అరసవల్లిలో భక్తులకు ఆశాభంగం–ఆధ్యాత్మికం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యానారాయణస్వామి పాదాలను సూర్య కిరణాలు తాకే దృశ్యాన్ని చూసేందుకు వచ్చే భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఏటా మార్చి 9, 10 తేదీల్లో అదేవిధంగా అక్టోబర్‌ 1,2 తేదీల్లో సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకుతుంటాయి. ఆలయ పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి స్వామివారి పాదాలను తాకుతుంటాయి. కేవలం 3-4 నిమిషాలు మాత్రమే ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అయితే ఈ రోజు సూర్య కిరణాలు పడకుండా మేఘాలు అడ్డుపడ్డాయి. రేపు స్వామి వారి మూలవిరాట్‌ను సూర్య కిరణాలు తాకే అవకాశం ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
1. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఆది పూజలో భాగంగా అగ్నిని కొలుస్తూ ప్రతిష్ఠాపన చేపట్టారు. జల పూజ, ఆలయ శుద్ధి పర్వాలతో మొదలైన ఈ వేడుకలు మరో 10 రోజులు భక్తజనులను అలరించనున్నాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారమే ఉదయం 10 గంటలకు మొదలైన స్వస్తివాచనం 12 గంటలకు ముగిసింది. రాత్రివేళ మృత్తికా సంగ్రహణ క్రతువు నిర్వర్తించారు. పుట్ట మట్టిని తెచ్చి, మంత్ర పఠన సహితంగా నవధాన్యాలు నాటారు. విష్వక్సేన ఆరాధనతో మహోత్సవాలకు అంకురార్పణ జరిగినట్లు ఆలయ ప్రధాన పూజారులు ప్రకటించారు. తొలి పూజలో జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
2. తితిదే ఈవోగా సింఘాల్‌ మరో ఏడాది పొడిగింపు
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా డిప్యుటేషన్‌పై ఉన్న ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది మే 9 నుంచి వచ్చే ఏడాది మే 8 వరకు మరో ఏడాది పాటు ఆయన అక్కడే సేవలు అందించేలా కాలపరిమితిని పొడిగించింది.
3. ఘనంగా కైలాసగిరి ప్రదక్షిణోత్సవం
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కైలాసగిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమస్కంధమూర్తి, జ్ఞానాంబిక ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. కైలాసగిరి పర్వతశ్రేణులను ఆనుకుని దాదాపు 21 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రదక్షిణోత్సవంలో పాల్గొనేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల శివనామస్మరణలతో కైలాసగిరి మార్మ్లోగింది.
4. కీసరగుట్ట స్వామి ఆదాయం రూ.72,98,105
కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా మొత్తం రూ.72,98,105 ఆదాయం వచ్చిందని దేవస్థానం చైర్మన్ తటాకం నారాయణశర్మ తెలిపారు. శుక్రవారం దేవస్థానం ప్రాంగణ మందిరంలో దేవస్థానం సిబ్బంది అంతా కలిసి హుండీని లెక్కించారు. మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా ఈనెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మాత్రమే హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మిగతా 6,7 తేదీలకు సంబంధించిన హుండీని తరువాత లెక్కిస్తామని తెలిపారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.16,57,105, స్వామివారికి అభిషేకం టిక్కెట్ల, దర్శనం ద్వారా రూ.24,41,000 , లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 32 లక్షలు, మొత్తం రూ.72,98,105లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి లక్ష్మీనర్సింహమూర్తి, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
5. చరిత్రలో ఈ రోజు/మార్చి 9
1916 : పోలెండ్‌పై జర్మనీ యుద్ధం ప్రకటించింది.
1934 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కిన రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ జననం (మ.1968).
193 : మహాత్మా గాంధీ మొదటిసారిగా హైదరాబాదులో పర్యటించాడు.
1943 : ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డు నెలకొల్పిన బాబీ ఫిషర్ జననం(మ.2008).
1952 : రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు మరియు దౌత్యవేత్త అలెక్సాండ్రా కొల్లొంటాయ్ మరణం (జ.1872).
1979 : గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం (జ.1890).
1981 : మాలిక్యులర్‌ బయాలజీకి మార్గదర్శకుడు మాక్స్‌ డెల్‌బ్రక్ మరణం (జ.1906).
1985 : భారతీయ క్రికెట్ ఆటగాడు పార్థివ్ పటేల్ జననం.
1994 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి మరణం (జ.1908).
1997 : ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి మరణం (జ.1907).
image.gif6. శుభమస్తు
తేది : 9, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 34 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 1 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(నిన్న రాత్రి 11 గం॥ 16 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 17 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు ఉదయం 12 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 0 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 10 గం॥ 40 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 51 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 58 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 29 ని॥ లకు
సూస్తమయం : సాయంత్రం 6 గం॥ 24 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : మీనము
7.సింహాచలం నారసింహ మహాయజ్ఞం
దేశం, రాష్ట్రంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని.. పంటలు బాగా పండి జనులంతా సిరిసంపదలతో సుఖించాలని దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం కలగాలన్న సంకల్పంతో సింహాచలంలో శ్రీదసుర్శన నారసింహ మహాయజ్ఞాన్నికి శ్రీకారం చుడుతున్నారు. సింహాచలం కొండ దిగువన కృష్ణాపురం గోశాల ఆవరణలోని నృసింహవనంలో మార్చి పదకొండు నుంచి ప్రారంభమయ్యే ఈ మహాయజ్ఞం నవాహ్నిక యజ్ఞం సవాహ్నిక దీక్షతో మార్చి ఇరవై వరకు జరుగుతుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కే.రామచంద్రమోహన్ తెలిపారు. 32హోమగుండాల యజ్ఞశాలలో 32భీజాక్షరాలతో కూడిన నృశింహ మూలమంత్రాన్ని జపిస్తూ పండితులు యాగం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈయాగంలో 125మంది ఋత్వికులు పాల్గొంటారని వివరించారు. సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో భాగంగా ఇష్టి యాగాలను కూడా నిర్వహించేందుకు దేవస్థానం నిర్ణయించింది. మార్చి 13 నుంచి 19 వరకు ఏడూ ఇష్టి యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాలలో భక్తులు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. ఈ మహాయాగాన్ని పురస్కరించుకుని ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు సింహగిరి పై జరిగే పలు ఆర్జిత సేవలను దేవస్థానం రద్దు చేసింది.
8. పెద్దింటి అమ్మకు పంచామృతాభిషేకాలు
కైకలూరుమండలంలోని కొల్లేటికోటలో కొలువైయున్న శ్రీపెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి విశిష్టమైన రోజు కావడంతో పంచామృత అభిషేకాలు, లక్ష చామంతి అర్చన, లక్ష కుంకుమార్చన, సప్తావరణ కలశపూజ, పుష్పాలంకరణ, ధూపసేవ వంటి కార్యక్రమాలు చేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి బాలభోగం, పంచహారతుల వంటి పూజలు చేశారు. మాజీ శాసన సభ్యుడు జయమంగళ వెంకటరమణ అమ్మవారికి వస్త్రాలంకరణ చేయించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు పుష్పాలంకరణ, భీమవరానికి చెందిన కలిదిండి రామకృష్ణంరాజు దంపతులు భక్తులకు ఉచిత ప్రసాదం పంచిపెట్టారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, పిల్లలు, వృద్ధులకు ఉచితంగా పాలు అందజేశారు. భక్తులు పాల పొంగళ్లు, వంటలు చేసుకునేందుకు ఆలయం ఆధ్వర్యంలో ఉచిత పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. సర్కారు కాలువ నుంచి అమ్మవారి ఆలయం వరకు నీటి ట్యాంకర్లతో దుమ్ము లేవకుండా రోడ్లను తడిపించారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కుబడులు సమర్పించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ జల్లురి వెంకన్న, కమిటీ సభ్యులు, దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో ఉత్సవాలను పర్యవేక్షించారు. కైకలూరుకు చెందిన శ్రీషిర్డీ సాయి మురళీ కోలాట బృందంవారిచే కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కోలాట బృందం మహిళలను ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com