* మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు నిర్ణయించింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై అమేరకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లో ఈ విచారణ పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
* చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు జవాన్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన ఏడుగురు జవాన్ల కోసం రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బీజాపూర్ ఘటనకు ప్రధాన సూత్రధారైన హిడ్మాపై తెలంగాణ, చత్తీసగఢ్, ఒడిశా ప్రభుత్వాలు 50 లక్షల రివార్డు ప్రకటించాయి. ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళా మావోయిస్టును మడివి. వనజగా గుర్తించారు. ఆమె వద్ద నుంచి పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు, ఇన్సాస్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.
* ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. విజయనగరం పట్టణానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రౌతు జగదీశ్(27)కు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చేనెలలో జీవితభాగస్వామితో ఏడుఅడుగులు నడిచేందుకు సిద్ధమయ్యాడు. వచ్చేనెల వివాహం కానుండడంతో ఒకటి రెండు రోజుల్లో ఇంటికి రావాలనుకున్నాడు. అంతలోనే నక్సల్ దాడిలో ప్రాణాలను కోల్పోయాడు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.
గాజులరేగ ఎగువవీధికి చెందిన రౌతు సింహాచలం, రమణమ్మ దంపతులకు కుమారుడు జగదీశ్ డిగ్రీ వరకు చదివాడు. దేశ సేవలో తరించాలని తలచాడు. 2010లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. మంచి శరీరసౌష్టవం, చురుకుగా కదిలే నైజంతో కోబ్రాదళం లీడర్‌గా నియమితులయ్యాడు. వచ్చేనెలలో పెళ్లికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 22న వివాహం నిర్ణయించారు. పెళ్లి పనులు చూసుకునేందుకు ఈ నెల 5న ఇంటికి వస్తానని జగదీశ్ రెండురోజల కిందటే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పాడు. ఈలోగా ఘోరం జరిగిపోయింది.
* అనంతపురంలో దారుణ సంఘటన.పింఛన్ డబ్బులివ్వలేదని తండ్రినే చంపాడో కసాయి కుమారుడు.కూడేరు మండలం కళగల్లుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తి డబ్బులు కావాలంటూ తండ్రిని సతాయించేవాడు.ఈ క్రమంలో ఈనెల ఫించను డబ్బులు రాగానే మరోసారి డబ్బులు కావాలంటూ తండ్రిని అడిగాడు.అందుకు తండ్రి నిరాకరించడంతో బండరాయితో మోది చంపేశాడు.స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించిన పోలీసులు.