కొల్లేటి జలదుర్గ శ్రీపెద్దింటి అమ్మ విశేషాలు

*7 నుంచి 21 వరకు జాతర ఉత్సవాలు -18న శ్రీజలదుర్గ, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం
ప్రకృతి అందాలు.. పక్షుల కిలకిలరావాలు.. కొల్లేరు సరస్సు.. నడిబొడ్డున కొలువైయున్న శ్రీపెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలకు ముస్తాబయ్యారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పాఢ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 7 నుంచి 21 వరకు అమ్మవారి జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తల మండలి, దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల ప్రత్యేక అధికారి గుడివాడ ఆర్డీవో ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు దఫాలుగా జాతర నిర్వహణపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
*పార్వతీదేవి ప్రతిరూపం
దక్షిణ కశ్మీరంగా పేరొందిన కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న కోటదిబ్బ కొల్లేటికోట గ్రామం శ్రీపెద్దింటి అమ్మవారు కొలువై ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తు కలిగి, విశాల నేత్రాలతో, పద్మాసనంలో ఉన్న అమ్మవారు శ్రీపార్వతీదేవి ప్రతి రూపమే. ఎన్నో మహిమలున్న అమ్మగా, పెద్దమ్మగా కొల్లేరులో నివసించే వడ్డి కులస్థులే కాకుండా అసోం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. వేంగీ చాళుక్యరాజుల పాలన నాటికే కొల్లేరు ప్రాంతం ఒక మండలంగా ఉంది. కొలను విషయ, సాగరు విషయగా పేర్లు ఉన్నాయి. నేటి కొల్లేటికోట గ్రామాన్ని అప్పట్లో కొలనుపురం, కొనువీడుగా వ్యవహరించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తుశకం 10 – 11 మధ్యకాలంలో వేంగీ చాళుక్య రాజులు వైవాహిక బంధవ్యాలు ఉండేవని కమలాకరపుర వల్లభుని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 1076లో విజయాదిత్య మరణంతో చాళుక్యరాజుల పాలన అంతరించింది. వేంగీ చాళుక్యరాజులపై మండలేశ్వరుడు అయిన తెలుగు భీముడు తిరుగుబాటు చేశాడు. తెలుగు భీముడు విజయాదిత్య చక్రవర్తిని వేంగీశ్వరునిగా చేశారు. వేంగీశ్వరుడే పార్వతీదేవిని పెద్దమ్మగా కొలిచిన చక్రవర్తి. పీఠాపురం శాసనాన్ని బట్టి కొల్లేరు నీటిని ఇంకించి, తోడించి, వంతెన వేయించి మధ్యలో అభేద్యమైన దుర్గాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారం ఉంది. ఈ దుర్గం చుట్టూ 150 రాజహస్తాల వెడల్పు, 7 నిలువుల లోతు, 3 కోశాల చుట్టుకొలత ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. కాలక్రమంలో ఇక్కడి మేడలు, మిద్దెలు, దేవళాలు కనుమరుగయ్యాయి. అమ్మవారి గుడి మాత్రమే నేటికి నిలిచి ఉంది. చైనా బౌద్ధమత యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్‌ ఈ సరస్సును మహత్తరమైన మంచినీటి సరస్సుగా అభివర్ణించాడు. దండి మహాకవి దశకుమార చరిత్రలో కొల్లేటికోట రాజు తెలుగుభీముని గురించి గొప్పగా రాశారు. ఇటీవల కాలంలో దేవాదాయ శాఖ, దాతల సాయంతో ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
*ఉత్సవ కార్యక్రమాలు..
ఈ నెల 7నుంచి 21 వరకు అమ్మవారి ఆలయం వద్ద పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రోజూ అమ్మవారికి విశేష అలంకారంతో పాటు పూజా కార్యక్రమాలు చేస్తారు. 18న శ్రీజలదుర్గ గోకర్ణేశ్వరస్వామివారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరుగుతుంది. రోజూ రాత్రి ఏడు గంటల నుంచి భక్తులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
*ఎలా చేరుకోవాలంటే..
విజయవాడ నుంచి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. కైకలూరు రైల్వే స్టేషన్లో దిగి ఆలపాడు మీదగా రోడ్డుమార్గంలో ప్రయాణించి అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. ఏలూరు, భీమవరం నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా అమ్మవారి సన్నిధికి చేరవచ్చు. ఆలపాడు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడి నుంచి లాంచీల్లో అమ్మవారి దర్శించుకోవచ్చు.
1. ‘ప్రపంచ వారసత్వ ప్రాంతం’గా రామప్ప గుడి పేరు ప్రతిపాదన
ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయం ‘ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితా’లో స్థానం పొందేలా కేంద్రం కృషిచేస్తోంది.ఈ మేరకు ఆ గుడి పేరును 2019 సంవత్సరానికి నామినేట్ చేసినట్లు వరంగల్‌కు చెందిన కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ పేర్కొంది. ట్రస్టీ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ బీవీ పాపారావు మంగళవారం హన్మకొండలో విలేకరులతో మాట్లాడుతూ, దేశం నుంచి ఏటా ఒక వారసత్వ ప్రాంతాన్ని గుర్తించి యునెస్కోకు నామినేట్ చేస్తారన్నారు. ఆ ప్రాంతానికి ఆ అర్హత ఉందా అనే కోణంలో వారు పరిశోధించి ధ్రువీకరిస్తారని తెలిపారు. రామప్ప గుడికి వారసత్వ ఖ్యాతి గురించి అనేక పత్రాలను సిద్ధంచేసి ఇప్పటికే కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు అందజేశామన్నారు.మరో ట్రస్టీ పాండురంగారావు మాట్లాడుతూ..తేలియాడే ఇటుకలు, ఇసుక పునాదులు గల అసాధారణ ప్రాచీన కట్టడం రామప్ప దేవాలయమన్నారు.
2. మల్లన్న రథోత్సవం.. భక్తులకు ఆనందోత్సవం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి మంగళవాయిద్యాలతో వెండి పల్లకీలో తీసుకువచ్చి రథంపై అధిష్ఠింపజేశారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణ, కళాకారుల నృత్య సందడి నడుమ ప్రధాన పురవీధిలో శ్రీస్వామిఅమ్మవార్లకు రమణీయంగా రథోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించి ఆధ్యాత్మికానుభూతి పొందారు. రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణిలో ఆది దంపతులకు వైభవంగా తెప్పోత్సవం జరిగింది.
3. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
లక్ష్మీనరసింహ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు 8 నుంచి మొదలుకానున్నాయి. 11 రోజులు కొనసాగే ఈ వేడుకలకు సన్నాహాలు సాగుతున్నాయని ఈవో గీతారెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు. వారిద్దరూ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, త్రిదండి చినజీయర్‌స్వామి సూచనలతో ఉత్సవాలను బాలాలయంలోనే నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం స్వస్తివాచనంతో శ్రీకారం జరుగుతుందని, కార్యక్రమాల్లో భాగంగా 13 నుంచి 17 వరకు ఐదురోజులపాటు సాంస్కృతికోత్సవాలు ఉంటాయని చెప్పారు. ఎదుర్కోలు 14 రాత్రి ఉంటుంది. స్వామి, అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని 15 ఉదయం కొండపై బాలాలయంలో, రాత్రి కొండ కింద పట్టణంలో నిర్వహిస్తారు. రథోత్సవాన్ని కూడా 16న అదేవిధంగా చేపడతారు. 17న చక్రతీర్థం, 18న అష్టోత్తర శతఘటాభిషేకం జరుగుతాయి. ప్రత్యేక అభిషేకంతో ఉత్సవాలకు తెరపడుతుంది. బ్రహ్మోత్సవాల తరుణంలో.. 8 నుంచి 18 దాకా భక్తులు జరిపే నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన, నారసింహ హోమ పర్వాలు రద్దవుతాయని ఈవో ప్రకటించారు.యాదాద్రిలో శివుడికి లక్ష బిల్వార్చనయాదాద్రి పుణ్యక్షేత్రంలోని పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి చరమూర్తుల మందిరంలో మంగళవారం లక్ష బిల్వార్చన నిర్వహించారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా, ఆ పత్రాలతో స్వామిని కొలిచి, రాత్రివేళ రథ పటోత్సవం నిర్వహించారు. హరిహరులతో విలసిల్లుతున్న ఈ క్షేత్రంలో, శైవాగమ ఆచారంగా శివాలయ వార్షికోత్సవాల నిర్వహణ చేపట్టారు.
