Politics

కేసీఆర్ సర్కార్ సూపర్ నిర్ణయం-తాజావార్తలు

కేసీఆర్ సర్కార్ సూపర్ నిర్ణయం-తాజావార్తలు

* కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మాస్క్‌ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సూచించింది. జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రజా రవాణా, కార్యాలయాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నుంచి రక్షణ పొందేందుకు మాస్కులు పెట్టుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. యువత మాస్క్‌ లేకుండా తిరుగుతున్నారు. మాస్క్‌ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని.. అప్పటికీ వినిపించుకోకుంటే అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ హెచ్చరికలన్నీ కాగితాలకే పరిమితం కావడంతో కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా జరిమానా విధించాలనే నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నపిల్లలు, యువత తప్పనిసరి మాస్కు ధరించాలని, పదేళ్లలోపు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

* దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమిడెసివిర్‌ ఔషధం ఎగుమతులపై నిషేధం విధించింది. ఔషధ నిల్వల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని.. రెమిడెసివిర్ నల్ల బజారుకు తరలకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

* ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 31,719 నమూనాలను పరీక్షించగా 3,495 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 719, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,25,401కి చేరింది.

* చైనా కరోనా నిరోధక టీకాలపై తొలి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు ఎట్టకేలకు నిజమయ్యాయి. తమ టీకాల డొల్లతనాన్ని ఆ దేశ ఉన్నతాధికారే స్వయంగా బయటపెట్టారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం చైనా టీకాలకు తక్కువేనని కుండబద్దలు కొట్టారు. దీంతో తమ దేశంలో అభివృద్ధి చేసిన రెండు టీకాలను కలగలిపి.. వాటి సామర్థ్యాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని చైనా ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌-సీడీసీ’ గావో ఫూ తెలిపారు.

* రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆధీనం నుంచి దేవాలయాలను తొలగించటం, తిరుపతి లోక్‌సభ పరిధిలో మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో పాటు పలు అంశాలతో కూడిన ప్రత్యేక మేనిఫెస్టోను భాజపా-జనసేన కూటమి విడుదల చేసింది. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన భాజపా-జనసేన సంయుక్త మీడియా సమావేశంలో లోక్‌సభ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఇరుపార్టీలు ప్రకటించాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై మేనిఫెస్టోను విడుదల చేశారు.

* నేటి సాయంత్రం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఈ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ తన ట్విటర్‌లో మీరూ.. మేమూ.. మనమందరం కలిస్తే.. ఆరెంజ్‌ ఆర్మీ.. అంటూ తెలుగులో ట్వీట్‌ చేసింది. ఆరుసార్లు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళాం.. ఎనిమిది సీజన్లలో నాలుగుసార్లు ఆరెంజ్‌ క్యాప్‌ మా జట్టుకే దక్కింది.. పర్పుల్‌ క్యాప్‌ కూడా రెండుసార్లు మాకే వచ్చింది.. ఈసారి టైటిల్‌ నెగ్గాల్సిందే.. వన్‌ టీం.. వన్‌ డ్రీమ్‌.. అంటూ జ్ఞాపకాల వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.

* జనం ప్రశ్నిస్తారనే సీఎం జగన్‌ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని భాజపా విమర్శించింది. కరోనా పేరుతో జగన్‌ ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ విమర్శించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తుపై ప్రశ్నించిన ఆయన కూతురు సునీతపై కేసు పెట్టగలరా అని నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు నాయుడుపేట బహిరంగ సభలో పాల్గొంటారని సీఎం రమేశ్‌ తెలిపారు.

* తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు తదుపరి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

* ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద తిరునాళ్లలో పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది. స్వామివారి కల్యాణోత్సవాలు పురస్కరించుకుని ఈ ఆలయం వద్ద 20 రోజులపాటు పెద్ద ఎత్తున తీర్థం జరుగుతుంది. ఏటా కల్యాణోత్సవాల నెలరోజులు ఇక్కడ మసాలాదినుసులు, సుగంధద్రవ్యాల అమ్మకాలు జరుగుతాయి. ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుంచి కొత్తఅమావాస్య వరకు వివిధ ప్రాంతాల వ్యాపారులు ఇక్కడ తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసి మసాలా దినుసులు విక్రయిస్తున్నారు.

* రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా తన వెన్నెముకకు గాయమైందని ఓ వ్యక్తి చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవవడంతో బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్‌కు చెందిన వంగల వినయ్‌ గత ఏడాది డిసెంబర్‌ 3న జాతీయ రహదారిపై తన ద్విచక్ర వాహనంపై మియాపూర్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వైపు వెళ్తున్నారు.

* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో కూలీలకు, అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌కు మధ్య వాగ్వాదం ‌జరిగింది. మహరాష్ట్ర నుండి వచ్చే కూలీలను నియంత్రణ చేయాలని.. అందులో భాగంగా కూలీలు రాకుండా రాకపోకలు నిలిపివేయాలని కూలీలు డిమాండ్‌ చేశారు. మహరాష్ట్ర నుండి వస్తున్న వందల ‌మంది కూలీల రాకతో ఆదిలాబాద్‌లో కరోనా విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహరాష్ట్ర నుండి వచ్చే కూలీలను అడ్డుకుంటామని హమీ ఇవ్వాలంటూ కూలీలు.. అడిషనల్ కలెక్టర్‌ను నిలదీశారు. దీనిపై ఆయన కూలీలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేక వెనుదిరిగారు.