Politics

జనసేనపై అసూయతోనే దాడులు

జనసేనపై అసూయతోనే దాడులు

ఎన్నికల్లో బలమైన పోటీగా నిలిచారనే రాజకీయ కక్షతోనే జనసేన నాయకులు, మహిళ కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన నేతలు దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, అత్యంత హేయకరమైన చర్య అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన నేతలపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఆయన గురువారం ఒక ప్రకటన చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగమని, తమకు ఎదురు నిలబడకూడదనే వైసీపీ వాళ్ళ ధోరణి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.
అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గంలోని రేగాటిపల్లిలో జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గం దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ గ్రామంలో చిలకం ఛాయాదేవి ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరిస్తుంటే అధికార పార్టీ బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. ఎస్సీ వర్గానికి చెందినవారిని దుర్భాషలాడి, దాడి చేయడం వైసీపీ అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని, దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ హడావిడిగా, తప్పుల తడకగా నిర్వర్తిస్తోందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు