అవ్వరే జవ్వాయి…అదిరేటి బొప్పాయి

ఆపిల్‌ రంగు, మామిడి రుచి, దానిమ్మ అందం… ఏమున్నాయని బొప్పాయి పండుని తినాలీ అని అడిగేవాళ్లు కొందరు… కోస్తే తెలుస్తుంది దాని రంగేమిటో, తింటే తెలుస్తుంది ఆ రుచేమిటో అంటూ సమాధానమిచ్చేవాళ్లు మరికొందరు. ఎవరు ఏమనుకున్నా బొప్పాయి మాత్రం అద్భుత ఔషధగుణాలున్న దేవతాఫలం అంటారు పోషకాహార నిపుణులు.
ఓ పదేళ్లు వెనక్కి వెళితే… పెరట్లోని బొప్పాయి చెట్టుని చూస్తే చాలామందికి చిన్నచూపు. దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదుగానీ మార్కెట్‌కి వెళ్లి రకరకాల పండ్లు కొనుక్కొచ్చుకునేవారు. అయితే పండ్లన్నింటిలోనూ ఉండే ఔషధగుణాలు బొప్పాయిలోనూ ఉంటాయనీ నిజం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉంటాయనీ ఆనోటా ఈనోటా అందరికీ తెలియడంతో ఇప్పుడు బొప్పాయి సైతం మార్కెట్లో రంగురంగుల్లో అందంగా కనువిందు చేస్తోంది. ఒకప్పటిలా చేతిలో ఇమిడిపోయే సైజులో కాకుండా హైబ్రిడ్‌ పరిజ్ఞానంతో పొడవాటి సొరకాయల్లా గుండ్రని పుచ్చకాయల్లా విభిన్న ఆకారాల్లోనూ దొరుకుతోంది. అందానికీ ఆరోగ్యానికీ మంచిదని తెలియడంతో అంతా ఇష్టంగానో కష్టంగానో ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు.
**బొప్పాయి… రకాలెన్నో..!
బొప్పాయి కూడా దక్షిణ అమెరికా నుంచే నలుదిక్కులా విస్తరించింది. దేవతాఫలం పేరుతో కొలంబస్‌ దీన్ని ఐరోపావాసులకి పరిచయం చేశాడట. మనదగ్గర కూడా దీన్ని పరమాత్ముని కాయ, పరందపు కాయ అని పిలుస్తారు. సాధారణంగా బొప్పాయిలో ఎరుపు లేదా నారింజ రంగు గుజ్జులో ఉండేవీ, పసుపు రంగు గుజ్జుతో ఉండేవీ కనిపిస్తాయి. ఇవికాక నొక్కులుగా ఉండే కొండ బొప్పాయి రకం, ఆకుపచ్చ తొక్కతోనే ఎర్రని గుజ్జుతో ఉండే గ్రీన్‌ పపాయ రకం కూడా ఉన్నాయి. ఇవి కాకుండా హెబ్రిడ్‌ రకాలెన్నో. వీటిల్లో వాస్కోన్సెల్లియా రకం చిన్నసైజు కోలాకారపు దోసకాయలా ఉంటుంది. అలాగే సన్నగా పొడవుగా నేతిబీరకాయల్ని పోలిన బొప్పాయీ ఉంది. జన్యుపరంగా మార్చిన బబాకా బొప్పాయి రకాన్ని చాలాచోట్ల పండిస్తున్నారు. హవాయ్‌ దీవుల్లో పండించేవన్నీ జన్యుమార్పు చేసినవే. ఈ జన్యుపరివర్తిత రకాలన్నింటిలోకీ కారికా పపాయా అనే థాయ్‌ రకం ఎర్రని ఎరుపుతో చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటుంది. బొప్పాయి కాయమీద గోరు గుచ్చినా కాండంమీద గాటుపెట్టినా పాలు వస్తుంటాయి. చెట్టులోని అన్ని భాగాల్లోనూ ఉండే పపైన్‌ అనే ఎంజైమే ఇందుకు కారణం. ఇది శక్తిమంతమైన ఎంజైమ్‌. ప్రొటీన్లను జీర్ణం చేయడంలోనూ మాంసాహారాన్ని ఆరోగ్యకరమైన పీచుగా మార్చడంలోనూ దీన్ని మించింది లేదు. అందుకే మటన్‌, చికెన్‌ వండేటప్పుడు అవి ఉడికేందుకూ పచ్చిబొప్పాయిని వాడుతుంటారు. దీంతో కూరల్నీ చేస్తారు. సలాడ్లు, స్వీట్ల తయారీలోనూ వాడతారు. గింజల్ని మిరియాలకు బదులుగానూ వాడుతుంటారు.
