Politics

సీఐడీకి దొరకని దేవినేని ఉమా-తాజావార్తలు

సీఐడీకి దొరకని దేవినేని ఉమా-తాజావార్తలు

* తిరుపతిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మార్ఫింగ్‌ వీడియో ప్రదర్శించారనే ఆరోపణల కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరని కుటుంబసభ్యులు సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని దర్యాప్తు బృందం ఇప్పటికే దేవినేని ఉమాకు రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. మొదటిసారి పది రోజుల సమయం కావాలని ఆయన కోరారు. తర్వాత ఈనెల 19న విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు గొళ్లపూడిలోని నివాసానికి నోటీసు అంటించారు. రెండోసారి కూడా దేవినేని విచారణకు హాజరుకాలేదు. దీంతో సీఐడీ అధికారులు ఇవాళ నేరుగా దేవినేని ఇంటికి వెళ్లారు.

* రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వైభవోపేతంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావంతో సామూహికంగా జరుపుకోలేక పోతున్నామని సీఎం అన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో దేవాలయ పూజారులు, అధికారుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించనున్నట్లు చెప్పారు. రాములోరి కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్‌ ప్రసారాల ద్వారా భక్తులందరూ దర్శించుకోవాలని కోరారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని సీఎం ఆకాంక్షించారు.

* కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిష్ఫ్రయోజనకరమైన చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యలో భట్టి ఓ ప్రకటన విడుదల చేశారు. జన సంచారం స్వల్పంగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టడంలో ఔచిత్యం ఏమిటో.. ఈ విధమైన చర్యలు కరోనా వ్యాప్తిని ఏ విధంగా నిలువరిస్తాయో అర్థం కావడం లేదన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉందని భట్టి విమర్శించారు.

* రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ), తెలంగాణ జనసమితి (తెజస) కోరాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి టీపీసీసీ నేతలతో పాటు తెజస అధ్యక్షుడు కోదండరాం వేర్వేరుగా లేఖలు రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాయి.

* అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ‌ అందించింది. ఈ మేరకు సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.

* దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులు కిక్కిరిసిపోవడంతో పడకలు ఖాళీ లేక కోవిడ్‌ బాధితులు అల్లాడుతున్నారు. దగ్గు, ఆయాసం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ఒక్క ఆసుపత్రిలోనూ బెడ్‌ ఖాళీ లేక పేషెంట్లు విలవిల్లాడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. 19,322 కోవిడ్‌ బెడ్స్‌కు గాను 3,340 ఖాళీగా ఉన్నట్టు, 4,376 కోవిడ్‌ ఐసీయూ బెడ్స్‌కు గాను 57 ఖాళీగా ఉన్నట్టు ఆన్‌లైన్‌ పోర్టల్‌ చూపుతున్నా.. ఏ ఒక్క ఆసుపత్రి నెంబరూ పలకదు. ప్రతి ఆసుపత్రిలోనూ ఫోన్‌ బిజీ టోన్‌ వస్తోంది. టెస్టింగ్‌ కోసం, ఫలితం కోసం నాలుగైదు రోజులు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

* కరోనా వైరస్‌ రాకతో ప్రజల జీవన విధానంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. సామాజిక దూరం, శానిటైజర్లు, మాస్క్‌ల‌ వాడకం.. ఇలా ఇవన్నీ దాదాపు ఏడాదిన్నరకు పైగా మనుషుల జీవితంలో భాగమయ్యాయి. ఈ క్రమంలో కరోనా కేసులతో పాటు మాస్క్‌ల వాడకం కూడా పెరుగుతోంది. అయితే మార్కెట్‌లో దొరుకుతున్న మాస్క్‌లు కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి వదిలేయడం, పర్యావరణ హితం కాకపోవడం వల్ల వ్యర్థాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి పర్యావరణ హితమైన మాస్క్‌ను తయారు చేశాడు.

* దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు మామూలుగా లేవు. ఒకవైపు రోజురోజుకు రికార్డు స్తాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మరోవైపు కోవిడ్-19 రోగులకు ఆసుపత్రులలో మందుల కొరత, సరిపడినన్ని బెడ్లు లేక, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేక దేశవ్యాప్తంగా అనేకమంది రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అటు రాజకీయవేత్తల నుంచి ఇటు సామాన్యుల దాకా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిఇలా ఉంటే కరోనా చికిత్సలో కీలకమైన రెమి‌డెసివిర్‌‌ ఔషధం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌​ దర్శకుడు హన్సాల్ మెహతా కరోనా బారిన పడిన తన కుమారుడి చికిత్సకోసం రెమి‌డెసివిర్‌ మందు దొరకడం లేదని సాయం చేయాలంటూ సోషల్‌ మీడియాలో వేడుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ఈ పోస్ట్‌కు ఆయన అభిమానులు, ఇతర నెటిజనుల నుంచి అపూర్వ స్పందన రావడం విశేషం. పలువురు నెటిజన్లు ఈ ఔషధం లభ్యత తదితర వివరాలతో మెహతాకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

* కరోనావైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూను విధింస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూఅమలుపై పోలీస్‌ ఐజీలు, కమీషనర్లు, ఎస్పీలతో తెలంగాణ డీజీపీ ఎమ్‌ మహేందర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జీవోలో పేర్కొన్న విధంగా పటిష్టంగా కర్ప్యూను అమలుచేయాలని తెలిపారు. అంతేకాకుండా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసివేయాలని పేర్కొన్నారు. ఏ గూడ్స్ వాహనాలను ఆపకూడదన్నారు.

* నగర వాసులు నైట్‌ కర్ఫ్యూని విధిగా పాటించాలని రాచకొండ కమిషనరేట్‌ సీపీ మహేష్ భగవత్‌ కోరారు. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. ఇప్పటికే రాష్ట్రంలో 5,900 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఈరోజు నుంచి మే1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. బార్లు, హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్, షాప్స్ రాత్రి ఎనిమిది గంటలకు ముసివేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, మెడికల్, ఎమర్జెన్సీ సర్విస్, మీడీయా ఉద్యోగులు ఐడికార్డ్స్ వెంట పెట్టుకోవాలి అని సూచించారు.