Fashion

మల్లెల్లో 40రకాలు

40 Types Of Jasmines Are Ready - Telugu Fashion News`

మల్లెల గుబాళింపు మాటలతో చెప్పవీల్లేనిది.. ఎంతటివారైనా వాటి పరిమళాలకు మైమరచిపోవాల్సిందే. మల్లె పేరు వింటేనే మనసు మురిసిపోతుంది. మల్లెల సువాసనలతో తనువు తేలిపోతుంది. మనిషిని మరిపించి మురిపించే మల్లెపువ్వుకు కవివర్యులు ఎప్పుడో పట్టంగట్టేసారు. తెలుగింట చైత్ర, వైశాఖమాసాల్లో జరిగే ప్రతీశుభకార్యాల్లోనూ మల్లెలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా అందరినీ పందిరిలా అల్లుకుపోయే మల్లెలు మగువలనే కాదు మనసున్న ప్రతీఒక్కరినీ కట్టిపడేస్తాయి.అందమైన అమ్మాయిధరహాసాన్ని, స్వచ్చమైన మనసును, మరుపురాని తీపిగుర్తులను, మంచుపలికే మౌనరాగాల్ని, తొలివలపు గిలిగింతల్ని తలపించే సుందర సుకుమార కుసుమాలే మల్లెలు. చిరుగాలుల తాకిడికి అల్లంతదూరంనుంచి తేలివచ్చే వాటి మధురమైన పరిమళం సోకగానే ముసలివాళ్లలొ సైతం మదిసన్నాయిగీతాలను ఆలపిస్తుంది. మోహనరాగాలను పలికిస్తుంది. మధురోహాలతో పులకిస్తుంది. వలపువాన ల్ని కురిపిస్తుంది. అదే మరుమల్లెల పరిమళాల గుబాళింపులో గొప్పదనం.
*కవులు ఏమంటారంటే..
మల్లెల గురించి వర్ణించని కవులు ఉండరనే చెప్పాలి. ఈ మల్లెలను చూసినా, పరిమళం తాకినా కవిత్వం పుట్టుకొస్తుంది. అనేక తెలుగు సినీగేయాలాపనలో ఈ మల్లెల గుబాళింపు అధికమే. ఇది మల్లెలవేళయనీ.. ఒకరు అందుకుంటే, మల్లెపందిరి నీడలోనా జాబిల్లి మరో భావకవి కలంనుంచి సాహితీసౌరభాలు కురిపించారు. మల్లియలో.. మల్లియలో.. మరదలుపిల్లో.. మల్లికా నవమల్లికా.. మల్లెపూలమారాణి.. అంటూ మల్లె ల సౌందర్యాన్ని ప్రేయసికి ఆపాదించి వాటిమీదున్న ప్రేమను చాటుకున్నారు మరికొందరు కవులు.
*వేసవిలో ప్రకృతి వరం
వేసవి వడగాల్పులు తెస్తుందని, ఉక్కపోతతో ఒంటికి చిరాకు పుట్టిస్తుందని బాధపడే వారందరికోసం ఈ మల్లెలు వరంగా మారుతుంటాయి. మండువేసవిలో మల్లెలే మనసును మురిపించే సాధనాలు. పగలంతా ఎండలో చెమటతో నరకంచూసే ప్రజలు సాయంత్రమయ్యేసరికి ఆ తెల్లనిపూలను, మైమరిపించే వాటి పరిమళాలను ఆస్వాదించి స్వర్గమంటే ఇదే కదా అనుకుంటారు. అంతటి మాయచేసే మల్లెలవేళ వచ్చేసింది. వేసవి అంటే మరుమల్లెలు ప్రకృతి అద్దిన మనోహరమైన పరిమళం మల్లె. నాలుగుమూరల మల్లెలు జడలో తురుముకోవడంతో ఉండే శోభ మరేపూలతోనూ సాధ్యంకాదు. అందుకే ఈ సీజన్‌ ఉన్నంతకాలం మహిళలు హడావుడి పడతారు. వీటిని రకరకాలుగా సింగారించుకోవడానికి ఉత్సాహపడతారు. మార్చినుంచి జూన్‌వరకు ఈ మల్లెలు దిగుబడినిస్తాయి.
*రూ.కోట్లలో అమ్మకాలు
వేసవి ప్రసాదించే ఈ మల్లెలు కోస్తాజిల్లాలతోపాటు రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లోనూ గుబాళి స్తుంటాయి. అయితే నర్సరీరంగంలో ప్రసిద్దిగాంచిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతర్‌రాష్ట్ర పూల మార్కెట్‌ద్వారా వీటి అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. వీటికి ధర ఎప్పుడు ఎలా పెరుగుతుందో చెప్పడం కష్టం. మోజుతో కూడుకున్న బేరం ఇది. అప్పుడే కిలో రూ.2వేలు పలుకుతుంది. అంతలోనే రూ.500లకు పడిపోతుంది. ఎలాంటి ముహూర్తాలు లేకపోతే మల్లెలు కిలో పాతిక ముప్పై రూపాయలకు దొరికేస్తాయి. ఈ పువ్వులు ఎక్కువ సమయం నిల్వ ఉండనందున కోసిన వెంటనే విక్రయాలు సాగిస్తుంటారు. అయితే పలు రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో మల్లెలనుంచి అత్తర్లు, అగర్‌బత్తీలు, షాంపూలు, పౌడర్‌లువంటివి తయారుచేసి విక్రయిస్తుంటారు.
*నలభైరకాల మల్లెలు
మల్లెల్లో నలభై రకాలవరకు ఉంటాయి. అయితే మన రాష్ట్రంలో అధికంగా పందిరిమల్లె, తుప్పమల్లె, జాజిమల్లి, కాగడామల్లె, నిత్యమల్లెవంటివాటిని విరివిగా సాగుచేస్తుంటారు. ఎంత పరిమళభరితమైన మల్లెలకైనా జీవితకాలం కొద్దిగంటలే కావడంతో రైతులకు ఒక్కొక్కసారి సేదపరిమళాలే మిగులుతాయి. మనసును మరులగొలిపే మల్లెలు కొందరికి ఆనందాన్ని, మరికొందరికి ఆహ్లాదాన్ని కల్గించినా మొగ్గను మల్లెగా చేసే రైతులకు మాత్రం కొన్నిసందర్భాల్లో తీవ్రనష్టాలు తెచ్చిపెడుతుంటాయి. కొద్దిసేపు గుబాళించి వాడిపోయే ఈ మల్లెలు కొన్నిసమయాల్లో సిరులపంట కురిపి స్తుంటాయి. ఆ ఆశతోనే రైతులు వీటిని సాగుచేయడానికి ముందుకొస్తారు. అయితే వీటిని కోయడానికి కూలీలు అధికసంఖ్యలో అవసరం ఉంటుంది. అందుకనే కోతకూలీ అధికమవుతుందని కొందరు రైతులు మల్లెలను సాగుచేయడానికి వెనకాడాల్సివస్తుంది.