Editorials

ఓటమి ఎరుగని కింజరపు కుటుంబం

Kinjarapu family from Srikakulam captures victory in all contesting seats-tnilive political editorials

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రమంతా ‘ఫ్యాన్‌’ గాలులు బలంగా వీయడంతో ఆ పార్టీ ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అధికార తెదేపా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేవలం 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాష్ట్రంలో తెదేపా ఓటమిపాలైనా.. కింజరాపు కుటుంబం నుంచి పోటీ చేసిన ముగ్గురూ విజయం సాధించారు. దివంగత నేత ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్‌ నాయుడు, కుమార్తె భవానీ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి అచ్చెన్నాయుడు రెండోసారి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన పేరాడ తిలక్‌పై 8,857 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. తొలి రౌండ్లలో వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో ఉండటంతో అచ్చెన్న గెలుపుపై అనుమానాలు ఏర్పడినా చివరి రౌండ్లలో వచ్చిన ఓట్లతో ఆయన మంచి విజయాన్ని నమోదు చేశారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో టెక్కలి, ఇచ్ఛాపురంలలో మాత్రమే తెదేపా గెలుపొందింది. ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653 ఓట్ల మెజారిటీతో రామ్మోహన్‌ గెలుపొందారు. ఆరంభం నుంచే తెదేపా, వైకాపాల మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. ఓ దశలో విజయం ఇద్దరి మధ్యా దోబూచులాడింది. పోస్టల్‌ బ్యాలెట్లలోనూ పోటీ కొనసాగడంతో ఎవరు విజయం సాధిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత తెదేపా అభ్యర్థి రామ్మోహన్‌నాయుడే విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో ఆ ఉత్కంఠకు తెరపడింది. రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రన్నాయుడి కుమార్తె, సీనియర్‌ నేత ఆదిరెడ్డి అప్పారావు కోడలు భవాని భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తొలినుంచీ ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చిన ఆమె.. వైకాపా అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై 30,065 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే భవాని విజయం సాధించడం విశేషం.