ప్రకాశం తెదేపాలో కీలకం కానున్న కరణం–రాజకీయ–02/13

* చీరాల బాధ్యతలు కరణం బలరాంకు అప్పగింత కార్యకర్తలు పార్టీని వీడకుండా చూడాలని ఆదేశంసార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఈ ఉదయం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించగానే, అలర్ట్ అయిన ఆయన, కరణం బలరాంకు అప్పగించారు. వెంటనే చీరాల తెలుగుదేశం నేతల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో, కరణం బలరాం హుటాహుటిన చీరాలకు బయలుదేరి వెళ్లారు.
వెంటనే సమావేశమై ఆమంచితో పాటు నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న ఆమంచి, లోటస్ పాండ్ లోని జగన్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు.
* జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్ కలిశారు. అనంతరం కృష్ణమోహన్ విలేకరులతో మాట్లాడుతూ… ఇవ్వాళ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్ లేదన్నారు. మంచిరోజు చూసుకుని నాతోపాటు నా అనుచరులు వైసీపీలో చేరతారన్నారు. అలాగే నేను తెలుగుదేశం పార్టీ నుంచి గెలవలేదు కాబట్టి.. రాజీనామా అవసరం రాదన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆయన వారసుడు.. జగన్.. అందుకే వైసీపీలో చేరుతున్నానన్నారు.
*తెదేపాకు ఆమంచి రాజీనామా
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ మేరకు లేఖ రాశారు. పార్టీకి సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. త్వరలో వైకాపాలో చేరనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో వైకాపా అధినేత జగన్‌ను కలిశారు. త్వరలో అధికారికంగా వైకాపాలో చేరతానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చీరాల వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సీనియర్‌ నేత కరణం బలరామ్‌ను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. దీంతో స్థానిక నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
* అన్నయ్యకు పెళ్లి కానందునే ..
కాంగ్రెస్‌ పార్టీలో ప్రధాని పదవి అనేది ‘జన్మతః’ దక్కుతుందంటూ భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా మంగళవారం గాంధీల కుటుంబం గురించి వ్యాఖ్యానించారు. ఆ కుటుంబంలో పుట్టిన వారికి తప్ప ఆ పార్టీ కార్యకర్త ఎవరూ కూడా కనీసం ఆ పదవి చేపట్టడం గురించి ఆలోచిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. రాహుల్‌గాంధీ వివాహితుడు కాదన్నారు. దాంతో, సోదరి ప్రియాంకా గాంధీ ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేశారన్నారు. భాజపాలో అయితే బూత్‌స్థాయి కార్యకర్త కూడా పార్టీలో ఉన్నత పదవిని అలంకరించవచ్చని అమిత్‌ షా అన్నారు.
*ఆ పైసలెక్కడివి?
ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. విచారణలో భాగంగా వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డిని మంగళవారం ఈడీ అధికారుల బృందం దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించింది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు గానూ నామినేటెడ్‌ తెరాస ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు, అప్పటి శాసన సభ్యుడు రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకోవడం, అవినీతి నిరోధక చట్టం కింద ఆయన్ని అరెస్టు చేయడం తెలిసిందే. 2015 మే, 31న జరిగిన ఈ ఘటనకు సంబంధించి అనిశా అధికారులు ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేశారు.
*ఈ వారమే విస్తరణ
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమమైంది. శాఖల పునర్‌ వ్యవస్థీకరణ, పాలన సంస్కరణలపై కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు శాఖల పునర్‌ వ్యవస్థీకరణ నివేదిక ఇచ్చారు. దీనిని పరిశీలించి, ముఖ్యమంత్రి మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. దీనికి అనుగుణంగా సత్వరమే ఉత్తర్వులు రానున్నాయి. శాఖల పునర్విభజన ప్రక్రియ జరిగినందున విస్తరణను సత్వరమే సీఎం చేపట్టే వీలుంది. పాతవారిని మినహాయించి ఎక్కువ స్థానాల్లో కొత్తవారిని మంత్రులుగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
*ఏ రాష్ట్రం కేసులు ఆ రాష్ట్రం హైకోర్టుకే
ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదలాయించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రిట్‌ అప్పీళ్లు, కోర్టు ధిక్కరణ, పునఃసమీక్ష పిటిషన్లు అన్నింటినీ వాటి పరిధిలోకి తీసుకురావాలని పేర్కొంది. రెండు రాష్ట్రాలకు చెందిన కేసులపై పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకునే అధికారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఉందని స్పష్టం చేసింది.
