జనాభా ఎక్కువగా ఉన్న భారత్, చైనావంటి దేశాల్లో అడవులను కొట్టి వ్యవసాయం చేస్తుండటం వల్ల ఏటికేడు ప్రపంచంలో పచ్చదనం తగ్గిపోతోందని ఇప్పటివరకు భావించేవారు. అయితే ఇది తప్పు అని, గత 20ఏళ్లతో పోలిస్తే పచ్చదనం పెరిగిందని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా జరిపిన అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో పచ్చదనం పరిఢవిల్లడానికి మూడింట ఒకవంతు కారణం భారత్, చైనాలేనని తేల్చింది. భూగోళంపై తొమ్మిదిశాతం భూభాగాన్నే కలిగి ఉన్నప్పటికీ, వృక్షసంపదలో అగ్రభాగాన నిలిచాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన చి-చెన్ తెలిపారు. అధ్యయనం వివరాలు ‘‘నేచర్ సస్టెయినబిలిటీ’’ జర్నల్లో ఫిబ్రవరి 11న ప్రచురితమయ్యాయి. 2000-17 మధ్య ప్రపంచంలో పచ్చదనంపై నాసా ఉపగ్రహాల ద్వారా జరిపిన అధ్యయనంలో పంటభూముల విస్తీర్ణం పెరుగుతున్నట్లు స్పష్టమైంది. చైనాలో పచ్చదనానికి అడవులు 42శాతం, పంటభూములు 32శాతం కారణమైతే.. భారత్లో అడవులు 4.4శాతం, పంటభూములు 82శాతం కారణమని తేలింది. భూక్షయం, వాయుకాలుష్యం, వాతావరణ మార్పులను తగ్గించడానికి.. అడవుల సంరక్షణ, విస్తీర్ణం పెంపునకు చైనా అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2000నాటితో పోలిస్తే ఈ రెండు దేశాల్లో ఆహారోత్పత్తి 35శాతం పెరిగింది. ‘‘ప్రపంచం పచ్చగా కనిపిస్తే అదంతా వాతావరణంలోని మార్పుల కారణంగానే అని మొదట భావించాం. పచ్చదనానికి మానవుడు కూడా కృషి చేస్తున్నాడని నాసా ఉపగ్రహాల డేటాను విశ్లేషించాక తెలిసింది. సమస్య ఉందని తెలిస్తే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడం సహజం. 1970, 1980లలో భారత్, చైనాలలో వృక్షజాతి ఎక్కువగా తగ్గిపోయేది. 1990లో ఈ సమస్యను గుర్తించారు. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి.’’ అని అధ్యయనంలో పాల్గొన్న రామా నేమాని అనే శాస్త్రవేత్త తెలిపారు.