**ఏమున్నాయందులో..!
కెరోటినాయిడ్లూ, పాలీఫినాల్సూ, విటమిన్లూ బొప్పాయిలో పుష్కలంగా లభించడంతో ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కణజాలాల పనితీరుకీ తోడ్పడుతుంది. క్యాలరీలు తక్కువ కాబట్టి ఊబకాయులకి మంచి ఫలహారం.
* బొప్పాయిలో పుష్కలంగా ఉండే విటమిన్‌-ఎ కారణంగా దీన్ని క్రమం తప్పక తినేవాళ్లలో చర్మం మెరుపుని సంతరించుకోవడంతోబాటు శిరోజాల పెరుగుదలా బాగుంటుంది. బొప్పాయిగుజ్జుని ముఖానికీ ఒంటికీ రుద్దితే చర్మంమీద పేరుకున్న మలినాలన్నీ తొలగిపోతాయి. ఎండకు కమిలిన చర్మం తిరిగి తేజోవంతమవుతుంది. ఇందులోని లైకోపీన్‌ ముడతల్ని తగ్గిస్తుంది. ఇది మంచి క్లెన్సింగ్‌ లోషన్‌. అందుకే బొప్పాయిని ఫేస్‌ప్యాకులూ సబ్బులూ క్రీముల్లో వాడుతుంటారు.
* బొప్పాయి కళ్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని జియాక్సాంథిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ అతినీలలోహిత కాంతిని కళ్లకు చేరకుండా కాపాడుతుంది. క్రమం తప్పకుండా దీన్ని తినేవాళ్లలో వయసుతోపాటు వచ్చే కండరాల క్షీణత తగ్గుతుంది.
* బొప్పాయిలోని బీటా కెరోటిన్‌ ఆస్తమానీ; ప్రొస్టేట్‌, కోలన్‌ క్యాన్సర్లనీ నిరోధిస్తుంది.
* బొప్పాయిలోని పీచు మధుమేహులకి మంచిది. మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది. ముఖ్యంగా పచ్చిబొప్పాయిలోని పోషకాలకి కొలెస్ట్రాల్‌ తగ్గడంతోబాటు మధుమేహం నియంత్రణలో ఉంటుందని మారిషస్‌ నిపుణుల పరిశోధనల్లో స్పష్టమైందట. ఈ పీచు మొలల్నీ రానివ్వదు. దీన్ని తినడంవల్ల ఫ్లూ, చెవినొప్పి, జలుబూ తగ్గుతాయి.
* ఇది ఆకలిని పుట్టించి నాలుకకి రుచి తెలిసేలానూ చేస్తుంది. కాసిని బొప్పాయి ముక్కలు, కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగితే అరుచి తగ్గుతుంది.
* పీచుతోపాటు ఇందులో ఉండే పొటాషియం, ఇతర విటమిన్లు హృద్రోగాల్ని రానివ్వవు. డయాబెటిస్‌ వల్ల వచ్చే హృద్రోగాల్ని పచ్చిబొప్పాయి తగ్గిస్తుంది.
* ఇందులోని పపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణశక్తిని పెంచుతుంది. అందుకే ఈ పపైన్‌ని ట్యాబ్లెట్లుగా మార్చి జీర్ణసమస్యలకి మందుగా వాడుతున్నారు. బొప్పాయికి పొట్టలోని నులిపురుగుల్ని చంపేసే గుణం కూడా ఉంది.
