ఎండ తాపానికి తట్టుకోలేని మందుబాబులు ‘బీర్లు’లాగించేస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే రోజుకు లక్ష కేసుల చొప్పున దాదాపు 30 లక్షల కేసులు బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గత మూడు నెలల్లో మార్చి నెలలోనే ఎక్కువ సంఖ్యలో బీర్ల విక్రయాలు జరగ్గా, అదే స్థాయిలో లిక్కర్ కూడా అమ్ముడయింది. ఈ నెలలో 30 లక్షల కేసులకు పైగా మందు విక్రయం జరిగింది. అయితే, జనవరిలోనూ ఇదే స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినా, ఫిబ్రవరిలో కొంత తగ్గుముఖం పట్టాయి. మార్చిలో భారీగా బీర్ అమ్మకాలు పెరగడానికి మండుతున్న ఎండలే కారణమని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.27,288 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని మందుబాబులు లాగించేశారు. ఈ మూడు నెలల్లో జనవరిలో అత్యధికంగా మద్యం అమ్ముడుపోగా, ఫిబ్రవరిలో కొంత తగ్గింది. మళ్లీ మార్చిలో పుంజుకుంది. జనవరిలో రూ.2727.15 కోట్లు, ఫిబ్రవరిలో రూ.2,331.65 కోట్లు, మార్చి నెలలో రూ. 2,473.89 కోట్లు కలిపి మొత్తంగా రూ.7,532.69 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివర్లోకి రావడంతో వీలున్నంత మేర విక్రయాలు పెంచి ఆదాయాన్ని రాబట్టుకోవా లని ఎక్సైజ్ శాఖ.. అధికారులకు టార్గెట్లు విధించి మరీ వైన్‌షాపుల యజమానుల చేత ఇండెంట్లు పెట్టించారు. *అయితే, బీర్లకు మార్చిలో సాధారణంగానే గిరాకీ పెరిగిందని, 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బీర్లవైపే మందుబాబులు మొగ్గుచూపుతున్నారనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. ఇక, బీర్లు, లిక్కర్ వారీగా పరిశీలిస్తే.. జనవరిలో 33 లక్షల ఐఎంఎల్ కేసులు అమ్ముడుపోగా, 28 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరిలో 29 లక్షల కేసుల ఐఎంఎల్, 22 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. మార్చి నెలలో 30 లక్షల కేసుల లిక్కర్, 29.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. 2020–21లో మొత్తం 27,288.72 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 3.3 కోట్ల ఐఎంఎల్ కేసులు, 2.7 కోట్ల బీర్ కేసులు అమ్ముడుపోయాయి. అంటే రోజుకు సగటున 90వేలకు పైగా లిక్కర్ కేసులు, 74వేలకు పైగా కేసుల బీర్లను రాష్ట్రంలోని మందుబాబులు తాగేశారన్నమాట. రాష్ట్రంలో ఈ ఏడాది సగటున రోజుకు దాదాపు రూ.75 కోట్ల విలువైన మందు హుష్‌పటాక్ అయింది. మరి… మందుబాబులా… మజాకా…!
రోజుకు లక్ష కేసుల బీర్లు ఖాళీ
Related tags :