*ఏపీకి హోదా ఇప్పించండి
పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం అమలుచేసేలా చూడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గత నాలుగున్నరేళ్లలో వివిధ రాజ్యాంగ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు, జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలని కోరారు. సీఎం నేతృత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం మంగళవారం మధ్యాహ్నం ఏపీ భవన్‌ నుంచి కాలినడకన తరలివెళ్లి రాష్ట్రపతి భవన్‌లో కోవింద్‌ను కలిసి పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై 17 పేజీల వినతిపత్రాన్ని సమర్పించింది. పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు దీనికి తరలివచ్చారు. ప్రధానంగా ప్రత్యేక హోదా కోసం గళమెత్తారు.
*అనిల్‌కు దళారీగా ప్రధాని మోదీ
రఫేల్‌ ఒప్పందంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనిల్‌ అంబానీకి దళారీలా వ్యవహరించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి రక్షణ ఒప్పందం గురించి ముందే అంబానీకి చెప్పేశారని ఆరోపించారు. ఇది దేశద్రోహమని పేర్కొన్నారు. మోదీపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు.
*16 నియోజకవర్గాలు.. 60 సభలు
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో విజయ సాధన కోసం శాసనసభ ఎన్నికల మాదిరే విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 60 సభల్లో ఆయన పాల్గొనాలని భావిస్తున్నారు. ఎన్నికల కోసం పార్లమెంటరీ నియోజకవర్గంలోని శాసనసభ సెగ్మెంట్ల వారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలు శాసనసభ్యులు, మండలి సభ్యులకు అప్పగించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ మండల, గ్రామ, బూత్‌ స్థాయి ప్రచారంలో స్థానిక కమిటీలకు భాగస్వామ్యం కల్పించనున్నారు.
*ఐక్యంగా పనిచేద్దాం..రాహుల్‌ను ప్రధానిని చేద్దాం
రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన, రైతు రుణాల మాఫీ, గిట్టుబాటు ధర కల్పించడమే రాహుల్‌ ప్రధాన లక్ష్యాలని, ఎన్నికల్లో ఆయా అంశాలను ప్రచారం చేయాలని కోరారు. రాహుల్‌-మోదీకి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు దేశానికి, రాష్ట్రానికి చాలా కీలకమని, ప్రతి కార్యకర్త రెండు నెలలు కష్టపడి పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
*పనుల కోసం ఎవరైనా డబ్బులడిగితే చెప్పుతో కొట్టండి’
ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ‘ఇంటి దొంగల’పై మండిపడ్డారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఆయన ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుపొందుతారని భావించినా, ఓటమి అంచులదాకా వెళ్లారు. కొద్ది ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. ఫలితాల అనంతరం, తనకు ఎవరు వ్యతిరేకంగా పనిచేశారో విశ్లేషించుకున్నారు. ధర్మపురి ప్రాంతంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ సభలో కొందరిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్లను నమ్మితే ఇష్టానుసారం దోచుకున్నారన్నారు.
*కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌కు దరఖాస్తు గడువు పెంపు
కాంగ్రెస్‌ పార్టీ నుంచి పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయాలనుకునే ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఈనెల 10 నుంచి గాంధీభవన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఇప్పటివరకు 210 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు మొదట విధించిన గడువు మంగళవారంతో పూర్తయినా.. 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ఇంకా రెండు రోజులు గడువు ఉన్నందున ఆశావహుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మంగళవారం దాదాపు 80 మంది ఎంపీ టికెట్‌ కోసం గాంధీభవన్‌ ఇన్‌ఛార్జి కుమార్‌రావుకు దరఖాస్తులు సమర్పించారు.
*కాంగ్రెస్‌ కూడా మా కూటమిలో భాగమే
కాంగ్రెస్‌ కూడా ఎస్పీ-బీఎస్పీ కూటమిలో భాగమని ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆ పార్టీకి రెండు సీట్లు కేటాయించామని పరోక్షంగా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠి, రాయ్‌బరేలిలను ఉద్దేశించి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సంకీర్ణకూటమిని ఓడించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. లఖ్‌నవూలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే ప్రకటించారు.
*మార్చిలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిత్వాలకు సంబంధించి ఆశావహుల నుంచి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించవద్దని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) రాంలాల్‌ తెలంగాణ నేతలకు స్పష్టం చేశారు. నిర్దేశించిన పార్టీ కార్యక్రమాలు పూర్తి చేయాలని, మార్చి 2 తర్వాతే అభ్యర్థుల ఎంపికపై పార్టీ దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జులతో రాంలాల్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డితో పాటు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. అంతకుముందు బర్కత్‌పురలోని ఆరెస్సెస్‌ కార్యాలయానికి రాంలాల్‌ వెళ్లారు.
