కథ కంచికి

ఆల్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ సాధించాలన్న భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఏడో ప్రయత్నంలోనూ ఆమె విఫలమైంది. బుధవారం ప్రారంభమైన ఆల్‌ ఇంగ్లాండ్‌లో సింధుకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ సింధు 16-21, 22-20, 18-21తో సుంగ్‌ హ్యున్‌ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. ఒక గంటా 21 నిమిషాల పాటు హోరాహోరీగా మ్యాచ్‌ సాగింది. తొలి గేమ్‌ 17 పాయింట్ల వరకు నువ్వానేనా అన్నట్లు నడిచింది. ఐతే వరుసగా 4 పాయింట్లతో సుంగ్‌ 21-16తో తొలి గేమ్‌ గెలుచుకుంది. రెండో గేమ్‌లో సింధు గొప్పగా పుంజుకుంది. 14-18తో వెనుకబడిన సింధు.. క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లు సంధించి 17-18తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. ఐతే వరుసగా 2 పాయింట్లతో సుంగ్‌ మ్యాచ్‌ పాయింటుకు చేరువైంది. ఈ సమయంలో పట్టుదలగా ఆడిన సింధు వరుస పాయింట్లతో చెలరేగింది. బాడీ స్మాష్‌ సంధించి 22-20తో రెండో గేమ్‌ నెగ్గి మ్యాచ్‌లో ఆశల్ని సజీవంగా నిలుపుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఏకపక్షంగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలు సాగిన ఈ గేమ్‌లో అనవసర తప్పిదాలు సింధుకు నష్టం చేశాయి. ఒకదశలో 13-20తో ఓటమి అంచుల్లో ఉన్న సింధు వరుసగా 5 పాయింట్లతో ఆశలు రేపింది. ఐతే విజయానికి కావాల్సిన ఒక పాయింటును గెలుచుకున్న సుంగ్‌.. 21-18తో సింధు ఆశలకు తెరదించింది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ ముందంజ వేశాడు. 21-13, 21-11తో బ్రైస్‌ లెవెరెడ్జ్‌ (ఫ్రాన్స్‌)ను చిత్తు చేశాడు. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సాయి ప్రణీత్‌ 21-19, 21-19తో ప్రణయ్‌పై నెగ్గాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ 21-16, 26-28, 16-21తో ఏడో సీడ్‌ షిహో తనక, కొహరు యొనెమోటో (జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com