Food

హైదరాబాద్‌లో ఖర్జూర పండుగ

హైదరాబాద్‌లో ఖర్జూర పండుగ

రంజాన్‌ అనగానే గుర్తుకుచ్చేది ఖర్జూరం. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసంలో ప్రతిరోజూ ఈ పండు తిననివారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలు.. ఖర్జూరం పండుతోనే దీక్ష విరమణ చేస్తారు. అలాంటి ఈ పండ్లకు నగరం కేరాఫ్‌గా నిలుస్తోంది. మరో వారం రోజుల్లో రంజాన్‌ సీజన్‌ మొదలు కానుండటంతో ఖర్జూరం పండ్ల స్టాక్‌ నగరానికి పోటెత్తింది. విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ పండ్ల వ్యాపారం కేవలం వారం రోజుల్లో నగరంలోనే సుమారు రూ.500 కోట్ల మేర సాగిందంటే ఈ పండ్లకు ఉన్న డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు. గతేడాది కరోనా, లాక్‌డౌన్‌తో ఖర్జూరం విక్రయాలు అంతగా సాగలేదు. ఈ ఏడాది పండ్ల వ్యాపారం ఊపందుకుంటుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కరోనా పంజా విసురుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తున్నా.. మునుపటిలా వ్యాపారం పడిపోదనే ధీమా వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
వివిధ దేశాల నుంచి దిగుమతి : అరబ్బు దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, తూనిషీయా, అల్‌జిరీయా తదితర దేశాల ఖర్జూరాలకు డిమాండ్‌ ఉంటుంది. ఇరానీ కప్‌కప్, ఇరానీ ఫనాకజర్, బాందా ఖర్జూర్‌ ప్రసుత్తం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఖర్జూరం కిలో రూ.150 నుంచి రూ.650 వరకు విలువ చేసే రకాలు మార్కెట్‌లో ఉన్నాయి.