని వ్యవహరిస్తారు. ఏడాదిలోని అన్ని సప్తముల కన్నా రథ సప్తమి అతి విశిష్టమైనది. అదితికి జన్మించడం వల్ల ‘ఆదిత్యుడ’నీ, కశ్యప మహర్షి కుమారుడు కాబట్టి ‘కాశ్యపేయుడ’నీ సూర్యుడికి పేర్లు. ‘సూర్య’ అనే పదానికి ‘సువతి ప్రేరయతి వ్యాపారేష్యితి సూర్యః’ అని వ్యుత్పత్తి. అంటే ‘అందరినీ వారి వారి కర్మలు చేయడానికి ప్రేరేపించేవాడు’ అని అర్థం. ‘రవి’ అని మరో పేరు. ‘స్తుతింపబడేవాడు’ అని భావం. జగత్తుకు చైతన్యస్ఫూర్తిని కలిగించేవాడు సూర్యనారాయణుడు. ఆయన జగదారాధ్యుడు.
‘ఆదిత్యశ్చ నమస్కారం యే కుర్వంతి దినే దినే/ జన్మాంతర సహస్రేషు దారిద్య్రం నోపజాయతే’ అని ఋషి వాణి. ఆదిత్యునికి నమస్కరిస్తే జన్మ జన్మాల పాపాలు పటాపంచలవుతాయన్నారు. ‘చక్షో సూర్యో అజాయతే’ అని మరో వాక్యం. ‘సాధారణ చక్షువులతో ఇతరులు చూడడానికి వీలుకానివాడ’ని అర్థం. భగవద్గీతలోని విభూతి యోగంలో ‘ఆదిత్యానాం మహా విష్ణుః’ అనీ, ‘జ్యోతిషాం రవి రంశుమాన్‌’ అనీ శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు. సూర్యుడు సాక్షాత్‌ నారాయణుడనీ, ప్రకాశించేవారందరిలో ప్రధానుడనీ ఆదిత్యుడి మహిమను తెలిపాడు. ‘ఆదిత్యం, అంబికాం, విష్ణు, గణనాథం చ, ఈశ్వరం’ అని శంకర భగవత్పాదులు ‘పంచాయతన’ అర్చనా విధానాన్ని ఏర్పరచి, ప్రభాకరుణ్ణి ప్రధానదైవంగా పేర్కొన్నారు.ఇతిహాసాలూ, పురాణాలూ ఉపనిషత్తులూ, ప్రధానంగా యజుర్వేదంలోని అక్ష్యుపనిషత్తు, సౌర, అరుణ మంత్రాలు ఆదిత్యుని మహిమను బహువిధాలుగా ప్రశంసించాయి. జగన్నియామక ఏకశక్తి సూర్యుడేనన్నారు ప్రాచీన ఋషులు. ఆ సూర్య శక్తిని తమ తపఃశక్తితో దర్శించిన ఋషులు యజ్ఞాగ్నిని సౌరశక్తిగా అభివర్ణించారు..
1.మోపిదేవి సుబ్రహ్మోత్సవాలు
ఆంధ్రప్రదేశ్‌ కృష్ణాజిల్లాలోని మోపిదేవిలో ప్రసిద్ధపు ణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిఏటా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో 5రోజులపాటు వైభవోపేతంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా మూడవరోజు రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు.
*కోరికలు తీర్చే కార్తికేయుడు
స్వామివారిని దర్శించుకున్న భక్తుల కోర్కెలు నెరవేరతాయని అచంచల విశ్వాసం. ముఖ్యంగా వివాహం కానివారు, సంతానం లేనివారు, ఆర్థికంగా ఇబ్బందులున్నవారు, శత్రుభయం వెంటాడుతున్నవారు, రాహు, కేతు, కుజ, సర్పదోషాలున్నవారిని స్వామివారు కొంగు బంగారమై ఆదుకుంటారు. పుట్టు వెంట్రుకలు, చెవిపోగులు, అన్నప్రాశన, నామకరణం, అక్షరాభ్యాసం, రుద్రాభిషేకాలు, నిత్యకళ్యాణం చేయించుకుంటారు.
