Politics

శ్రీదేవికి కరోనా. షర్మిలకు అనుమతి-తాజావార్తలు

శ్రీదేవికి కరోనా. షర్మిలకు అనుమతి-తాజావార్తలు

* తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్.– హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స – వైరస్ సోకినా అశ్రద్ధ చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్య తీవ్రం – శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంవో నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ.

* హైదరాబాద్‌ నగరంలోని ఇందిరాపార్కు వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టడానికి పోలీసులు అనుమతిచ్చారు. మూడు రోజులు అనుమతి ఇవ్వాలని షర్మిల కోరగా.. పోలీసులు ఒక్కరోజు దీక్షకే అనుమతి ఇచ్చారు. దీంతో యువతకు ఉద్యోగాల కల్పించాలని కోరుతూ రేపు షర్మిల దీక్ష చేపట్టనున్నారు. రేపు ఉ.10 నుంచి సా.5 గంటల వరకు దీక్ష చేపట్టేందుకు అనుమతి లభించింది. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఇటీవల నిర్వహించిన ఖమ్మం సభలో షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే

* మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుండటంతో అక్కడి సర్కారు 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రరాజధాని ముంబయి మహానగరంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పనులు చేస్తున్న వాళ్లు సొంతూళ్ల బాటపట్టారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి.

* దేశంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 1.5 లక్షలకు పైగా కొత్త కేసులతో మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. తాజాగా రికార్డు స్థాయిలో 1,84,372 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అగ్రదేశం అమెరికా తర్వాత ఈ స్థాయిలో రోజూవారీ కేసులు బయటపడింది మన దేశంలోనే. అమెరికాలో జనవరి 8న 3.09 లక్షల మందికి కరోనా సోకింది. ఇదే ఇప్పటి వరకూ అత్యధికం. ఇప్పుడు భారత్ కూడా రెండు లక్షల మార్కు దిశగా పయనిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే దాదాపు 178 రోజుల తర్వాత రోజుకి వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి.

* నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి చేసింది శూన్యమని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. 30 ఏళ్ల అనుభవమున్న జానారెడ్డి.. నియోజకవర్గంలోని హాలియాకు డిగ్రీ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా పరిధిలోని అనుములలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణతితో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.

* ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఘనంగా సాగుతున్న కుంభమేళాను నేటితో ముగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఈ కుంభమేళా నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తడం, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మతపెద్దలతో చర్చించి తర్వాత నేటితో ముగించాలని భావిస్తున్నట్లు సమాచారం.

* కరోనా మొదటి వేవ్‌కు రెండో వేవ్‌కు చాలా తేడా ఉందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మొదటి వేవ్‌లో 20 శాతం మంది ఆస్పత్రుల్లో చేరితే.. రెండో వేవ్‌లో 95 శాతం మంది బాధితులకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కొవిడ్‌ కేసుల పెరుగుదల దృష్ట్యా ఇవాళ హైదరాబాద్‌లోని టిమ్స్‌, గాంధీ, కింగ్‌ కోఠి ఆస్పత్రులను ఈటల సందర్శించారు. ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, ఏర్పాట్లు, సిబ్బంది, ఔషధాల లభ్యతను మంత్రి పరిశీలించారు. అనంతరం రాష్ట్రంలోని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికిపైగా కొవిడ్‌కు వాడుతున్నామని వెల్లడించారు. సీరియస్‌ కేసులు వస్తే ప్రైవేటు ఆస్పత్రులు గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ సమయంలో ఎవరూ ధర్నాలు చేయొద్దని.. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమ కుటుంబానికి సంబంధం లేదంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసే ప్రమాణాలకు అర్థం లేదని మంత్రి కన్నబాబు అన్నారు. ఆ హత్య కేసును సీఎం జగన్‌.. సీబీఐకి అప్పగించిన విషయం తెలియదా? సీబీఐ దర్యాప్తు చేపట్టినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా? అని లోకేశ్‌ను మంత్రి ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు.

* తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను భాజపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా అచ్చంపేటలో కేటీఆర్‌ వాహన శ్రేణిని భాజపా యువమోర్చా నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్యోగాలకు నోటిపికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* ఏపీలో కౌలు రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు మెట్టప్రాంతంలో స్వయంగా తానే కౌలుకు వ్యవసాయం చేస్తున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం అరుణాచలం ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ధర్మవరం గ్రామానికి చెందిన చెక్కపల్లి సత్యబాబు అనే రైతు వద్ద పదెకరాల భూమిని కౌలుకు తీసుకొని ఏరువాక సాగించారు. అంతకు ముందు మాజీ మంత్రి ముద్రగడను కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.