* ఎముకల పరిపుష్టికి ఇందులోని విటమిన్‌-కె ఎంతో తోడ్పడుతుంది. ఇది శరీరం కాల్షియంను పీల్చుకునేలా చేయడంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఆర్థ్రైటిస్‌నీ నిరోధిస్తుంది. రోజూ బొప్పాయి తినేవాళ్లలో కీళ్లనొప్పులు రావు.
* శరీరభాగాల్లో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ లేదా మంటని తగ్గించేందుకు ఇందులోని కోలీన్‌ ఎంతో సహాయపడుతుంది.
* బొప్పాయి గుజ్జుని పుండ్లూ గాయాలమీద పెట్టడంవల్ల అందులోని ఎంజైమ్స్‌ కారణంగా అవి త్వరగా తగ్గుతాయి. అందుకే దీన్ని అనేక రకాల ఆయింట్‌మెంట్లలో వాడతారు.
* బొప్పాయి పండు బీపీనీ తామరవ్యాధినీ తగ్గిస్తుంది. పచ్చిబొప్పాయి శృంగార ప్రేరితంగానూ పనిచేస్తుంది.
* నెలసరి క్రమంగా రానివాళ్లలో పచ్చిబొప్పాయి తిన్నా రసం తాగినా అది సరవుతుంది. బొప్పాయి శరీరంలో వేడిని పుట్టిస్తుంది కాబట్టి ఇది ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా నెలసరిని క్రమబద్ధీకరిస్తుంది.
* పులియబెట్టిన బొప్పాయినుంచి పపైన్‌ అనే ఆయింట్‌మెంట్‌ను తయారుచేస్తున్నారు. దెబ్బతిన్న వెన్నెముకకి
ఈ ఆయింట్‌మెంటే ఫలితాన్నిచ్చిందట. పపైన్‌ మంచి పెయిన్‌కిల్లర్‌ కూడా. నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూస జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్‌ చేస్తారు.
**ఆకులూ మంచివే!
డెంగీ జ్వరంలో రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ పడిపోతాయన్నది తెలిసిందే. అయితే ఆ సమయంలో కాసిని బొప్పాయి ఆకుల్ని రుబ్బి రసం పిండి తాగితే వాటి సంఖ్య పెరుగుతుందని కొందరు పోషకనిపుణులు చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలో మధుమేహాన్ని నియంత్రించుకునేందుకు బొప్పాయి పూలను కొద్ది నూనెలో వేయించి అన్నంతోబాటు తింటుంటారు. పంటినొప్పి, ఇతరత్రా దంత సమస్యలు ఉన్నవాళ్లు చెట్టు బెరడు లోపలి భాగాన్ని పేస్టులా చేసి నొప్పి ఉన్నచోట పెడితే వెంటనే తగ్గుతుంది. గర్భిణులను పచ్చిబొప్పాయి తిననివ్వకపోవడం తెలిసిందే. మనతోబాటు శ్రీలంక, పాకిస్థాన్‌ దేశాల్లో కూడా గర్భనిరోధానికీ గర్భస్రావానికీ దీన్ని వాడతారు. ఇందులోని లేటెక్స్‌ వల్ల గర్భాశయం ఒత్తిడికి లోనవడంతోబాటు, ప్రొజెస్టరాన్‌ శాతం తగ్గిపోయి గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువని పరిశీలనల్లోనూ తేలింది. లాంగర్‌ కోతుల్లో చేసిన పరిశోధనల్లో మగకోతులకి బొప్పాయి గింజల్ని ఇచ్చినప్పుడు అవి కాంట్రాసెప్టివ్‌గా పనిచేశాయట. అదండీ సంగతి… బొప్పాయి సౌందర్య లేపనం మాత్రమే కాదు, అద్భుత ఔషధఫలం కూడా.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com