4. భక్తిశ్రద్ధలతో ‘మల్లన్న’ పెద్దపట్నం
కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి వారి క్షేత్రంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయవర్గాలు ఒగ్గు పూజారులతో పెద్ద పట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవాన్ని, స్ధల పురణాన్ని ఒగ్గు పూజారులు పంచరంగులతో తయారు చేసిన పట్టం వద్ద జానపదరీతిన పాటలు పాడుతూ పెద్దపట్నం కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా శివరాత్రి సందర్బంగా లింగోద్భవ కాలం రాత్రి 12గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం, రాతిగీరలు తదితర ప్రాంతాలలో ఊరేగించారు. ఒగ్గు పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో పంచరంగులు కుంకుమ, పసుపు, బియ్యం పిండి, తంగెడు పిండి, గులాలు తదితర వాటి చూర్ణాలను కలిపి ముగ్గులుగా వేసి పట్నంగా తయారు చేశారు. అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పెద్దపట్నం దాటగానే భక్తులు పట్నం దాటి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ సెవెల్లి సంపత్, డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేష్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
5. ఈ 8 నుంచి 18 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించి ఉత్సవ ప్రాధాన్యతను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బీ. నర్సింహమూర్తిలు తెలిపారు. మంగళవారం యాదాద్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు మరో మూడు రోజుల్లో యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం వేళల్లో అలంకారసేవలు, రాత్రి వేళల్లో శ్రీవారి వాహనసేవలు ప్రతీ రోజు జరుగుతాయన్నారు.రాష్ట్ర గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ విశిష్ట అతిధిగా 15న ఉదయం కళ్యాణోత్సవానికి హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.
6. త్రికోటేశ్వరుని ఆదాయం రూ.కోటి 32 లక్షలు
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి కోటి 32 లక్షల 60 వేల 361రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి యడ్లపల్లి బైరాగి తెలిపారు. మంగళవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. పూజల టిక్కెట్లు, ప్రసాదాల అమ్మకాలు, సేవలు, వివిధ పథకాలు, అన్నదానం తదితర అంశాలకు సంబంధించి ఆదాయం వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం కన్నా రూ.9లక్షల 60 వేల 916 అధికంగా లభించిందన్నారు. యూఎస్‌ డాలర్లు 152, నేపాల్‌ కరెన్సీ 5 లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఉత్సవ అధికారి ఎం.వి.సురేష్‌బాబు, ఈవో కె.శ్రీనివాస్‌, వంశపారంపర్య ధర్మకర్త ఎం.వి.రామకృష్ణ బహద్దూర్‌, పాలక మండలి సభ్యులు బి.కె.ప్రసాద్‌, అనుమోలు వెంకయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.
7.శుభమస్తు
తేది : 6, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(నిన్న రాత్రి 7 గం॥ 7 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 32 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష
(నిన్న సాయంత్రం 3 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 11 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : చతుష్పాద
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 8 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 53 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 50 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 27 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 29 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 31 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 23 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : కుంభము
8.చరిత్రలో ఈ రోజు/మార్చి 6
1475 : ప్రముఖ చిత్రకారుడు మైఖేలాంజెలో జననం.(మ.1564).
1508 : మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి హుమాయూన్ జననం.
1899 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం.
1913 : హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు జననం (మ.1966).
1919 : ప్రముఖ సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం.
1936 : పాత తరం తెలుగు సినిమా కథానాయిక కృష్ణకుమారి జననం.
1937 : అంతరిక్షంలో కి వెళ్ళిన మొదటి మహిళ గా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాలెంతినా తెరిష్కోవా జననం.
9.తిరుమల సమాచారం
ఈరోజు బుధవారం *06-03-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ……
శ్రీ వారి దర్శనానికి *1* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు….
శ్రీ వారి సర్వ దర్శనానికి *8* గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *03* గంటల సమయం పడుతోంది..
నిన్న మార్చి *5* న *55,837* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *:3.14* కోట్లు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com