Business

భారీగా పెరిగిన బంగారం-వాణిజ్యం

భారీగా పెరిగిన బంగారం-వాణిజ్యం

* బంగారం ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధానిలో 10గ్రాముల పసిడిపై రూ.881లు పెరగడంతో ధర రూ.44701గా ఉంది. నిన్న 10 గ్రాముల బంగారం రూ.43,820గా పలికింది. వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో వెండిపై రూ.1071లు పెరగడంతో దాని ధర 63,256కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1719 అమెరికా డాలర్లు, ఔన్సు వెండి ధర 24.48 డాలర్లుగా ట్రేడవుతోంది. మరోవైపు, పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.500లకు పైగా పెరగడంతో రూ.46,370(పన్నులతో కలిపి)గా ఉంది. అలాగే, కిలో వెండి ధర రూ.65,969గా ఉంది. ప్రపంచ మార్కెట్లో లోహధరలు పెరగడం వల్లే ధరలు పెరిగినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు బంగారంపై పెట్టుబడిని సురక్షితంగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ధరలు పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

* దేశీయ మార్కెట్లు ఆర్థిక సంవత్సరాన్ని (2021-22) లాభాలతో ప్రారంభించాయి. ఆర్థిక సంవత్సరం తొలిరోజైన గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు అదరగొట్టాయి. మెటల్‌, ఫైనాన్షియల్‌ షేర్ల అండతో భారీ లాభాలను అందుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ మళ్లీ 50 వేల మార్కును చేరుకుంది.

* కొత్త ఆర్థిక సంవత్సరం రానే వచ్చేసింది. నేటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవే కాకుండా పలు వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. దీని వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. నేటి నుంచి ధరలు పెరిగేవాటిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, కారు, బైక్ వంటివి ఉన్నాయి. అలాగే విమాన ప్రయాణ ఖర్చు కూడా పెరగనుంది. ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు తయారు చేసే కంపెనీలు, వాహన కంపెనీలు ముడి పదార్థాల ధరల పెరగడం చేత ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి.

* దేశవ్యాప్తంగా ఎల‌క్ట్రిక్ వాహానాల మీద రోజు రోజుకి ప్రజలకు ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న చమురు ధ‌ర‌లు ఇందుకు ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్ప‌టికే చాలా ఎల‌క్ట్రిక్ కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్న అవి ఇంకా సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు స్పీడ్ తక్కువగా వెళ్లడం లేదా ధర ఎక్కువగా ఉండటం చేత సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకొని సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఎల‌క్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే స్టార్టప్ సంస్థ తయారు చేస్తుంది‌. ప్యూర్ ఈవీ అనే సంస్థ హై స్పీడ్ మోటార్ స్కూటర్లను అందుబాటు ధరలో తయారు చేస్తుంది.

* గూగుల్ మీట్ తన ఉచిత అన్‌లిమిటెడ్ వీడియో కాల్‌ల సేవలను(24 గంటలు) జూన్ 2021 వరకు పొడిగించింది. గూగుల్ మీట్ ద్వారా వీడియో కాల్స్ చేసే జి-మెయిల్ వినియోగదారులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఇంతకముందు వరకు గూగుల్ మీట్ వీడియో కాల్స్ ఉచిత సేవలు 2021 మార్చి 31 వరకు మాత్రమే జి-మెయిల్ వినియోగదారులకు లభించేవి. ఈ పొడిగింపును గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించారు. 2020 కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఉద్యోగులు, విద్యార్థులు ఆన్లైన్ వీడియో వినియోగం పెరగడంతో గూగుల్ మీట్ పేరుతో కొత్త సేవలను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.