Health

కరోనా కొత్త లక్షణాలు వచ్చాయి-తాజావార్తలు

New COVID Symptoms Are Here

* కరోనా సెకండ్ వేవ్ లో కరోనా రోగుల్లో కొత్త లక్షణాలను వైద్య నిపుణులు గుర్తించారు. కొందరిలో కడుపునొప్పి, తలతిరుగుడు, వాంతులు, కీళ్ల నొప్పులు, మయాల్జియా, జీర్ణసంబంధ సమస్యలు, ఆకలి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించాయి.ఇక పింక్ ఐస్‌, వినికిడి లోపం,జీర్ణసంబంధ సమస్యలు, విపరీతమైన నీరసం కూడా కరోనా స్ట్రెయిన్ కొత్త రకం లక్షణాలు అయ్యే అవకాశం ఉన్నందున కరోనా టెస్టు చేయించుకోవడం ఉత్తమం అని వైద్యులు సలహానిస్తున్నారు. కొందరు కరోనా రోగుల్లో కళ్లు ఎర్రబడి, నీరు కారే ‘పింక్‌ ఐస్‌’ లక్షణం కనిపిస్తోంది. ఒకటి లేదా రెండు చెవుల్లో గంట మోగుతున్న శబ్దం వినిపించడం టిన్నిటస్‌ అనే చెవి(వినికిడి లోపం) సమస్య కూడా కరోనా కొత్త లక్షణం కావచ్చు.కాబట్టి ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.

* రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బీఆర్కే భవన్‌లో ఆయా శాఖ‌ల‌ అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత సీఎస్ సోమేశ్ కుమార్ తొలిసారిగా ఈ స‌మీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష సంద‌ర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. కొవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో బెడ్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్ధితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాలని, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు పాటించేలా నిబంధనల అమలుకు కృషిచేయాలని ఆదేశించారు. ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని, కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

* ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించి.. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటల వరకు వైఎస్‌ షర్మిల దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవటం లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని.. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైఎస్‌ షర్మిల వెల్లడించారు.

* నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు తధ్యమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సాగర్‌లో సీఎం కేసీఆర్, పోలీస్, మనీ, లిక్కర్ పవర్‌ను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. వాటిని నియంత్రించడంలోఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల పక్షాన జానారెడ్డి వాయిస్ అసెంబ్లీలో ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జానారెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపు ఇచ్చారు. మానవతా రాయ్‌ని పోలీస్‌లు అరెస్ట్ చేసి హింసించడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసులు ముఖ్యమంత్రికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

* తెలంగాణ‌లో మినీ పుర‌పోరుకు స‌ర్వం సిద్ధ‌మైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్లు, అచ్చంపేట‌, సిద్దిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. రేప‌ట్నుంచి ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. 19న అభ్య‌ర్థుల నామినేష‌న్ ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రితేదీ ఈ నెల 22.ఆ మూడు మున్సిపాలిటీల‌కు చైర్‌ప‌ర్స‌న్ల రిజర్వేష‌న్లు ఖ‌రారుజ‌డ్చ‌ర్ల‌, న‌కిరేక‌ల్, కొత్తూరు చైర్‌ప‌ర్స‌న్ల రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు అయ్యాయి. జ‌డ్చ‌ర్ల – బీసీ మ‌హిళ‌, న‌కిరేక‌ల్ – బీసీ జ‌న‌ర‌ల్, కొత్తూరు – జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు కేటాయించారు. రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో అధికారులు లాట‌రీ తీశారు. ఇక వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌తో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి రిజ‌ర్వేష‌న్ల జాబితాను సంబంధిత అధికారులు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

* ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదుకాగా.. మహమ్మారికి చిక్కి నిన్న ఒక్కరోజే 14మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 9,42,135కి చేరగా.. మరణాల సంఖ్య 7,353కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24గంటల్లో 1,745 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 9,03,072 మంది ఆరోగ్యవంతులయ్యారు. బుధవారం 35,741 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం కొవిడ్‌ సమాచారాన్ని విడుదల చేసింది.

* కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. ముంబయి మహానగరంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పనులు చేస్తున్న వాళ్లు సొంతూళ్లు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దింతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. లోక్‌మన్య తిలక్ టెర్మినస్ వెలుపల చాలా మంది రైళ్లలో ఎక్కడానికి గుమిగూడారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు అక్కడకు చేరుకోవడంతో రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లోక్‌మన్య తిలక్ టెర్మినస్(ఎల్టిటి) వెలుపల అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. అత్యవసర సేవలు మినయించి బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉంటాయి.

* రాజ్యాంగ రూపశిల్పి బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ.. తాము త్వరలో ప్రారంభించనున్న డిజిటల్‌ టీవీ ప్లాట్‌ఫామ్‌ ‘ఐఎన్‌సీ టీవీ’కి సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 24న పార్టీ చానెల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ చానెల్‌ ద్వారా తమ పార్టీ సమాచారాన్ని నేరుగా ప్రజలకు తెలియ జేయవచ్చని భావిస్తోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు గొంతుకను వినిపించే తమ చానెల్‌ను పంచాయతీ రాజ్‌ రోజున విడుదల చేస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలాలు ఉమ్మడి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అందులో రోజూ దాదాపు 8 గంటల పాటు లైవ్‌ ప్రోగ్రామ్స్‌ ఉంటాయని తెలిపారు. మొదటగా ఆంగ్లం, హిందీ భాషల్లో చానెల్‌ ప్రసారమవుతుందని, అనంతరం స్థానిక భాషల్లో కూడా అందు బాటులోకి తెస్తామన్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 1,06,627 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 3,307 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఎనిమిది మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,788కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 897 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,08,396కి చేరింది. ప్రస్తుతం 27,861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 18,685 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 446 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,13,60,001కి చేరింది.

* భారత్‌లో కరోనా ఉగ్రరూపం ధరించి కల్లోలం సృష్టిస్తోంది. భారీగా ప్రాణాలను హరిస్తోంది. బుధవారం రెండు లక్షలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవించాయని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.