*ముడుపుల మల్లి
ఆలయ ప్రాంగణంలో శతాబ్దాల నాటి నాగమల్లి వృక్షం ఉంది. నాగమల్లి వృక్షం పువ్వు వేయిపడగలతో లోపల లింగాకారంతో ప్రకాశిస్తుంది. ఏడాదికి రెండుసార్లు మాత్రమే పువ్వులు విచ్చుకుంటాయి. భక్తులు తమ కోర్కెలు తీర్చాలని కోరుతూ వృక్షానికి ముడుపులు కడతారు. పిల్లల కోసం మహిళలు ఊయలు కట్టి ఊపుతూ బిడ్డలను ప్రసాదించాలని కోరుకుంటారు.
*పుట్టలో పాలు పోసిన తర్వాతనే…
ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తొలుత పుట్టలో పాలుపోసిన తరువాతనే స్వామివారిని దర్శించుకోవడం విశేషం. పుట్ట కలుగు మోపిదేవి నుంచి దక్షిణకాశీ పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయం వరకు ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
*బ్రహ్మోత్సవ విశేషాలు
నేటి ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నిత్యహోమం, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలతో పూజలు సాయంత్రం 3.30 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన ‘శేష వాహనం’పై రావివారిపాలెం వరకు గ్రామోత్సవం 6.30 గంటలకు ఉత్సాహంగా ఎదురుకోలు ఉత్సవం ఉంటుంది. రాత్రి 8గంటలకు స్వామివారి దివ్య కళ్యాణమహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహిస్తారు. ఇచ్చట ముత్యాల తలంబ్రాలు వినియోగిస్తారు. అనంతరం ‘నందివాహనం’పై ఊరేగిస్తారు. 11వ తేదీ సోమవారం ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నిత్యహోమం, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలతో పూజలు, అనంతరం రాత్రి 8 గంటలకు మిరుమిట్లు గొలిపే విద్యుత్‌కాంతుల మధ్య ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఆసీనులైన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని గ్రామంలో ఊరేగిస్తారు. 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నిత్యహోమం, బలిహరణ, నీరాజనమంత్రపుష్పాలతో పూజలు, 9 గంటలకు వసంతోత్సవం, అవభృధస్నానోత్సవం, శ్రీ సుబ్రహ్మణ్యమాల దీక్షావిరమణ కార్యక్రమం, పూర్ణాహుతులు, అనంతరం స్వామివారి ప్రత్యేక వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. మద్యాహ్నం 3 గంటలకు వేద విద్వత్‌సభ–పండిత సభ నిర్వహించి పండితులను దేవస్థానం తరపున ఘనంగా సత్కరిస్తారు. రాత్రి 7 గంటలకు శమీవృక్షపూజ, రాత్రి 8 గంటలకు ‘మయూర వాహనం’పై స్వామివారిని రావివారిపాలెం వరకు గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం ధ్వజావరోహణ కార్యక్రమం ఉంటుంది. 13వ తేదీ బుధవారం ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నీరాజన మంత్రపుష్పాలతో పూజలు, 10 గంటలకు సుబ్రహ్మణ్య హవనం అనంతరం తీర్థప్రసాదాలు అందిస్తారు. రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షణలు, 8గంటలకు శ్రీస్వామివారి పుష్పశయ్యాలంకృత పర్యంక సేవతో కార్యక్రమాలు ముగిస్తారు.
*మాఘంలో ఎందుకంటే..?
సుమారు 100 సంవత్సరాల క్రితం మార్గశిర మాసంలోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఆ రోజుల్లో కురుస్తున్న భారీవర్షాలకు రథోత్సవానికి, స్వామివార్ల ఊరేగింపునకు అంతరాయం ఏర్పడటంతో నాటి జమిందారు ఆలయ ధర్మకర్త, ఆలయ ప్రధానార్చకులు బుద్దు రామమ్మూర్తి సంయుక్త నిర్ణయంతో మాఘ మాసానికి మార్పుచేశారు. మార్గశిర మాసంలో నిర్వహించే ఉత్సవాలను చిన్న పవిత్రోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. నాటి నుంచి శాస్త్రోక్తంగా మాఘమాసం శుక్లపక్షం చవితితో ప్రారంభించి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ఐదు రోజులపాటు నిర్వహించడం పరిపాటిగా మారింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com