*నాకు టికెట్‌ ఇవ్వండి
వచ్చే సాధారణ ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి దింపే అంశంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) మంగళవారం చర్చించింది. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అధ్యక్షతన విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించింది. వడపోత కమిటీకి మార్గదర్శకాలిచ్చింది. ఏయే అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎలా వడబోయాలో సమావేశంలో చర్చించి ఖరారు చేశారు. 2009 ప్రజారాజ్యం పార్టీ అనుభవాల దృష్ట్యా ఎక్కడా డబ్బు అనే అంశానికి ప్రాధాన్యం లేకుండా నిబద్ధత, కష్టపడి పని చేసే తత్వం ఆధారంగానే అభ్యర్థిత్వాలు ఖరారు చేయాలని పవన్‌కల్యాణ్‌ చెప్పారు.
*తెదేపాలో చేరతా..
త్వరలో తెలుగుదేశంలో చేరనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసిన ఆయన మంగళవారం ఇక్కడి ఏపీభవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తెలుగుదేశం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. అందుకే తాను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని.. లోక్‌సభకు పోటీచేయమంటే చేస్తానన్నారు. 42 ఏళ్లు ఒకేపార్టీలో ఉన్నానని, అలాంటి పార్టీని వీడటం చిన్న విషయం కాదన్నారు.
*మళ్లీ ప్రధానిగా మోదీ ఎన్నిక దేశానికి అవసరం: కన్నా
మరోసారి దేశ ప్రధానిగా మోదీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన గుంటూరు జిల్లా అచ్చంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగలంతా ఒక వేదిక మీదకు చేరుకుంటున్నారని, దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారని ఆయన విమర్శించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం 126 పథకాలను ప్రారంభించి అమలుచేస్తుంటే ఆయా రాష్ట్రాలు వాటికి తమ సొంత పేర్లు పెట్టుకొని తమవే అంటున్నాయని కన్నా ఎద్దేవా చేశారు.
*రఫేల్‌ నిందితులను శిక్షించండి
రఫేల్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిజాలు దాస్తున్నందున సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. రఫేల్‌ వ్యవహారంలో నిందితులను శిక్షించాలన్నారు. సాంకేతిక అంశాలను దాయడంలో అర్ధం ఉందని… కేంద్రం వ్యయం లెక్కలు ఎందుకు చెప్పడంలేదో అర్థం కావడంలేదన్నారు.
*రామసుబ్బారెడ్డి రాజీనామా ఆమోదం
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాజీనామాను శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఆమోదించారు. జమ్మలమడుగులో తెదేపా తరఫున పోటీ విషయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య పార్టీ అధిష్ఠానం రాజీ కుదిర్చింది. ఇందులో భాగంగా రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.
* జగన్‌ గృహప్రవేశం వాయిదా
వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో చేయాలనుకున్న స్వగృహ ప్రవేశం వాయిదా పడింది. ఈ నెల 14న ఆయన గృహప్రవేశం చేయాలని ముందుగా నిర్ణయించారు. ఇప్పుడా కార్యక్రమం వాయిదా వేసుకున్నట్లు పార్టీ రాజకీయ కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జగన్‌ సోదరి షర్మిల దంపతులు జ్వరంతో బాధపడుతున్న కారణంగా గృహప్రవేశాన్ని వాయిదా వేసినట్లు మంగళవారం వైకాపా కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు బుధవారం ఒంగోలులో జరగాల్సిన ప్రకాశం జిల్లా సమర శంఖారావం సభనూ ఇప్పటికే వాయిదా వేశారు. మిగిలిన జిల్లాల సభల తేదీలను ఈ నెల 17న ఏలూరులో జరిగే బీసీ గర్జన తర్వాతనే ఖరారుచేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.
* నాకు టికెట్‌ ఇవ్వండి – తొలి దరఖాస్తు చేసుకున్న పవన్‌
వచ్చే సాధారణ ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి దింపే అంశంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) మంగళవారం చర్చించింది. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అధ్యక్షతన విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించింది. వడపోత కమిటీకి మార్గదర్శకాలిచ్చింది. ఏయే అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎలా వడబోయాలో సమావేశంలో చర్చించి ఖరారు చేశారు. 2009 ప్రజారాజ్యం పార్టీ అనుభవాల దృష్ట్యా ఎక్కడా డబ్బు అనే అంశానికి ప్రాధాన్యం లేకుండా నిబద్ధత, కష్టపడి పని చేసే తత్వం ఆధారంగానే అభ్యర్థిత్వాలు ఖరారు చేయాలని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. ఈ విషయంలో పార్టీ అధినేతగా తనకు కూడా మినహాయింపు లేదంటూ పవన్‌కల్యాణ్‌ తన బయోడేటాను వడపోత కమిటీకి తొలి దరఖాస్తుగా సమర్పించారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్‌, మాదాసు గంగాధరం, రావెల కిషోర్‌బాబు, తోట చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com